బైక్ అంటే ఇలా ఉండాలి బాసూ.. వంగి డ్రైవ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2026 గెరిల్లా 450
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పవర్‌ఫుల్ రోడ్‌స్టర్ గెరిల్లా 450ని సరికొత్త హంగులతో 2026 ఎడిషన్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈసారి కేవలం రంగులు మార్చడమే కాకుండా, రైడింగ్ ప్రియుల కోసం అపెక్స్ (Apex) అనే సరికొత్త స్పోర్టియర్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. మెరుగైన టైర్లు, అదిరిపోయే ఎర్గోనామిక్స్‌తో వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 125 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేయడం విశేషం.
కొత్తగా వచ్చిన Apex వేరియంట్ ప్రత్యేకతలేంటి?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 లో అపెక్స్ అనే కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను చేర్చింది. పేరుకు తగ్గట్టుగానే ఇది రైడర్లకు అత్యుత్తమ పర్ఫార్మెన్స్‌ను అందించేలా రూపొందించబడింది. సాధారణ మోడల్‌లో ఉండే సీయట్ (CEAT) టైర్ల స్థానంలో ఇందులో ప్రీమియం వ్రెడెస్టైన్ సెంచురో ఎస్టీ (Vredestein Centuro ST) టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లు పొడి రోడ్లపై 8 శాతం, తడి రోడ్లపై ఏకంగా 17 శాతం అదనపు గ్రిప్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. అంటే వర్షాకాలంలో కూడా ఈ బైక్‌ను ధైర్యంగా నడపవచ్చు.

రైడింగ్ పొజిషన్‌లో కీలక మార్పులు
స్పోర్టీ రైడింగ్ అనుభూతి కోసం అపెక్స్ వేరియంట్‌లో హ్యాండిల్‌బార్ సెటప్‌ను మార్చారు. సాధారణ గెరిల్లా 450 తో పోలిస్తే ఇందులో హ్యాండిల్‌బార్‌ను 56 మి.మీ కిందకు, 57 మి.మీ ముందుకు జరిపారు. దీనివల్ల రైడర్ కొంచెం ముందుకు వంగి కూర్చోవాల్సి ఉంటుంది, ఇది హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు బైక్‌పై మంచి కంట్రోల్ ఇస్తుంది. అలాగే దీనికి అల్యూమినియం హ్యాండిల్‌బార్, బార్-ఎండ్ మిర్రర్స్‌ను కూడా జోడించారు.
స్టైలింగ్, కలర్ ఆప్షన్స్
2026 గెరిల్లా 450 అపెక్స్ వేరియంట్ మూడు కొత్త రంగుల్లో లభిస్తుంది.. అపెక్స్ రెడ్, అపెక్స్ గ్రీన్, అపెక్స్ బ్లాక్. ఈ బైక్ లుక్‌ను పెంచడానికి రిమూవబుల్ పిలియన్ సీట్ కౌల్ (సీటు వెనుక కవర్), హెడ్‌లైట్ కౌల్, వీల్ రిమ్స్‌పై మ్యాచింగ్ టేపులను ఇచ్చారు. స్టాండర్డ్ మోడల్‌లో ఇవన్నీ యాక్సెసరీస్ రూపంలో కొనుక్కోవాలి, కానీ అపెక్స్ వేరియంట్‌లో ఇవి బైక్‌తో పాటే వస్తాయి. ఫ్రంట్ ఫోర్క్ కవర్లను తొలగించడం వల్ల దీనికి క్లీన్ అండ్ సింపుల్ లుక్ వచ్చింది.

మెకానికల్ సెటప్, ఇంజిన్ పవర్
బైక్ లోపల ఉండే ఇంజిన్ విషయానికి వస్తే ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటి లాగే శక్తివంతమైన 452సీసీ సింగిల్ సిలిండర్ షెర్పా ఇంజిన్ ఉంది. ఇది 40 పీఎస్ పవర్, 40 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ ఫీచర్లు రైడింగ్‌ను చాలా స్మూత్‌గా మారుస్తాయి. ఇందులో రెండు రైడింగ్ మోడ్లు ఉన్నాయి, వాటి పేర్లను ఇప్పుడు స్ట్రీట్ (Street), స్పోర్ట్ (Sport) గా మార్చారు.
టెక్నాలజీ, ఫీచర్లు
గెరిల్లా 450 లో ఉన్న 4-అంగుళాల గుండ్రని టీఎఫ్‌టీ (TFT) డిస్ప్లే అలాగే కొనసాగుతుంది. అయితే సాఫ్ట్‌వేర్ పరంగా కొన్ని అప్‌డేట్స్ ఇచ్చారు. గూగుల్ మ్యాప్స్ ఆధారిత నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యూఎస్‌బీ-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పాత హిమాలయన్, గెరిల్లా యజమానులకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఓటీఏ (Over-The-Air) ద్వారా లభించనున్నాయి. బైక్ బరువు 185 కేజీలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లుగా ఉంది.

ధరలు, వేరియంట్ల వివరాలు
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ధరలు వేరియంట్, రంగును బట్టి మారుతుంటాయి:
అపెక్స్ రెడ్ (Apex Red): రూ. 2,49,194
అపెక్స్ బ్లాక్/గ్రీన్: రూ. 2,56,387
డ్యాష్ (Dash) వేరియంట్: రూ. 2,49,194 నుంచి రూ. 2,67,116 వరకు.
ఫ్లాష్ (Flash) వేరియంట్: రూ. 2,72,479
రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. "గెరిల్లా 450 ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. 2026 అప్‌డేట్స్‌తో దీనిని మరింత పదును పెట్టాం. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా స్ట్రీట్-ఫోకస్డ్ లేదా స్పోర్ట్-ఫోకస్డ్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు" అని తెలిపారు.


Click it and Unblock the Notifications








