రూ.84 వేలకే హీరో కొత్త ప్యాషన్+ డిస్క్.. లీటరుకు 71KM మైలేజ్, ఫోన్ ఛార్జింగ్, i3S, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్
భారతదేశంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద బైకులు, స్కూటర్ల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన ప్రజాదరణ పొందిన ప్యాషన్+ మోడల్‌ను మరింత ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూ కొత్త హీరో ప్యాషన్+ డిస్క్ (Hero Passion+ Disc) వేరియంట్‌ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. రోజువారీ ప్రయాణాలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కొత్త మోటార్‌సైకిల్‌లో స్టైలిష్ డిజైన్, మెరుగైన భద్రతా ఫీచర్లు, డిజిటల్ టెక్నాలజీ, అధిక మైలేజ్ వంటి అంశాలను సమతుల్యంగా అందించింది. దీంతో నగరాల్లో నిత్యం బైక్‌ను ఉపయోగించే వారికి ఇది మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది.
ఈ కొత్త బైక్ ధర రూ.84,128(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించగా, దేశవ్యాప్తంగా ఉన్న హీరో డీలర్‌షిప్‌లలో విక్రయానికి అందుబాటులో ఉంది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, డిస్క్ బ్రేక్, అధిక మైలేజ్ వంటి ప్రయోజనాలతో ఈ బైక్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో మరింత బలమైన పోటీని ఇవ్వనుందని భావిస్తున్నారు. ఇది హెవీ గ్రే, నెక్సస్ బ్లూ, డార్క్ ఇండస్ట్రియల్ గ్రే, పెర్ల్ రెడ్ అనే నాలుగు ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

డిజైన్ విషయానికి వస్తే, కొత్త హీరో ప్యాషన్+ డిస్క్ పూర్తిగా కొత్తగా రూపొందించబడింది. ప్యాషన్ సిరీస్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ డిజైన్‌ను కొనసాగిస్తూనే, నేటి యువత అభిరుచులకు అనుగుణంగా ఆధునిక స్టైలింగ్ అంశాలను జోడించింది. బైక్ ముందు భాగం మరింత ప్రీమియంగా కనిపించేలా కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ను అందించారు. ఇది ఈ సెగ్మెంట్‌లోనే తొలి ఫీచర్ అని కంపెనీ పేర్కొంది.
రాత్రి, తక్కువ వెలుతురులో ప్రయాణించే సమయంలో మెరుగైన విజిబిలిటీని అందించేలా దీనిని రూపొందించారు. కొత్త మోడల్‌లో మరో ప్రధాన ఆకర్షణ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ డిస్‌ప్లే ఆధునిక రూపంతో పాటు అనేక ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ (RTMI), ట్రిప్ మీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, సర్వీస్ రిమైండర్ వంటి ఫీచర్లతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది.

దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌తో కనెక్ట్ చేసి కాల్, SMS అలర్ట్‌లు నేరుగా చూడవచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త హీరో ప్యాషన్+ డిస్క్‌లో కంపెనీ విశ్వసనీయమైన 100 సీసీ BS6, OBD-2 ఫేజ్-A ప్రమాణాలకు అనుగుణమైన సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW (సుమారు 8 bhp) పవర్, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఈ ఇంజిన్‌ను ట్యూన్ చేయడంతో సాఫీ యాక్సిలరేషన్, తక్కువ వైబ్రేషన్లు, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే హీరోకు ప్రత్యేకమైన i3S టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ కొంతసేపు ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి, క్లచ్ నొక్కగానే మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఇది లీటరుకు 71 కిలోమీటర్ల వరకు మైలేజ్ లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

భద్రత విషయంలో కూడా హీరో ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ కొత్త వేరియంట్‌లో తొలిసారిగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను అందించడం ద్వారా బ్రేకింగ్ పనితీరును గణనీయంగా మెరుగుపరిచింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా బైక్‌ను మరింత నమ్మకంగా నియంత్రించవచ్చు. అదనంగా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్‌ను కూడా అందించారు. సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు బైక్ ముందుకు కదలకుండా ఇది అడ్డుకుంటుంది. దీంతో ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయి.
రోజువారీ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు హీరో ప్యాషన్+ డిస్క్‌లో విశాలమైన, మెత్తటి సీటును అందించింది. రైడర్‌తో పాటు పిలియన్ కూడా ఎక్కువసేపు ప్రయాణించినా అలసట లేకుండా ఉండేలా సీటింగ్‌ను రూపొందించారు. హ్యాండిల్‌బార్, ఫుట్‌పెగ్‌ల పొజిషన్ కూడా సహజమైన రైడింగ్ పోజిషన్ అందించేలా డిజైన్ చేశారు. అదనంగా చిన్న వస్తువులు ఉంచుకునేందుకు యుటిలిటీ కేస్, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications