కస్టమర్‌తో ఆటలాడితే కటకటాలే.. ఓలా ఎలక్ట్రిక్‌కు కంజ్యూమర్ కోర్టు గట్టి షాక్.. రూ.45,000 భారీ జరిమానా
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ సర్వీస్‌లో చూపించిన నిర్లక్ష్యం ఆ కంపెనీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన కంజ్యూమర్ కోర్టు ఓలా కంపెనీపై ఏకంగా రూ.45,000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. స్కూటర్ కొన్న కస్టమర్‌కు సరైన సర్వీస్ అందించకుండా, ఒక చిన్న సమస్యను రెండేళ్లకు పైగా పరిష్కరించకుండా తిప్పించుకున్నందుకు కోర్టు ఈ చర్య తీసుకుంది. ఒక ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం.. ఈ కేసు తుది తీర్పు జూన్ 9, 2026న వెలువడింది.
అసలు ఏం జరిగిందంటే?
ఈ కథలోని బాధితుడు సామాన్యుడు కాదు.. చట్టం తెలిసిన ఒక లాయర్. అనంతపురానికి చెందిన ఎం.మురళీ మోహన్ అనే లాయర్ అక్టోబర్ 29, 2022న ఓలా కంపెనీకి చెందిన ఓలా S1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. ఈ స్కూటర్‌పై కంపెనీ 3 ఏళ్లు లేదా 40,000 కిలోమీటర్ల వరకు వారంటీని ఇచ్చింది. అయితే, వారంటీ కాలంలోనే స్కూటర్ వెనుక ఉండే డిక్కీ (బూట్ స్పేస్) లాక్ పూర్తిగా పాడైపోయింది. ఆ లాక్ సరిగ్గా పడకపోవడంతో డిక్కీ అస్సలు తెరుచుకోకుండా లేదా మూతపడకుండా ఇబ్బంది పెట్టడం మొదలైంది.

రీబూట్ చేయి అంటూ ఉచిత సలహాలు
డిక్కీ లాక్ సమస్య రాగానే లాయర్ మురళీ మోహన్ ఓలా లోకల్ సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించారు. అయితే అక్కడ ఉన్న మెకానిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సింది పోయి.. 'సార్, స్కూటర్‌ను ఒకసారి రీబూట్ (కంప్యూటర్ లాగా రీస్టార్ట్) చేయండి, అదే తగ్గిపోతుంది' అంటూ ఒక వింత ఐడియా ఇచ్చి పంపించేశాడు. మెకానిక్ చెప్పినట్టే చేసినా ఆ డిక్కీ లాక్ సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2025లో లాయర్ నేరుగా ఓలా షోరూమ్‌కు వెళ్లి నిలదీయగా.. అక్కడ స్టాఫ్ 'లాక్ పాడైపోయిన మాట నిజమే సార్, కానీ ప్రస్తుతం మా దగ్గర ఆ స్పేర్ పార్ట్ స్టాక్ లేదు, రాగానే వేస్తాం' అని చెప్పి చేతులెత్తేశారు.
రోజూ కోర్టు ఫైళ్లతో లాయర్ తిప్పలు
మురళీ మోహన్ వృత్తిరీత్యా న్యాయవాది కావడంతో, ఆయన ప్రతిరోజూ కోర్టుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన కేస్ ఫైళ్లు, లీగల్ డాక్యుమెంట్లను స్కూటర్ డిక్కీలోనే పెట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. డిక్కీ లాక్ పాడైపోవడంతో ఆ విలువైన ఫైళ్లు ఎక్కడ పోతాయో, ఎవరు దొంగిలిస్తారో అనే తీవ్రమైన మానసిక ఆందోళనకు ఆయన గురయ్యారు. దీనిపై అక్టోబర్ 2025లో ఆయన ఓలా కంపెనీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కంపెనీ నుంచి మీ కంప్లైంట్ మాకు అందింది అని కంప్యూటర్ జనరేటెడ్ రిప్లై వచ్చిందే తప్ప, ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ కాలేదు. ఆ తర్వాత ఆయన పంపిన లీగల్ నోటీసును కూడా ఓలా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.

కోర్టు నోటీసులకూ నో రెస్పాన్స్
కంపెనీ వైఖరితో విసిగిపోయిన మురళీ మోహన్ నవంబర్ 2025లో అనంతపురం వినియోగదారుల కోర్టులో ఓలాపై కేసు వేశారు. కోర్టు ఈ విషయమై ఓలా కంపెనీకి నోటీసులు పంపినప్పటికీ.. కంపెనీ తరపున నిర్దేశిత 45 రోజుల్లో ఎలాంటి లిఖితపూర్వక సమాధానం లేదా వివరణ కోర్టుకు అందలేదు. ఓలా యాజమాన్యం చూపిన ఈ విపరీతమైన నిర్లక్ష్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఒక లాయర్‌కు ఫైళ్ల భద్రత ఎంత ముఖ్యమో వివరిస్తూ, ఆయనకు జరిగిన మానసిక క్షోభకు ఓలానే పూర్తి బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టు సంచలన తీర్పు
వినియోగదారుల కోర్టు ఈ కేసులో కస్టమర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఓలా కంపెనీ 45 రోజుల్లోగా సదరు కస్టమర్ స్కూటర్ డిక్కీ లాక్‌ను ఉచితంగా బాగు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు కస్టమర్‌కు కలిగించిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 40,000, కోర్టు కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5,000.. మొత్తంగా రూ. 45,000 చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఇచ్చిన గడువులోగా కంపెనీ ఈ పని చేయకపోతే, పాత డిక్కీ స్థానంలో సరికొత్త డిక్కీని అమర్చడంతో పాటు, జరిమానా మొత్తానికి 7 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని కోర్టు గట్టిగా హెచ్చరించింది.


Click it and Unblock the Notifications