పెట్రోల్‌కు బదులుగా ఇవి వాడండి.. భారత్‌లో బెస్ట్ హైబ్రిడ్, CNG బైక్స్–స్కూటర్లు ఇవే
భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. రోడ్లపై చూసినా చాలా మంది ఎలక్ట్రిక్ టూ-వీలర్లను ఉపయోగిస్తున్నారని సులభంగా గమనించవచ్చు. అయితే ఇంకా చాలా మంది సాధారణ పెట్రోల్ స్కూటర్లు లేదా బైక్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, కొన్ని కంపెనీలు హైబ్రిడ్, CNG టూ-వీలర్లను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ వాహనాలు సాధారణ పెట్రోల్ టూ-వీలర్లతో పోలిస్తే మెరుగైన మైలేజీని అందిస్తాయి. అంతేకాకుండా ఇంధన ఖర్చు కూడా తగ్గించడంలో సహాయపడతాయి. ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి కొత్త టెక్నాలజీతో వచ్చిన కొన్ని ఆసక్తికరమైన మోడళ్లు ఉన్నాయి. ఈ కథనంలో హైబ్రిడ్, CNG పవర్‌ట్రెయిన్‌లతో వచ్చిన టూ-వీలర్ల గురించి తెలుసుకుందాం.
Bajaj Freedom 125 CNG: బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి CNG బైక్‌లో ఒకటి. సాధారణంగా బైక్‌లు పెట్రోల్‌తో మాత్రమే నడుస్తాయి. కానీ ఈ మోడల్‌లో కంపెనీ ద్వి-ఇంధన వ్యవస్థను అందించింది. అంటే ఈ బైక్‌ను CNGతో, పెట్రోల్‌తో కూడా నడపవచ్చు. ఇంధన ఖర్చును తగ్గించాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు. ఎక్స్-షోరూమ్ ధర రూ. 91,566 నుంచి రూ.1.07 లక్షల వరకు ఉంటుంది.

ఈ బైక్‌లో 124.58 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్/CNG ఇంజిన్ అమర్చారు. ఇది 9.5 PS హార్స్‌పవర్, 9.7 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అదే CNG మోడ్‌లో 200 కిలోమీటర్లు వెళ్లగలదు. ఈ రెండు ఇంధనాలను కలిపి ట్యాంక్‌ను పూర్తిగా నింపిన తర్వాత మొత్తం సుమారు 330 కిలోమీటర్ల వరకు ప్రయాణంచగల సామర్థ్యం ఈ బైక్‌కు ఉంది.
Yamaha Fascino 125 Fi Hybrid: యమహా నుంచి వచ్చిన హైబ్రిడ్ స్కూటర్‌లలో ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ ఒకటి. ఈ స్కూటర్‌లో 125cc బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్ అమర్చారు. ఇది పెట్రోల్‌తో పనిచేసే ఇంజిన్ అయినప్పటికీ, స్కూటర్‌లో ఉన్న బ్యాటరీని ఛార్జ్ చేయడానికి స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ వల్ల ఇంజిన్ పనితీరు మెరుగవడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది.

పనితీరు పరంగా చూస్తే, ఈ ఇంజిన్ గరిష్టంగా 8.2 PS శక్తి, 10.3 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీంతో నగరాల్లో రోజువారీ ప్రయాణానికి ఈ స్కూటర్ సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ధర రూ.74,910 నుంచి మొదలవుతుంది. దీని సిటు కింద దాదాపు 21 లీటర్ల సామర్థ్యం ఉంటుంది. ఇది ఎక్కువగా యువతను అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. మైలేజ్ 69 కి.మీ వరకు ఉంటుంది.
Yamaha Ray ZR 125 Fi Hybrid: యమహా రే జెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ విషయానికి వస్తే, ఫాసినో కంటే కొంచెం స్పోర్టీ డిజైన్ కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించబడింది. ఇందులో కూడా అదే 125cc బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్, SMG టెక్నాలజీను అందించారు. పనితీరు, మైలేజీ పరంగా ఈ రెండు స్కూటర్‌ల మధ్య పెద్దగా తేడా ఉండదు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.76,235 నుంచి ఉంటుంది.

Yamaha FZ-S Fi Hybrid: యమహా ఎఫ్‌జెడ్ ఎస్ ఎఫ్‌ఐ హైబ్రిడ్ బైకులో ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన SMG (స్మార్ట్ మోటార్ జనరేటర్) టెక్నాలజీని ఉపయోగించారు. ఈ బైక్‌లో 149cc ఎయిర్-కూల్డ్ SOHC 2-వాల్వ్ ఇంజిన్ అమర్చారు. ఇది 12.4 PS శక్తి, 13.3 Nm టార్క్ అందించగలవు. దీని ధర రూ.1.45 ఎక్స్ షోరూమ్. ARAI సర్టిఫైడ్ ప్రకారం, దాదాపు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








