కస్టమర్లు బాగా మారిపోయారు మావ..స్కూటర్ అంటే టీవీఎస్ అంటున్న జనం
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2026 ఫిబ్రవరి నెల ఈవీ (EV) మార్కెట్‌లో పెను మార్పులకు వేదికైంది. విక్రయాల పరంగా చూస్తే ఈ విభాగం ఏకంగా 46 శాతం వార్షిక వృద్ధిని సాధించి, మొత్తం 1,11,000 యూనిట్ల విక్రయాలతో సరికొత్త రికార్డును సృష్టించింది.
అయితే, ఈ గణాంకాల కంటే కూడా మార్కెట్ లీడర్ల స్థానాల్లో జరిగిన మార్పులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్నాళ్లూ ఏకఛత్రాధిపత్యం వహించిన ఓలా ఎలక్ట్రిక్ అనూహ్యంగా కుప్పకూలగా, టీవీఎస్ మోటార్స్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని తన సత్తా చాటింది. బజాజ్, ఏథర్, హీరో విడా వంటి కంపెనీలు కూడా తమ జోరును కొనసాగిస్తూ ఓలాను వెనక్కి నెట్టేశాయి.

టీవీఎస్ మోటార్స్
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు రారాజుగా అవతరించింది. 2026 ఫిబ్రవరిలో టీవీఎస్ ఏకంగా 31,600 యూనిట్ల విక్రయాలతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో కేవలం 18,955 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈసారి 67 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.
ప్రస్తుతం టీవీఎస్ వద్ద ఐక్యూబ్(iQube), ఆర్బిటర్ అనే రెండు స్ట్రాంగ్ మోడళ్లు ఉన్నాయి. కస్టమర్లలో ఈ బ్రాండ్ మీద ఉన్న నమ్మకం, సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా టీవీఎస్ 28 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. టీవీఎస్ చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ నెలవారీ విక్రయాల గణాంకం కావడం గమనార్హం.

బజాజ్ ఆటో
ఐకానిక్ బ్రాండ్ చేతక్‌ను ఎలక్ట్రిక్ రూపంలోకి తెచ్చిన బజాజ్ ఆటో, ఫిబ్రవరి నెలలో 25,323 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే 17 శాతం వృద్ధిని సాధించిన బజాజ్, 23 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి బజాజ్ ఇటీవల చేతక్ C2501 అనే బడ్జెట్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.91,399 కాగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. క్వాలిటీకి మారుపేరుగా నిలిచే బజాజ్, ఇప్పుడు ఈవీ మార్కెట్లో కూడా తనదైన ముద్ర వేస్తోంది.
ఏథర్ ఎనర్జీ
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఏథర్ ఎనర్జీ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. ఫిబ్రవరిలో 20,581 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఫిబ్రవరిలో 11,978 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి ఏకంగా 72 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏథర్ స్కూటర్లలోని టెక్నాలజీ, ప్రీమియం లుక్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఏథర్ తన విక్రయాల్లో 20 వేల మార్కును దాటడం ఇది నాలుగోసారి. ప్రస్తుతం మార్కెట్లో 18 శాతం వాటాతో ఏథర్ గట్టి పోటీనిస్తోంది.

హీరో విడా
ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా(Vida)తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2026 ఫిబ్రవరిలో విడా 12,512 యూనిట్లను విక్రయించి నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో కేవలం 2,696 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి ఏకంగా 364 శాతం అద్భుతమైన వృద్ధిని సాధించింది. వరుసగా ఎనిమిది నెలలుగా విడా 10,000 యూనిట్లకు పైగా విక్రయాలను సాధిస్తూ మార్కెట్లో 11 శాతం వాటాను దక్కించుకుంది.
ఆంపియర్
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఆంపియర్ బ్రాండ్ ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా ఐదో స్థానానికి చేరుకుని ఓలా ఎలక్ట్రిక్‌ను ఆరో స్థానానికి నెట్టేసింది. ఫిబ్రవరిలో 4,725 యూనిట్ల విక్రయాలతో 27 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో స్కూటర్లను అందిస్తుండటం ఆంపియర్‌కు కలిసి వచ్చింది.

ఓలా ఎలక్ట్రిక్
ఈవీ మార్కెట్‌లో కింగ్ అనిపించుకున్న ఓలా ఎలక్ట్రిక్ ఫిబ్రవరిలో ఘోరంగా విఫలమై ఆరో స్థానానికి పడిపోయింది. కేవలం 3,968 యూనిట్ల విక్రయాలతో ఓలా చతికిలపడటం ఆటోమొబైల్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. గత 42 నెలల్లో ఓలాకు ఇది అత్యంత తక్కువ విక్రయాలు జరిగిన నెల. 2025 జనవరిలో 24 శాతం మార్కెట్ వాటాతో ఉన్న ఓలా, ఇప్పుడు కేవలం 4 శాతానికి పడిపోయింది. సర్వీస్ ఇబ్బందులు, సాఫ్ట్‌వేర్ సమస్యలు, పోటీ కంపెనీల కొత్త మోడళ్లు ఓలా పతనానికి కారణమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


Click it and Unblock the Notifications








