ఈ రెండు బైకులకు ప్రొడక్షన్ ఖర్చులు కూడా రాలేదు.. అందుకే ఆ రెండు బైకులకు హోండా బై బై చెప్పేసింది
భారతీయ రోడ్లపై రివ్వున దూసుకుపోయే స్పోర్ట్స్ బైక్ ప్రియులకు హోండా షాకిచ్చింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన పోర్ట్‌ఫోలియో నుంచి రెండు పాపులర్ ప్రీమియం మోడళ్లకు స్వస్తి పలికింది. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో కస్టమర్లు దొరకకపోవడం, అమ్మకాలు సున్నాకి పడిపోవడంతో కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన లైనప్ నుంచి CB650R, CBR650R మోడళ్లను అధికారికంగా తొలగించింది. 2025 ప్రారంభంలోనే ఈ బైకులను అప్‌డేట్ చేసిన వెర్షన్లతో కంపెనీ మళ్ళీ లాంచ్ చేసింది. ఇన్-లైన్ 4 సిలిండర్, 650cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైకులు రైడింగ్ అంటే పిచ్చి ఉన్నవారికి ఫేవరెట్. అయితే, గత కొన్ని నెలలుగా ఈ రెండు మోడళ్ల అమ్మకాలు అస్సలు జరగలేదు. రిపోర్టుల ప్రకారం, వీటి సేల్స్ 0(సున్నా) యూనిట్లుగా నమోదయ్యాయి. ఒక భారీ బ్రాండ్‌కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. అందుకే వేచి చూడటం కంటే, వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టడమే మేలని హోండా భావించింది.

అమ్మకాలు తగ్గడానికి అసలు కారణం ఏంటి?
ఈ బైకులు మార్కెట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం వాటి ధర, పరిమిత లభ్యత. నియో-రెట్రో స్టైల్‌లో ఉండే CB650R చివరి ధర సుమారు రూ.9.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్ CBR650R ధర ఏకంగా రూ.10.40 లక్షలు. ఈ ధరల వద్ద కస్టమర్లు ఇతర బ్రాండ్ల వైపు లేదా ఇంకా ఎక్కువ పవర్ ఉన్న బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు, హోండా తన ప్రీమియం బైకులను భారత్‌కు చాలా తక్కువ సంఖ్యలో అలాట్ చేస్తుంది. ఒకసారి ఆ కోటా పూర్తయ్యాక, బుకింగ్స్ ఆపేసి వెబ్‌సైట్ నుంచి తొలగించడం కంపెనీకి అలవాటే. బహుశా కేటాయించిన యూనిట్లు అమ్ముడైపోవడం లేదా కొత్త స్టాక్ రాకపోవడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
హోండా బిగ్ బైక్ స్ట్రాటజీ
జనవరి 2025లో ఈ 650cc బైకులను లాంచ్ చేసిన తర్వాత, హోండా మరిన్ని పవర్ ఫుల్ మోడళ్లను ఇండియన్ మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో CBR1000RR-R SP, రెబెల్ 500, X-ADV వంటివి ఉన్నాయి. వీటిలో ఫ్లాగ్‌షిప్ సూపర్ స్పోర్ట్ బైక్ అయిన CBR1000RR-R SP, రెబెల్ 500లను కూడా లాంచ్ చేసిన కొద్ది రోజులకే ఆపేశారు. దీనికి ప్రధాన కారణం భారత్‌కు కేటాయించిన యూనిట్లు వేగంగా అయిపోవడమే. ప్రస్తుతం CB650R, CBR650R, X-ADV విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఇవి శాశ్వతంగా మూతపడినట్టు కాదు. తదుపరి అలాట్‌మెంట్ సైకిల్‌లో అంటే, 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో ఇవి మళ్ళీ కొత్త అవతారంలో మెరిసే అవకాశం ఉంది.

పోటీ పెరిగింది.. కస్టమర్ మారాడు
హోండాకు ఈ సెగ్మెంట్‌లో ట్రయంఫ్ డేటోనా 660 (రూ.9.88 లక్షలు), సుజుకి GSX-8R (రూ.9.89 లక్షలు), కవాసకి నింజా ZX-4RR (రూ.9.42 లక్షలు) వంటి వాటి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దాదాపు ఒకే ధరలో ఇతర కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీని ఇస్తుండటంతో హోండా వెనకబడింది. ముఖ్యంగా హోండా ఇ-క్లచ్ (E-Clutch) ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, ఆశించిన స్థాయిలో కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. ప్రీమియం బైకులను కొనే క్లాస్ ఇండియాలో చాలా పరిమితంగా ఉండటం కూడా ఒక మైనస్ పాయింట్.
మాస్ మార్కెట్‌లో హోండా మేటి
ప్రీమియం బైకులు పక్కన పెడితే, సాధారణ కస్టమర్లను ఆకట్టుకోవడంలో హోండా సక్సెస్ అయ్యింది. 2026 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2025 - మార్చి 2026) హోండా ఏకంగా 63,69,504 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 9 శాతం వృద్ధి. కేవలం మార్చి 2026లోనే 29 శాతం పెరుగుదలతో 5,49,145 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే సామాన్యుడు వాడే యాక్టివా, షైన్ వంటి బైకులకు తిరుగులేదు కానీ, లక్షల రూపాయలు పోసి కొనే సూపర్ బైకుల దగ్గరే హోండాకు బ్రేకులు పడ్డాయి.


Click it and Unblock the Notifications








