ఒకటో రెండో కాదు భయ్యా.. రోజుకు వేలల్లో బైకుల విక్రయం.. రోడ్ల మీద ఎక్కడ చూసినా ఈ కంపెనీవే
భారతీయ టూ వీలర్ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) మార్చి 2026 నెలకు సంబంధించిన సేల్స్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, తనదైన శైలిలో దూసుకుపోతున్న బజాజ్ మోడల్స్ సేల్స్ వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పల్సర్ బ్రాండ్ క్రేజ్ అస్సలు తగ్గలేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. మోడల్ వారీగా బజాజ్ సాధించిన ప్రగతిని గురించి తెలుసుకుందాం.
నెంబర్ వన్ సీటులో పల్సర్ 125cc:
బజాజ్ కంపెనీకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మోడల్ ఏదంటే అది నిస్సందేహంగా పల్సర్ 125cc (Bajaj Pulsar 125cc). మార్చి 2026లో ఈ మోడల్ ఏకంగా 65,898 యూనిట్లు అమ్ముడై మొదటి స్థానంలో నిలిచింది. అయితే, గతేడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాల్లో 2 శాతం స్వల్ప తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, మార్కెట్లో దీని డిమాండ్ తగ్గకపోవడం విశేషం. బడ్జెట్ ధరలో మంచి పవర్, స్టైల్ కోరుకునే వారు ఇప్పటికీ దీనికే ఓటు వేస్తున్నారు.

పల్సర్ NS/RS సిరీస్ దూకుడు:
ఈ జాబితాలో రెండవ స్థానంలో పల్సర్ 160+200 (NS/RS) మోడల్స్ నిలిచాయి. ఈ బైకులు 41,980 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మోడల్స్ అమ్మకాలు గతేడాది కంటే ఏకంగా 153 శాతం పెరిగాయి. యువతలో ఉన్న నేకెడ్ స్పోర్ట్స్ క్రేజ్ ఈ స్థాయి వృద్ధికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వేవ్‌లో చేతక్ హవా:
స్కూటర్ల విభాగంలో బజాజ్ చేతక్ (Bajaj Chetak Electric) అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 34,416 యూనిట్ల విక్రయాలతో మూడవ స్థానంలో నిలిచింది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ, 19 శాతం వృద్ధిని నమోదు చేస్తూ చేతక్ తన పట్టును నిరూపించుకుంది. రెట్రో లుక్, భరోసానిచ్చే బ్యాటరీ లైఫ్ దీనికి ప్లస్ పాయింట్స్.

సామాన్యుడి నేస్తం.. ప్లాటినా:
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారి మొదటి ఛాయిస్ బజాజ్ ప్లాటినా (Bajaj Platina). మార్చి నెలలో 32,822 యూనిట్ల విక్రయాలతో ఇది నాలుగవ స్థానంలో నిలిచింది. 7 శాతం వార్షిక వృద్ధిని సాధించి, మధ్యతరగతి వర్గాల్లో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేసింది.
పల్సర్ 220cc గ్రాండ్ రీ-ఎంట్రీ:
ఒకప్పుడు రారాజుగా వెలిగిన పల్సర్ 220cc (Pulsar 220cc) మళ్లీ పుంజుకుంది. 160 శాతం వృద్ధిని నమోదు చేస్తూ 10,015 యూనిట్లు అమ్ముడయ్యాయి. పాత తరం బైకర్లతో పాటు కొత్త తరం వారు కూడా ఈ లెజెండరీ బైక్‌ను మళ్లీ ఆదరిస్తున్నారు. ఇది బజాజ్ కంపెనీకి పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు.

తగ్గిన ఫ్రీడమ్ స్పీడ్.. నిరాశపరిచిన అవెంజర్:
ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జీ బైక్ అయిన బజాజ్ ఫ్రీడమ్ (Bajaj Freedom CNG) అమ్మకాలు ఈసారి తగ్గాయి. గత నెలలో కేవలం 889 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, ఇది 36 శాతం క్షీణత. మరోవైపు, అవెంజర్ 180cc పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత రెండు నెలలుగా ఈ బైక్ ఒక్క యూనిట్ కూడా అమ్ముడవకపోవడం గమనార్హం. డొమినార్ సిరీస్ అమ్మకాలు కూడా వందల సంఖ్యలోనే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications