దేశంలో అత్యధిక మంది కొంటున్న స్కూటర్ ఇదే.. ఇంతకంటే మంచిది దొరకడం చాలా కష్టం!
భారతదేశంలో స్కూటర్ మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). రెండు దశాబ్దాలకు పైగా భారతీయ రోడ్లపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఈ స్కూటర్, కేవలం ఒక టూవీలర్ మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కారణంగా యాక్టివా సంవత్సరాలుగా వినియోగదారుల తొలి ఎంపికగా నిలుస్తోంది. అందుకే మార్కెట్లో కొత్త కొత్త మోడళ్లు వచ్చినప్పటికీ, యాక్టివా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి నిదర్శనంగా తాజా అమ్మకాల గణాంకాలు నిలుస్తున్నాయి.
2026 మే నెలలో హోండా యాక్టివా ఏకంగా 2,28,955 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మరోసారి దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. గత ఏడాది మే నెలలో నమోదైన 1,90,713 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఈసారి 38,242 యూనిట్లు అధికంగా విక్రయించబడటం విశేషం. శాతాల పరంగా చూస్తే ఇది 20.05 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ సంఖ్యలు స్కూటర్ డిమాండ్‌ను తెలియజేస్తుంది.

ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరలు, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, రోజువారీ ప్రయాణ అవసరాల కారణంగా స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు నమ్మకమైన బ్రాండ్ వైపు మొగ్గు చూపుతుండగా, హోండా యాక్టివా ఆ అంచనాలను అందుకుంటూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు అన్ని వర్గాల వినియోగదారులను ఆకర్షించగలగడం కూడా యాక్టివా విజయానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
డిజైన్ పరంగా కూడా హోండా యాక్టివా భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసినప్పటికీ, యాక్టివా తన సింపుల్, ప్రీమియం స్టైలింగ్‌ను కొనసాగిస్తోంది. ముందుభాగంలో ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్, స్టైలిష్ ఫ్రంట్ ఏప్రాన్, క్రోమ్ ఎలిమెంట్స్ దీనికి ఆధునిక రూపాన్ని అందిస్తాయి. శరీరాకృతి చాలా సొగసుగా ఉండటంతో యువత, మహిళలు, కుటుంబ వినియోగదారులు ఇలా అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తుంది.

అలాగే, సౌకర్యవంతమైన సీటింగ్, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, మంచి స్టోరేజ్ స్పేస్ రోజువారీ వినియోగాన్ని మరింత సులభతరం చేస్తాయి. హోండా యాక్టివా డిజైన్‌లో అందం, సౌకర్యం, ఉపయోగకరత అనే మూడు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఇది సంవత్సరాలుగా భారతీయుల అభిమాన స్కూటర్‌గా కొనసాగుతోంది. దీని ధర కూడా దాదాపుగా అందుబాటులోనే కొనుగోలు చేసే విధంగా ఉంటుంది.
ప్రస్తుతం హోండా యాక్టివా భారత మార్కెట్లో రెండు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో యాక్టివా 110, యాక్టివా 125 మోడళ్లు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి. రోజువారీ ప్రయాణాలకు సరసమైన ధరలో విశ్వసనీయమైన స్కూటర్ కోరుకునే వారికి యాక్టివా 110 అనువైన ఎంపికగా భావిస్తారు. అందుకే ఇది ఇప్పటికీ దేశంలోని లక్షలాది కుటుంబాల తొలి ఎంపికగా కొనసాగుతోంది.

ఈ మోడల్ ధర రూ.75,433 నుంచి రూ.89,806 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పనితీరు, మైలేజ్ మధ్య సమతుల్యతను అందించే ఈ స్కూటర్ లీటరుకు సుమారు 50 కి.మీ వరకు ఇంధన సామర్థ్యాన్ని అందించగలదు. మరోవైపు, మరింత శక్తివంతమైన పనితీరు కోరుకునే వారి కోసం యాక్టివా 125 అందుబాటులో ఉంది. ఇందులో 123.92 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు.
ఈ స్కూటర్ ధర రూ.88,339 నుంచి రూ.94,096 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నగర రోడ్లతో పాటు హైవేలపై కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ మోడల్ గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగంతో దూసుకెళ్లగలదు. లీటరుకు సుమారు 47 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. దీంతో తమ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి వినియోగదారులు ఈ రెండు మోడళ్లలో తమకు నచ్చిన యాక్టివాను ఎంచుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications