లైసెన్స్ అక్కర్లేదు.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. పెట్రోల్ ఖర్చు అసలే లేదు.. రూ.30వేలకే అదిరిపోయే టూవీలర్
ప్రస్తుత రోజుల్లో సిటీల్లో నివసించే వారికి పెట్రోల్ ధరలు, ట్రాఫిక్ జామ్‌లు నరకం చూపిస్తున్నాయి. వీటికి తోడు కార్లు, బైక్‌లు పార్కింగ్ చేయడానికి స్థలం దొరకడం పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, చిన్న చిన్న అవసరాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు (E-Cycles) ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఇవి పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, వీటిని నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ సైకిళ్లలో ఉండే పెడల్ అసిస్టెడ్ టెక్నాలజీ వల్ల మనకు తెలియకుండానే శరీరానికి మంచి వ్యాయామం కూడా లభిస్తుంది. అన్నింటికంటే పెద్ద ఉపశమనం ఏమిటంటే.. ఈ తక్కువ వేగం గల ఎలక్ట్రిక్ సైకిళ్లను నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ గానీ, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ గానీ అవసరం లేదు.
1. వోల్ట్‌బైక్ మ్యాక్స్ ప్రో (Voltebyk Max Pro)
బడ్జెట్ ధరలో అత్యధిక ఫీచర్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఇ-సైకిల్ కోసం చూసేవారికి వోల్ట్‌బైక్ మ్యాక్స్ ప్రో ఒక బెస్ట్ ఛాయిస్. అన్ని వయసుల వారికి సెట్ అయ్యేలా దీనిని డిజైన్ చేశారు. ఇందులో 250 వాట్ల బిఎల్డీసీ (BLDC) మోటార్ ఉంటుంది. దీనికి పవర్ అందించడం కోసం 36 వోల్టుల 7.5 Ah బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.

ఈ సైకిల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 70 కిలోమీటర్ల వరకు లాంగ్ రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర కేవలం 23,990 రూపాయలుగా మాత్రమే ఉంది. ఇందులో ఇగ్నీషన్ కీ, యాంటీ థెఫ్ట్ (దొంగతనం జరగకుండా) అలారం, స్మార్ట్ డిస్‌ప్లే, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, మూడు రైడింగ్ మోడ్స్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
2. ఇ-మోటార్డ్ ఎక్స్1 (E-Motard X1)
సాధారణ, స్టైలిష్ లుక్‌తో పాటు నమ్మకమైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇ-మోటార్డ్ ఎక్స్1 సైకిల్ బాగా నచ్చుతుంది. దీని ఫ్రేమ్‌ను హై క్వాలిటీ స్టీల్‌తో తయారు చేశారు. దీనివల్ల ఈ సైకిల్ చాలా బలంగా ఉంటుంది. దీనిపై కంపెనీ ఏకంగా ఐదేళ్ల వారంటీని ఇస్తోంది. ఇందులో 7.65 Ah సామర్థ్యం గల రిమూవబుల్ బ్యాటరీ ఉంది.

దీనిని సైకిల్ నుంచి విడిగా తీసి కేవలం 3 నుంచి 4 గంటల్లోనే పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు. ఈ సైకిల్ ఒక ఫుల్ చార్జ్‌పై 35 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఈ సైకిల్ ధరను కంపెనీ 25,999 రూపాయలుగా నిర్ణయించింది. బడ్జెట్ పరిమితులు ఉన్న వారికి ఇది ఒక చక్కటి ఎంపిక.
3. హీరో లెక్ట్రో వై3+ (Hero Lectro Y3+)
భారతీయ సైకిల్ మార్కెట్లో నంబర్ వన్ బ్రాండ్ అయిన హీరో నుంచి వచ్చిన సూపర్ మోడల్ హీరో లెక్ట్రో వై3+. బ్రాండ్ వాల్యూతో పాటు మంచి కంఫర్ట్ ఆశించే వారికి ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ సైకిల్ ధర 29,990 రూపాయలు. ఇందులో 250W BLDC మోటార్, 7.4 Ah బ్యాటరీ ఉన్నాయి.

ఇది సింగిల్ చార్జ్‌పై 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రయాణంలో కుదుపులు తెలియకుండా ఉండటం కోసం దీని ముందు భాగంలో 80 ఎమ్‌ఎమ్ సస్పెన్షన్ ఫోర్క్‌ను ఇచ్చారు. దీనివల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం చాలా స్మూతుగా సాగుతుంది. దీనితో పాటు ఎల్‌ఈడీ డిస్‌ప్లే, బ్యాటరీ ఇండికేటర్, ఇ-కటాఫ్ ఫీచర్ ఉన్న మెకానికల్ డిస్క్ బ్రేకులు ఇందులో ఉన్నాయి.
4. వోల్ట్‌బైక్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ ఎడిషన్ (Voltebyk Foldable)
పట్టణాల్లో నివసించే వారికి స్థలం కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం డిజైన్ చేసిందే వోల్ట్‌బైక్ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ ఎడిషన్. ఈ సైకిల్‌ను అవసరం లేనప్పుడు మధ్యలోకి మడతబెట్టి (Fold) ఇంట్లో ఒక మూలన లేదా కార్ డిక్కీలో సులభంగా పెట్టేయవచ్చు. ఇది రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తోంది.

దీని బేస్ మోడల్ 7.8 Ah బ్యాటరీతో వస్తుంది, దీని ధర రూ.29,990 కాగా ఇది 40 కిమీ రేంజ్ ఇస్తుంది. అలాగే దీని టాప్ మోడల్ 9 Ah బ్యాటరీతో వస్తుంది, దీని ధర రూ.32,990 కాగా ఇది 55 కిమీ రేంజ్ ఇస్తుంది. గంటకు 25 కిమీ వేగంతో వెళ్లే ఈ సైకిల్‌లో డ్యూయల్ సస్పెన్షన్, ఇగ్నిషన్ కీ సెక్యూరిటీ మరియు వర్షంలో తడిసినా పాడవకుండా IP65 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లను అందించారు.
5. హెర్క్యులస్ శూరవీర్ (Hercules Shurveer)
పాతకాలపు రెట్రో స్టైల్ డిజైన్‌ను ఇష్టపడే కస్టమర్ల కోసం హెర్క్యులస్ శూరవీర్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది క్లాసిక్ వింటేజ్ లుక్‌ను ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో అద్భుతంగా మిక్స్ చేస్తుంది. పూర్వకాలంలో వచ్చిన రేసింగ్ లేదా ర్యాలీ సైకిళ్ల డిజైన్ ఆధారంగా దీనిని తయారు చేశారు. చూడటానికి పాతకాలపు మురటు సైకిల్‌లా కనిపించినప్పటికీ, దీని లోపల పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు.

దీని బాడీ ఫ్రేమ్‌ను గట్టి స్టీల్‌తో తయారు చేశారు. దీనిపై కంపెనీ రెండేళ్ల వారంటీని కూడా ఇస్తోంది. ఇందులో సాంప్రదాయబద్ధంగా వచ్చే రాడ్ బ్రేకులు, గట్టి వెల్డెడ్ ఫోర్కులు, స్టీల్ చైన్ కవర్, మంచి గ్రిప్ ఇచ్చే రబ్బర్ పెడల్స్ ఉన్నాయి. మార్కెట్లో దీని ధర కేవలం 22,999 రూపాయలుగా మాత్రమే ఉంది.
ఈ వింటేజ్ ఇ-సైకిల్‌లో 250 వాట్ల రేర్ హబ్ మోటార్‌ను ఉపయోగించారు. దీనికి పవర్ అందించడం కోసం 6 Ah సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను ఇచ్చారు. మీరు పెడల్ తొక్కకుండా కేవలం త్రోటిల్ (యాక్సిలరేటర్) మోడ్‌లోనే వెళ్తే ఇది 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఒకవేళ పెడల్ అసిస్ట్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా నిర్ణయించారు. తక్కువ బడ్జెట్‌లో పాతకాలపు జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఒక డిఫరెంట్ లుకింగ్ సైకిల్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications