2025 ఏడాదిలో ఈ స్కూటర్ కోసం షోరూమ్‌లకు భారీగా ఎగబడ్డ జనం.. దెబ్బకు ఇండియా నంబర్ 1 గా కంపెనీ
2025 సంవత్సరం భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఒక స్పష్టమైన మలుపుగా నిలిచింది. ఇప్పటివరకు ఈ విభాగాన్ని ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ, 2025లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంప్రదాయ ద్విచక్ర వాహన తయారీదారులు దూకుడుగా ముందుకు రావడంతో, ఎన్నేళ్లుగా మార్కెట్‌ను శాసించిన అనేక ఎలక్ట్రిక్ స్టార్టప్‌లు వెనక్కి నెట్టబడిన దృశ్యం కనిపించింది. ఇది కేవలం అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా, వినియోగదారుల ఆలోచన విధానంలో వచ్చిన మార్పుకు కూడా నిదర్శనంగా నిలిచింది. ఈ మార్పుకు ప్రధాన కారణం వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో బ్రాండ్ నమ్మకం, విశ్వసనీయత, అమ్మకాల తర్వాత సేవలు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టడమే.
ఇప్పుడు తాజాగా విడుదలైన 2025 క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం, టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో నంబర్ 1 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. 2025 సంవత్సరంలో టీవీఎస్ దాదాపు 2.95 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి, మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ముఖ్యంగా 24.2 శాతం మార్కెట్ వాటాతో టీవీఎస్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది టీవీఎస్ అత్యంత ప్రజాదరణ పొందిన ఐక్యూబ్ (iQube) ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్. నగర వినియోగదారుల నుంచి కుటుంబ అవసరాల వరకు అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా రూపొందించిన ఐక్యూబ్, నమ్మదగిన పనితీరు, మంచి రేంజ్, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్‌తో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది.
ఇదే సమయంలో, 2025లో టీవీఎస్‌కు అమ్మకాల పరంగా మరో కీలకంగా మారిన అంశం ఈ సంవత్సరం ప్రారంభంలోనే విడుదలైన బడ్జెట్ ఎలక్ట్రిక్ మోడల్ 'ఆర్బిటర్'. సరసమైన ధరలతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ మోడల్, ముఖ్యంగా మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆర్బిటర్ దేశంలోని కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

మరోవైపు, 2025లో భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో అత్యధిక అమ్మకాలు సాధించిన రెండవ అతిపెద్ద కంపెనీగా బజాజ్ ఆటో నిలిచింది. బజాజ్ సుమారు 21.9 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుని, టీవీఎస్ తర్వాతి స్థానంలో తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యంగా బజాజ్ ప్రసిద్ధ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విజయానికి ప్రధాన ఆధారంగా నిలిచింది. కొత్త వేరియంట్లను తీసుకురావడంతో, వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది.
2024లో భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్, 2025లో మాత్రం తీవ్ర ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంది. 2024లో దాదాపు మూడింట ఒక వంతు మార్కెట్ వాటాతో తిరుగులేని స్థాయిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్, 2025కి వచ్చేసరికి ఆ గరిష్ట స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. 2025 చివరి నాటికి ఓలా తన మార్కెట్ వాటాలో సగానికి పైగా కోల్పోయి కేవలం 16.1 శాతానికి పరిమితమైంది.

అమ్మకాల పరంగా చూస్తే, 2025 సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ దాదాపు 1.97 లక్షల యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే స్పష్టమైన తగ్గుదలగా చెప్పవచ్చు. 2025 సంవత్సరం ఏథర్ ఎనర్జీకి పూర్తి స్థాయి విజయాల పండుగగా నిలిచింది. వరుసగా స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తూ, బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ మార్కెట్‌లో తన స్థానం మరింత బలపరుచుకుంది.
తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ ఏథర్ 2025లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. గణాంకాల ప్రకారం, 2025 సంవత్సరంలో ఏథర్ ఎనర్జీ తన మార్కెట్ వాటాను 11.3 శాతం నుంచి 16.2 శాతానికి పెంచుకోవడం విశేషం. అదే సమయంలో, హీరో మోటోకార్ప్‌కు చెందిన హీరో విడా 2025 ముగిసే సరికి, హీరో విడా తన మార్కెట్ వాటాను రెట్టింపు చేసి 8.8 శాతానికి తీసుకెళ్లడం గమనార్హం.


Click it and Unblock the Notifications








