ఇక దారి మర్చిపోతామన్న భయం లేదు.. గూగుల్ మ్యాప్స్ సపోర్ట్‌తో వచ్చేసిన కొత్త చేతక్
ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంటి ముందు హమారా బజాజ్ అంటే ఒక ఎమోషన్. ఆ పాత చేతక్ స్కూటర్ శబ్దం వినబడితే చాలు, నాన్న ఆఫీసు నుంచి వచ్చారో లేక చుట్టాలు దిగారో అని పిల్లలందరూ రోడ్డు మీదకు పరుగెత్తే వారు.. కానీ కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది.. కానీ ఆ చేతక్ బ్రాండ్ మీద ఉన్న మమకారం మాత్రం మారలేదు.
అందుకే బజాజ్ ఆటో సంస్థ తన ఐకానిక్ చేతక్‌ను ఎలక్ట్రిక్ అవతారంలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు 2026లో తన కస్టమర్ల కోసం ఈ స్కూటర్‌ను మరిన్ని హంగులతో, సరికొత్త అప్‌డేట్స్‌తో ముస్తాబు చేసింది. కేవలం ఫీచర్లు మార్చడమే కాదు, సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా అదే ధరలో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ సి సిరీస్ (C Series) పేరుతో కొత్త వేరియంట్లను రంగంలోకి దించింది.

బజాజ్ ఆటో తన చేతక్ లైన్ అప్‌ను ఇప్పుడు చాలా పద్ధతిగా సి సిరీస్ (C Series) కింద విభజించింది. గతంలో ఉన్న క్లిష్టమైన పేర్లను తీసేసి, కస్టమర్లకు సులభంగా అర్థమయ్యేలా C 25, C 30, C 35 అని మూడు రకాలుగా మార్చింది. దీనివల్ల బడ్జెట్ కు తగ్గట్టుగా ఏ బండి కొనాలో కస్టమర్లు ఇట్టే నిర్ణయించుకోవచ్చు.
కేవలం పేర్లు మార్చడమే కాదు, ఇంజన్ పవర్ (మోటార్ పవర్) కూడా పెంచింది. ముఖ్యంగా టాప్ ఎండ్ మోడల్ అయిన C 35 లో మోటార్ పవర్ 4.5 kW నుంచి 4.8 kW కు పెరిగింది. దీనివల్ల బండిని స్టార్ట్ చేసినప్పుడు వచ్చే పిక్-అప్ చాలా స్మూత్ గా, వేగంగా ఉంటుంది.

మనం మొబైల్ లో ఎక్కువగా వాడేది గూగుల్ మ్యాప్స్. మరి అదే మన స్కూటర్ డిస్ ప్లే మీద కనిపిస్తే? ఆ కష్టాన్ని తీర్చేసింది బజాజ్. ఫ్లాగ్‌షిప్ మోడల్ C 35 01లో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఇంటెగ్రేషన్ ఇచ్చారు. చేతక్ యాప్ ద్వారా దీనిని కనెక్ట్ చేసుకుంటే, రోడ్డు మీద వెళ్లేటప్పుడు అడ్రస్ కోసం ఫోన్ తీయాల్సిన అవసరం ఉండదు.
కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ సౌకర్యాన్ని కల్పించడం విశేషం. పాత మ్యాపింగ్ సిస్టమ్ కంటే ఇది చాలా వేగంగా,కచ్చితంగా పనిచేస్తుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వేగం తక్కువని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. అందుకే ఇప్పుడు అన్ని వేరియంట్లలో టాప్ స్పీడ్ ను పెంచారు.
* C 35 సిరీస్: గతంలో 73 kmph ఉంటే, ఇప్పుడు 80 kmph వేగంతో దూసుకెళ్తుంది.
* C 30 సిరీస్: 63 kmph నుంచి 70 kmph కు పెరిగింది.
* C 25 సిరీస్: 55 kmph నుంచి 60 kmph కు వేగాన్ని పెంచారు.
దీనివల్ల హైవేల మీద లేదా ఖాళీ రోడ్ల మీద ప్రయాణించినప్పుడు బండి స్లోగా ఉందన్న ఫీలింగ్ రాదు.

ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులకు పెద్ద సమస్య ఛార్జింగ్ టైమ్. కానీ కొత్త చేతక్ లో ఆ సమస్యకు చెక్ పెట్టారు. ముఖ్యంగా C 30 01 మోడల్ ఇప్పుడు 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవ్వడానికి కేవలం 2 గంటల 55 నిమిషాలు మాత్రమే తీసుకుంటుంది. గతంలో దీనికి దాదాపు 4 గంటలు పట్టేది. అంటే దాదాపు ఒక గంట సమయం ఆదా అవుతోంది.
ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఛార్జింగ్ పెడితే, మీరు భోజనం ముగించే లోపే బండి మళ్ళీ షికారుకు రెడీ అయిపోతుంది. గతంలో ఎకో (Eco), స్పోర్ట్ (Sport) రైడ్ మోడ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్ (కొండలు ఎక్కేటప్పుడు బండి వెనక్కి జారకుండా ఆపే ఫీచర్) వంటివి కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించి 'టెక్ ప్యాక్' తీసుకోవాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడు బజాజ్ గొప్ప మనసు చేసుకుని, C 35, C 30 సిరీస్ లలో వీటిని స్టాండర్డ్ ఫీచర్లుగా మార్చేసింది. అంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ కట్టకుండానే ఈ అద్భుతమైన ఫీచర్లను మీరు పొందవచ్చు. అలాగే సర్వీస్ సెంటర్ కి వెళ్లే పని లేకుండా ఫోన్ లాగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకునే ఓవర్-ది-ఎయర్ (OTA) సౌకర్యాన్ని కూడా మెరుగుపరిచారు.
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్ని అప్‌డేట్స్ చేసినా బజాజ్ ఒక్క రూపాయి కూడా ధర పెంచలేదు!
* C 25 (బేస్ మోడల్): రూ. 89,500 (రేంజ్: 113 కి.మీ)
* C 30: రూ. 99,500 (రేంజ్: 127 కి.మీ)
* C 35 01 (టాప్ ఎండ్): రూ. 1.34 లక్షలు (రేంజ్: 153 కి.మీ)
మెటల్ బాడీతో, క్లాసిక్ లుక్ తో, ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో వచ్చిన బజాజ్ చేతక్, ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లో మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతోంది. పాత జ్ఞాపకాలను, కొత్త ఫీచర్లను కలబోసి బజాజ్ చేసిన ఈ ప్రయోగం కచ్చితంగా వాహనదారుల మనసు గెలుచుకుంటుంది.


Click it and Unblock the Notifications