520.. ఇప్పుడు హోండాకు ఇదే లక్కీ నంబర్.. ఫుల్ జోష్‌లో ఉన్న కంపెనీ! ఎందుకో తెలుసా?
భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో తన ఉనికిని మరింత బలంగా చాటుకుంటూ, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, కంపెనీ మే 2026లో తన చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను నమోదు చేసింది. హోండా యాక్టివా ఇ, క్యూసి1 వంటి మోడళ్లకు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణ కారణంగా, గత నెలలో కంపెనీ దేశవ్యాప్తంగా మొత్తం 520 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగలిగింది. ఈ సంఖ్య సాధారణ అమ్మకాల గణాంకం మాత్రమే కాదు. హోండా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఇది ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది.
ఎందుకంటే, కంపెనీ ఒకే నెలలో 500 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం ఇదే తొలిసారి. 2025 ప్రారంభంలో భారత ఈవీ మార్కెట్లో అడుగుపెట్టిన హోండా, చాలా తక్కువ సమయంలోనే వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకోవడంలో విజయం సాధించింది. ప్రారంభంలో పరిమిత సంఖ్యలో అమ్మకాలు నమోదైనప్పటికీ, క్రమంగా బ్రాండ్‌పై పెరిగిన నమ్మకం, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

గత ఏడాది మే నెలలో కంపెనీ 383 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగా, ఈసారి 520 యూనిట్ల అమ్మకాలతో 36 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, హోండా తన బ్రాండ్ విలువ, నాణ్యత, విశ్వసనీయతతో వినియోగదారులను ఆకర్షించగలుగుతోంది. ముఖ్యంగా యాక్టివా బ్రాండ్‌కు భారత మార్కెట్లో ఉన్న బలమైన గుర్తింపు, ఎలక్ట్రిక్ వెర్షన్‌కు సానుకూల స్పందన తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
మే 2026లో నమోదైన ఈ అమ్మకాలతో హోండా తన గత రికార్డును కూడా బద్దలు కొట్టింది. అంతకుముందు జూలై 2025లో 461 యూనిట్ల విక్రయాలతో కంపెనీ అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది. అయితే ఇప్పుడు 520 యూనిట్ల అమ్మకాలతో ఆ రికార్డు చరిత్రలో కలిసిపోయింది. ఈ సక్సెస్‌తో హోండా భారత ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన విభాగంలో మరింత దూకుడుగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

మరో విషయం ఏమిటంటే, ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో జపనీస్ బ్రాండ్ల మధ్య పోటీ క్రమంగా ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల వరకు సుజుకి కంటే వెనుకబడిన హోండా, మే నెలలో నమోదు చేసిన రికార్డు స్థాయి అమ్మకాలతో పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం 2026లో మొత్తం 1,574 ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలతో హోండా ముందంజలో నిలవగా, సుజుకి 1,515 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో ఉంది.
ఇటీవల భారత మార్కెట్లోకి ప్రవేశించిన సుజుకి ఇ-యాక్సెస్ కూడా మంచి స్పందనను అందుకుంటోంది. కొత్త మోడల్ అయినప్పటికీ ఇప్పటివరకు 1,515 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసి, కంపెనీ ఈవీ విభాగంలో తన ఉనికిని చాటుకుంది. మరోవైపు, ఫిబ్రవరి 2026లో EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో భారత మార్కెట్లో అడుగుపెట్టిన యమహా మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇప్పటివరకు కేవలం 274 యూనిట్ల అమ్మకాలే నమోదు చేసంది.

అయితే హోండా సాధించిన ఈ వృద్ధి ప్రశంసనీయమైనదే అయినప్పటికీ, మొత్తం మార్కెట్ దృష్ట్యా చూస్తే ఇంకా ప్రారంభంలోనే ఉందని చెప్పాలి. ప్రస్తుతం TVS, బజాజ్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రెండు బ్రాండ్లు ఒక్కో నెలలోనే సగటున 35,000 నుంచి 40,000 యూనిట్ల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. ఆ సంఖ్యలతో పోలిస్తే హోండా, సుజుకి, యమహా వంటి జపనీస్ బ్రాండ్ల అమ్మకాలు ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications