దేశం మెచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్.. 8 లక్షల మంది నమ్మకం.. షోరూమ్‌లకు వరుస క్యూలు!
భారత ద్విచక్ర వాహన రంగంలో బజాజ్ ఆటో (Bajaj Auto) మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఒకప్పుడు భారత రోడ్లపై పెట్రోల్ స్కూటర్లతో తనదైన ముద్ర వేసిన చేతక్ (Chetak) బ్రాండ్, ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోనూ అదే స్థాయి విజయాన్ని కొనసాగిస్తోంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 8 లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్‌ను దాటడం కంపెనీకి మాత్రమే కాకుండా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా పెరుగుతోందనడానికి కూడా నిదర్శనంగా చెప్పవచ్చు. సుమారు ఆరున్నర సంవత్సరాల క్రితం భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన బజాజ్ చేతక్, ప్రారంభంలో పరిమిత నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది.
అయితే కాలక్రమేణా కంపెనీ తన డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, ఛార్జింగ్‌కు అనుకూలమైన సాంకేతికతను అందించడం, పనితీరుతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. ఫలితంగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కాకుండా, కుటుంబాల మొదటి ఎంపికగా మారింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జనవరి 2020 నుంచి జూన్ 27, 2026 వరకు బజాజ్ ఆటో మొత్తం 8,00,085 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగదారులకు డెలివరీ చేసింది.

ఈ సంఖ్య భారత ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో బజాజ్ సాధించిన వేగవంతమైన వృద్ధిని స్పష్టంగా చూపిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థంగా అందిపుచ్చుకుంటూ కంపెనీ తన మార్కెట్ వాటాను కూడా గణనీయంగా పెంచుకుంది. ఈ విజయంతో బజాజ్ ఆటో, భారతదేశంలో 8 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన మూడవ ప్రధాన బ్రాండ్‌గా నిలిచింది. ఇప్పటికే మార్కెట్లో గట్టి పోటీ నెలకొన్నప్పటికీ, చేతక్ తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడంలో విజయవంతమైంది.
8 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం బజాజ్‌కు ఒక గొప్ప విజయమే కాకుండా, భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెప్పే కీలక సూచికగా కూడా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో కొత్త మోడళ్లతో పాటు మరింత ఆధునిక సాంకేతికతను పరిచయం చేయాలనే లక్ష్యంతో బజాజ్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో చేతక్ విక్రయాలు మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

బజాజ్ చేతక్ విజయానికి కేవలం బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు, కంపెనీ చేపట్టిన వ్యూహాత్మక ప్రణాళికలు కూడా ప్రధాన కారణంగా నిలిచాయి. సంవత్సరానికి సుమారు 4.80 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయగల అత్యాధునిక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా బజాజ్ పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. దీంతో దేశవ్యాప్తంగా కస్టమర్లకు తక్కువ సమయంలో వాహనాలను అందించే సామర్థ్యం కంపెనీకి లభించింది.
దేశవ్యాప్తంగా డీలర్‌షిప్, సర్వీస్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడం, బడ్జెట్‌లకు అనుగుణంగా మరిన్ని చేతక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. నాణ్యతను తగ్గించకుండా ధరలను మరింత అందుబాటులోకి తీసుకురావడం వల్ల చేతక్‌పై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ఫలితం 2024లో స్పష్టంగా కనిపించింది. ఆ ఏడాది బజాజ్ చేతక్ అమ్మకాలు ఏకంగా 168 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కేవలం ఒకే సంవత్సరంలో రెండు లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడవడం భారీ విజయం.

2025లో కూడా ఈ విజయ పరంపర కొనసాగింది. ఏడాదిలో 39 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన బజాజ్, మొత్తం 2,79,685 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. 2022లో కేవలం 4 శాతంగా ఉన్న బజాజ్ వాటా, 2026 మధ్య నాటికి 22 శాతానికి పెరిగింది. ప్రస్తుత సంవత్సరం జనవరి 1 నుండి జూన్ 27 వరకు కేవలం స్వల్ప వ్యవధిలోనే కంపెనీ 2,11,356 యూనిట్లను విక్రయించగలిగిందనేది కూడా గమనార్హం.


Click it and Unblock the Notifications