ఏథర్ రిజ్తా నుంచి టీవీఎస్ ఐక్యూబ్ వరకు.. సామాన్యుడి జేబును కాపాడే టాప్ 5 ఈవీ స్కూటర్లు ఇవే
భారతదేశంలో హోండా యాక్టివా దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాల ఇళ్లల్లో ఒక ప్రధాన భాగమైపోయింది. నమ్మకమైన ఇంజన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, నడపడానికి సులభంగా ఉండటంతో ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా నిలిచింది. కొన్నిసార్లు అమ్మకాలలో హీరో స్ప్లెండర్ బైక్‌ను సైతం వెనక్కి నెట్టి రికార్డులు సృష్టించింది. అయితే ప్రస్తుత కాలంలో ఇంధన ధరల భారం పెరగడంతో, యాక్టివా కస్టమర్లు సైతం ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తున్నారు. యాక్టివా ఇచ్చే అదే కంఫర్ట్‌ను అందిస్తూ, పెట్రోల్ ఖర్చును పూర్తిగా మిగిల్చే ఐదు అద్భుతమైన ఈవీ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.
1. ఏథర్ రిజ్తా (Ather Rizta)
ఏథర్ కంపెనీ ప్రత్యేకంగా ఫ్యామిలీ కస్టమర్లను మాత్రమే మైండ్‌లో పెట్టుకుని ఈ ఏథర్ రిజ్తాను డిజైన్ చేసింది. ఈ స్కూటర్ ఫీచర్లు యాక్టివా యూజర్లకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి. ఈ కేటగిరీలోనే ఎవరూ ఇవ్వనంత అతిపెద్ద సీటును ఇందులో అందించారు. దీనివల్ల ఇద్దరు పెద్దవారితో పాటు ఒక చిన్న పిల్లాడు కూర్చున్నా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఫుట్‌బోర్డ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం వల్ల సామాన్లు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. బండి బ్యాలెన్స్ తప్పకుండా ఉండేలా దీని లో-సెంటర్ ఆఫ్ గ్రావిటీని డిజైన్ చేశారు. స్మార్ట్ డ్యాష్ బోర్డ్‌తో పాటు అండర్ సీట్ స్టోరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ స్కూటర్ మోడల్‌ను బట్టి 123 నుంచి 159 కిలోమీటర్ల వరకు నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తుంది.
2. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ చూడటానికి మన పాత సంప్రదాయ పెట్రోల్ స్కూటర్ లాగే కనిపిస్తుంది. దీని సీటింగ్ పొజిషన్, హ్యాండ్లింగ్ యాక్టివాకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. అందుకే చాలా ఏళ్లుగా యాక్టివా నడుపుతున్న వారు ఐక్యూబ్ ఎక్కితే అసలు కొత్త బండి నడుపుతున్న ఫీలింగ్ రాదు, అంత కంఫర్ట్‌గా అలవాటైపోతుంది.
ఈ స్కూటర్‌కు గట్టి మెటల్ బాడీని ఉపయోగించారు, దీనివల్ల బండి చాలా కాలం మన్నికగా ఉంటుంది. ఇది గంటకు 75 నుంచి 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. బ్యాటరీ వేరియంట్ల ఆధారంగా కస్టమర్లకు 94 కిలోమీటర్ల నుంచి ఏకంగా 212 కిలోమీటర్ల వరకు అదిరిపోయే రేంజ్ ఇస్తుంది.

3. బజాజ్ చేతక్ (Bajaj Chetak)
మీకు క్లాసిక్ లుక్, ప్రీమియం డిజైన్ ఇష్టమైతే బజాజ్ చేతక్ ఒక అద్భుతమైన ఆప్షన్. ఒకప్పుడు భారత రోడ్లను ఏలిన పాత చేతక్ గుర్తులను గుర్తు చేస్తూనే, సరికొత్త మోడరన్ టెక్నాలజీతో దీనిని తయారు చేశారు.
దీని పూర్తి బాడీ మెటల్‌తో కూడి ఉండటం వల్ల బండి చాలా స్ట్రాంగ్‌గా, విలాసవంతంగా కనిపిస్తుంది. రోజూ ఆఫీసులకు, మార్కెట్లకు తిరిగే వారికి ఇది అత్యంత నమ్మకమైన వాహనం. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే చాలు ఈ చేతక్ ఈవీ 127 నుంచి 153 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.

4. విడా విఎక్స్2 (Vida VX2)
హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన విడా విఎక్స్2 కూడా యాక్టివా వినియోగదారులకు బెస్ట్ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇది మార్కెట్లో గో, ప్లస్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇందులో డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు.
అంటే బ్యాటరీలను బండి నుంచి బయటకు తీసి ఇంట్లోకి తీసుకెళ్లి చార్జ్ చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి ఇది చాలా ప్లస్ అవుతుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సీటు చాలా సౌకర్యవంతంగా ఉండి, రియల్ వరల్డ్ కండిషన్స్‌లో 92 నుంచి 142 కిలోమీటర్ల నిజమైన రేంజ్ అందిస్తుంది.
5. ఏథర్ 450ఎక్స్ (Ather 450X)
సాధారణ ఫ్యామిలీ స్కూటర్ కాకుండా రోడ్లపై నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, స్పీడ్, మోడరన్ లుక్ ఆశించే యువతకు ఏథర్ 450ఎక్స్ ఒక అల్టిమేట్ ఛాయిస్. ఈ స్కూటర్ చాలా తేలికగా ఉంటూ, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా దూసుకుపోవడానికి వీలుగా ఉంటుంది.
ఇందులో అడ్వాన్స్డ్ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, ఇన్-బిల్ట్ గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్, ఎన్నో స్మార్ట్ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. పెర్ఫార్మెన్స్‌లో యాక్టివా కంటే ఎంతో వేగంగా ఉండే ఈ స్కూటర్, ఒక్కసారి చార్జ్ చేస్తే 126 నుంచి 161 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications