లాంచ్ రోజే అదిరిపోయే ఆఫర్..కొత్త ఇథనాల్ స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌లపై భారీ డిస్కౌంట్
భారతదేశ టూ వీలర్ మార్కెట్లో తిరుగులేని రికార్డులు సృష్టించిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఇథనాల్ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తూ, తన మోస్ట్ పాపులర్ బైక్ మోడల్స్ అయిన స్ప్లెండర్ ప్లస్ (Splendor+), హెచ్ఎఫ్ డీలక్స్ (HF Deluxe)లను సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) అవతారంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ బైక్‌లను ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అయితే, కస్టమర్లను ఊహించని షాక్‌కు గురిచేస్తూ ఈ బైక్‌లు విడుదలైన వెంటనే కంపెనీ వీటిపై ఏకంగా రూ. 4,000 భారీ డిస్కౌంట్‌ను ప్రకటించడం టెక్, ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పెట్రోల్ బైక్‌లకు దీటుగా కొత్త ధరలు
సాధారణంగా సరికొత్త టెక్నాలజీతో వచ్చే వాహనాల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ హీరో మోటోకార్ప్ స్మార్ట్ వ్యూహంతో ఈ కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ల ధరలను సాధారణ పెట్రోల్ బైక్‌ల ధరలకు సమానంగా తీసుకువచ్చింది. ఈ రూ.4,000 డిస్కౌంట్ ఆఫర్ వర్తించిన తర్వాత, ఢిల్లీలో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ (Splendor Plus Flex) కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.78,710 గా మారింది. అంటే ఇది సాధారణ పెట్రోల్ స్ప్లెండర్ మోడల్ కంటే కేవలం రూ.1,153 మాత్రమే ఎక్కువ. దీనివల్ల కస్టమర్లకు పెద్దగా అదనపు భారం పడదు.
సాధారణ మోడల్ కంటే చౌకగా హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్
ఇక హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ (HF Deluxe Flex) మోడల్ విషయంలో హీరో కంపెనీ కస్టమర్లకు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చింది. ఈ బైక్‌పై రూ.4,000 ప్రారంభ తగ్గింపు లభించిన తర్వాత, దీని ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.68,792కి చేరుకుంది.
ఇక్కడి విశేషం ఏంటంటే.. ఈ సరికొత్త ఇథనాల్ బైక్ ధర, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెగ్యులర్ పెట్రోల్ హెచ్ఎఫ్ డీలక్స్ మోడల్ కంటే ఏకంగా రూ.1,650 తక్కువ కావడం గమనార్హం. కొత్త టెక్నాలజీ బైక్ తక్కువ ధరకే లభిస్తుండటంతో కస్టమర్లు ఈ ఆఫర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అద్భుతమైన ఆఫర్ జూలై, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

ఇథనాల్ ఇంధన విప్లవానికి నాంది
లాంచ్ అయిన వెంటనే ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉంది. ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో 100 శాతం ఇథనాల్ (E100) ఇంధనానికి చట్టపరమైన అనుమతులు ఇచ్చే పత్రాలపై సంతకాలు పూర్తి చేసినట్లు ప్రకటించారు.
హీరో కంపెనీ తీసుకొచ్చిన ఈ రెండు బైక్‌లు దేశంలోనే మొదటి మాస్-మార్కెట్ మోటార్ సైకిళ్లుగా నిలిచాయి. ఇవి 20 శాతం నుంచి ఏకంగా 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌తో చాలా ఈజీగా నడుస్తాయి. భవిష్యత్తులో ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ కానుంది.
నమ్మకమైన పవర్‌ట్రెయిన్ ఇంజన్, అప్‌గ్రేడ్స్
ఇంజన్ సామర్థ్యం విషయానికి వస్తే.. హీరో కంపెనీ ఈ రెండు మోడళ్లలోనూ తన నమ్మకమైన పాత 97.2cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌నే ఉపయోగించింది. అయితే, ఎక్కువ మొత్తంలో ఇథనాల్ ఇంధనాన్ని తట్టుకునేలా దీని ఫ్యూయల్ సిస్టమ్‌ను కంపెనీ పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది.
అలాగే బైక్ లోని కంప్యూటర్ సిస్టమ్ అయిన ఈసీయు (ECU) మ్యాపింగ్‌లో కూడా అవసరమైన మార్పులు చేశారు. దీనివల్ల దేశంలో ఇథనాల్ లభ్యత పెరిగినప్పుడు ఈ బైక్‌లు ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా స్మూత్‌గా రన్ అవుతాయి. తొలి విడతగా ఈ బైక్‌లను ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే విక్రయించనున్నారు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకే ఈ డిస్కౌంట్
కొత్త టెక్నాలజీ అనగానే సాధారణంగా ప్రజలు ధర ఎక్కువగా ఉంటుందని భయపడతారు. ఆ భయాన్ని పోగొట్టి, వినియోగదారులను ఇథనాల్ వైపు ఆకర్షించేందుకే హీరో మోటోకార్ప్ ఈ ప్రారంభ డిస్కౌంట్‌ను ఇస్తోంది. భారతదేశం భవిష్యత్తులో E100 ఇంధనం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, ఈ ఇథనాల్ బైక్‌ల సక్సెస్ ఆధారంగానే దేశంలో గ్రీన్ మొబిలిటీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ బైక్‌ల అధికారిక డెలివరీలు జూలై, 2026 నుండి ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications