ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునే వారికి పండుగ లాంటి న్యూస్.. ఇక పెట్రోల్ బంకులకు బైబై చెప్పె టైం వచ్చిందా ?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెట్రోల్ ధరల సెగతో సతమతమవుతున్న సామాన్యుడికి ఊరటనిస్తూ, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ-రిక్షాలపై ఇస్తున్న సబ్సిడీ గడువును పెంచుతూ భారీ నిర్ణయం తీసుకుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపట్టిన పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం కింద లభించే ఆర్థిక ప్రయోజనాలు ఇకపై మరికొంత కాలం అందుబాటులో ఉండనున్నాయి. దీనివల్ల కొత్తగా ఈవీ వాహనాలు కొనాలనుకునే వారికి వేల రూపాయల ఆదా అయ్యే అవకాశం కలిగింది.
సబ్సిడీ గడువు ఎప్పటి వరకు?
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్లపై (స్కూటర్లు, బైకులు) సబ్సిడీని 31 జూలై, 2026 వరకు పొడిగించారు. అంటే వచ్చే ఏడాది జూలై వరకు మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. ఇక ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌ల విషయానికి వస్తే, ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించింది. ఈ విభాగంలో సబ్సిడీ గడువును ఏకంగా 31 మార్చి, 2028 వరకు పొడిగించింది. దీనివల్ల స్వయం ఉపాధి పొందుతున్న పేదలు, మధ్యతరగతి వారికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. దేశంలో కాలుష్యాన్ని తగ్గించి, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ గడువును పెంచినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

టార్గెట్ రీచ్ అవ్వడమే లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం మొదట ఈ పథకం కింద కేవలం 14 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఈ లక్ష్యాన్ని భారీగా పెంచింది. ఇప్పుడు ఏకంగా 24.8 లక్షల యూనిట్లకు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. అంటే ఇంకా సుమారు 15 లక్షల వాహనాలకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. దీనికోసం ప్రభుత్వం రూ.1,772 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా, అందులో ఇప్పటికే రూ.1,259.91 కోట్లు ఖర్చయ్యాయి. మిగిలిన నిధులను కూడా సకాలంలో వినియోగించేలా గడువును పొడిగించారు.
ఈ-రిక్షాల పరిస్థితి ఏంటి?
పెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల విభాగంలో కంపెనీలు అద్భుతమైన పనితీరు కనబరిచాయి. నిర్దేశించిన 1.59 లక్షల లక్ష్యం కంటే ఎక్కువగా అంటే 1.62 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే, చిన్న ఈ-రిక్షాలు మరియు ఈ-కార్ట్‌ల అమ్మకాలు మాత్రం ఊహించిన స్థాయిలో లేవు. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలో కేవలం 10 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అందుకే ఈ విభాగంలో గడువును 2028 వరకు పొడిగించారు. అయితే, డిమాండ్ తక్కువగా ఉండటంతో ఈ-రిక్షాల కోసం కేటాయించిన నిధులను రూ.192 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గించారు. అమ్మకాలు పెరిగే కొద్దీ ఈ నిధులను మళ్ళీ సవరించే అవకాశం ఉంటుంది.

కస్టమర్లకు కలిగే లాభాలేంటి?
సబ్సిడీ గడువు పెరగడం వల్ల ఓలా (Ola), టీవీఎస్ (TVS), ఏథర్ (Ather), బజాజ్ (Bajaj) వంటి ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరగకుండా స్థిరంగా ఉంటాయి. ఒకవేళ సబ్సిడీ ఎత్తివేస్తే, ఒక్కో స్కూటర్ ధరపై రూ.10,000 నుంచి రూ.20,000 వరకు భారం పడేది. ఇప్పుడు ఆ భయం లేకుండా తక్కువ ధరకే వాహనాలను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, కంపెనీలు తమ పాత స్టాక్ క్లియర్ చేయడానికి మరియు కొత్త ఫీచర్లతో కూడిన మోడల్స్ లాంచ్ చేయడానికి ఈ సమయం ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్కెట్లో పోటీ పెరగడం వల్ల కస్టమర్లకు మరిన్ని ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్లు కూడా లభించే అవకాశం ఉంది.
ఏయే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి?
ప్రస్తుతం మార్కెట్లో రివోల్ట్ ఆర్వీ400, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్+, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450ఎక్స్ వంటి మోడల్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.90 లక్షల మధ్య ఉన్నాయి. సబ్సిడీ వల్ల ఈ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో హోండా పీసీఎక్స్ ఎలక్ట్రిక్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ ఎలక్ట్రిక్ వంటి మోడల్స్ కూడా ఈ సబ్సిడీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పర్యావరణానికి మేలు చేసే, జేబుకు పొదుపునిచ్చే ఎలక్ట్రిక్ వాహనం కొనడానికి ఇదే సరైన సమయం.


Click it and Unblock the Notifications








