పెట్రోల్ ధరలే అనుకుంటే పేదల బండి ధర కూడా పెరిగిందే..సామాన్యుడి జేబుకు చిల్లు పడాల్సిందేనా?
ఓ సాధారణ సామాన్యుడి సొంత వాహనం, మైలేజీ కింగ్ హీరో స్ప్లెండర్ ప్లస్(Hero Splendor Plus) ధరలు పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ అయిన హీరో మోటో కార్ప్, జనవరి 2026 నుంచే అన్ని మోడల్స్ పై ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అందులో అత్యంత ప్రజాదరణ పొందిన భారీగా అమ్ముడయ్యే స్ప్లెండర్ ప్లస్ కొత్త ధరల పట్టిక వెలుగులోకి వచ్చింది. కంపెనీల తయారీ ఖర్చులు పెరగడం, ముడిసరుకుల ధరల భారం వంటి కారణాలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

భారత రోడ్ల మీద దశాబ్ధాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, డెలివరీ ఏజెంట్లు, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఇది మొదటి ఆప్షన్ గా నిలుస్తోంది. ప్రతి ఏటా జనవరిలో ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచడం ఆనవాయితీ వస్తోంది.
ఈ సంవత్సరం కూడా హీరో మోటోకార్ప్ అదే బాటలో నడిచింది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన 125 మిలియన్ ఎడిషన్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లపై ధరలను పెంచుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ పెంపు కేవలం రూ.250 నుంచి రూ.300 మధ్యలో ఉండటం కస్టమర్లకు కొంత ఉపశమనం కలిగించే విషయమే.

ఇప్పుడు హీరో స్ప్లెండర్ ప్లస్ బేస్ మోడల్ అయిన డ్రమ్ వేరియంట్ ధర రూ.74,152 (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. గతంలో దీని ధర రూ.73,902 గా ఉండేది, అంటే సుమారు రూ. 250 పెరిగింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే కాబట్టి, ఆర్టీవో, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు కలిపితే ఆన్-రోడ్ ధరపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
అలాగే i3S వేరియంట్ ధర రూ. 75,305 కు, స్టాండర్డ్ Xtec మోడల్ ధర రూ.77,678కు పెరిగాయి. టాప్ ఎండ్ మోడల్ అయిన Xtec 2.0 డ్రమ్ వేరియంట్ ధర రూ.80,214 గాను, డిస్క్ వేరియంట్ ధర రూ.80,721 గాను నిర్ణయించారు. 2025 ప్రారంభంలో ఒక దశలో స్ప్లెండర్ బేస్ మోడల్ ధర రూ.80,000 మార్కును తాకినప్పటికీ, సెప్టెంబర్ 2025 లో అమలులోకి వచ్చిన GST 2.0 నికతు సంస్కరణల వల్ల ధరలు మళ్లీ కంట్రోల్లోకి వచ్చాయి.
టెక్నికల్ పరంగా చూస్తే.. ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో ఇప్పటికీ అదే నమ్మకమైన 97.2 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 7.09 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది.

సిటీ ప్రయాణాలకు, రద్దీగా ఉండే వీధుల్లో ఈజీగా నడపడానికి ఈ బైక్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక మైలేజ్ విషయంలో స్ప్లెండర్ ప్లస్ ఇప్పటికీ కింగ్ అనే చెప్పాలి. లీటరుకు సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజీని ఈ బండి ఇస్తుంది. ఇందులోని i3S (ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్) టెక్నాలజీ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసి ఇంధనం ఆదా అయ్యేలా చేస్తుంది.
సేఫ్టీ కోసం హీరో మోటోకార్ప్ ఇందులో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్(IBS)ను అందించింది. ఆధునిక కాలానికి తగ్గట్టుగా Xtec మోడళ్లలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ హెడ్ లైట్ వంటి ఫీచర్లను కూడా జోడించింది.
మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం, విడిభాగాలు సులభంగా దొరకడం, రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్వల్ప ధరల పెంపు స్ప్లెండర్ అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఐకానిక్ బైక్ తన నమ్మకమైన పనితీరుతో మరిన్ని ఏళ్లపాటు సామాన్యుడికి తోడుగా నిలవనుంది.


Click it and Unblock the Notifications








