అనుమానంతో 2017లో 1,516.. నమ్మకంతో 2026లో 20 లక్షలు! 9 ఏళ్లలో అద్భుతం జరిగింది!
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మార్కెట్ అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తోంది. నేడు ప్రతి వీధిలోనూ ఎలక్ట్రిక్ స్కూటర్లు కనిపిస్తున్నాయి. అయితే పదేళ్ల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. 2016 ప్రాంతంలో భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై పెద్దగా అవగాహన కూడా లేదు. ఛార్జింగ్ సదుపాయాలు పరిమితంగా ఉండటం, ఎంపికలు తక్కువగా ఉండటం, అలాగే సాంకేతికతపై నమ్మకం లేకపోవడం వల్ల EVల అమ్మకాలు చాలా స్వల్ప స్థాయిలో ఉండేవి. ఈ పరిస్థితిని ప్రతిబింబించేలా 2017 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కేవలం 1,516 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ ఆ తర్వాత దశాబ్ద కాలంలో మార్కెట్ పూర్తిగా మారిపోయింది. బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడటం, కొత్త కంపెనీల ప్రవేశం వంటి అంశాలు EV విప్లవానికి దారితీశాయి.
ఫలితంగా నేడు భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు వేలల్లో ఉన్న అమ్మకాలు ఇప్పుడు లక్షలను దాటి, సంవత్సరానికి సుమారు 20 లక్షల యూనిట్ల స్థాయికి చేరుకోవడినికి ఈ రంగం సిద్ధంగా ఉంది. కేవలం పదేళ్ల వ్యవధిలో భారత ఆటోమొబైల్ రంగంలో ఇంత పెద్ద మార్పు రావడం నిజంగా విశేషం. ప్రస్తుతం EVలు భవిష్యత్తు రవాణా సాధనాలుగా కాకుండా, రోజువారీ జీవితంలో భాగంగా మారిపోతున్నాయి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వృద్ధి ఎంత వేగంగా జరిగిందో అమ్మకాలే చెబుతున్నాయి. 2021లో తొలిసారిగా ఈ విభాగం 1.5 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. అయితే అసలు సంచలనం 2022లో కనిపించింది. కేవలం ఒక్క ఏడాదిలోనే ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు 303 శాతం పెరిగి 6.61 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. 2021తో పోలిస్తే మూడు రెట్లకు పైగా వృద్ధి నమోదవడం పరిశ్రమ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ఊపు తర్వాత కూడా మార్కెట్ వేగం తగ్గలేదు. తదుపరి రెండేళ్లలో అమ్మకాలు మరింత పెరిగి కొత్త స్థాయికి చేరుకున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా సుమారు 12.1 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడవగా, 2025లో ఈ సంఖ్య 13.4 లక్షల యూనిట్లకు పెరిగింది. భారతదేశంలో ఒకే సంవత్సరంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్యలో ఇది అత్యధికం. ఈ ఏడాది సంఖ్య మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇప్పుడు పరిశ్రమ దృష్టంతా 2026పైనే ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న ట్రెండ్ చూస్తే, 2022లో చూసినట్లే మరో భారీ వృద్ధిని ఈ ఏడాది చూడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే దేశవ్యాప్తంగా సుమారు 8.01 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవడం మార్కెట్ వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 49 శాతం పెరగడం విశేషం.
అంతేకాకుండా, కేవలం ఐదు నెలల్లోనే 2025 మొత్తం ఏడాది నమోదైన అమ్మకాలలో దాదాపు 60 శాతం స్థాయిని చేరుకోవడం EVలపై వినియోగదారుల ఆసక్తి ఎంతగా పెరిగిందో తెలియజేస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా సగటున 1.60 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లు విక్రయమవుతున్నాయి. ఇదే అమ్మకాల జోరు ఏడాది పొడవునా కొనసాగితే, 2026 ముగిసే సమయానికి భారతదేశంలో తొలిసారిగా 20 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల మైలురాయి నమోదయ్యే అవకాశం ఉంది.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, మొత్తం టూవీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వాటా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ విభాగం మొత్తం టూ-వీలర్ అమ్మకాలలో 8.17 శాతం వాటాను కలిగి ఉంది. గత సంవత్సరం ఇదే వాటా కేవలం 6 శాతంగా ఉండగా, ఒక్క ఏడాదిలోనే గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ గణాంకాలు చూస్తే భారతీయ వినియోగదారులు పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతున్నారని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications