160 కిమీ రేంజ్..రోజుకు 650 స్కూటర్లు అమ్మకం.. మధ్యతరగతి మనసు దోచుకుంటున్న రిజ్తా
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవాలనుకునే సామాన్యులకు ఇప్పుడు ఈవీలే ఏకైక మార్గంగా కనిపిస్తున్నాయి. ఈ రేసులో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన మార్కును చూపిస్తోంది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్తా(Ather Rizta) ఇప్పుడు మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. 2026 ప్రారంభంలో ఈ స్కూటర్ అమ్మకాలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. రోజుకు సగటున 650 స్కూటర్లు అమ్ముడవుతున్నాయంటే దీనికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఏథర్ ఎనర్జీ తాజాగా విడుదల చేసిన 2026 జనవరి విక్రయాల గణాంకాలు ఈవీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఒక్క నెలలోనే కంపెనీ ఏకంగా 20,155 యూనిట్ల రిజ్తా స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. గతేడాది అంటే 2025 జనవరిలో ఇదే స్కూటర్ కేవలం 11,978 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే ఏడాది కాలంలోనే అమ్మకాల్లో 68.27 శాతం భారీ వృద్ధి నమోదైంది. కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ అవసరాలకు తగ్గట్టుగా ఉండటం వల్లే రిజ్తాఇంతటి విజయాన్ని సాధించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఏథర్ రిజ్తా ఇంతటి సంచలనం సృష్టించడానికి ప్రధాన కారణం దాని ధర. ప్రస్తుతం ఇది రూ. 1.05 లక్షల నుంచి రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో లభిస్తోంది. ఇందులో రిజ్తా ఎస్ (Rizta S), రిజ్తా జెడ్ (Rizta Z) అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే ఇది మరింత విశాలంగా ఉండటమే కాకుండా, మెయింటెనెన్స్ ఖర్చు (Maintenance Cost) కూడా చాలా తక్కువ. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈ స్కూటర్ పై ఎక్కువగా మక్కువ చూపుతున్నాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారు ముందుగా చూసేది రేంజ్. రిజ్తా ఇందులో ఎక్కడా తగ్గదు. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ 123 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ఏకంగా 160 కిలోమీటర్ల (IDC) మౌలేజీని అందిస్తుంది. ఇందులో వాడిన ఎలక్ట్రిక్ మోటార్ 4.3 kW పవర్, 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.7 సెకన్లలోనే సున్నా నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు.

ఏథర్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు. రిజ్తాలో 7-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది, ఇది నావిగేషన్ నుంచి కాల్ అలర్ట్స్ వరకు అన్నీ చూపిస్తుంది. ఇందులో స్మార్ట్ (Smart), ఈకో (Eco), జిప్ (Zip) అనే మూడు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉండటం వల్ల హెల్మెట్ లేదా ఇతర సామాగ్రిని సులభంగా ఉంచుకోవచ్చు. డెక్కన్ గ్రే, సియాచిన్ వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. సేఫ్టీ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు రైడర్ కు మంచి కంఫర్ట్ ను ఇస్తాయి.
ప్రస్తుతం భారత మార్కెట్లో ఏథర్ రిజ్లాకు ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X), బజాజ్ చేతక్ (Bajaj Chetak), టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) వంటి స్కూటర్లు గట్టి పోటీనిస్తున్నాయి. అయినప్పటికీ, ఏథర్ అందించే బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ దీనిని రేసులో ముందు ఉంచుతోంది. తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్ కావాలనుకునే వారికి ఇప్పుడు రిజ్లానే బెస్ట్ ఆప్షన్ గా మారింది.


Click it and Unblock the Notifications








