బిర్యానీ ఆర్డర్ చేసినట్టే.. బైక్ కూడా ఆర్డర్ చేసేయండి..యెజ్డీ ఆన్‌లైన్ ఐడియా అదిరింది!
బైక్ కొనేందుకు షోరూమ్‌ల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. ఇంటి ముందుకే బైక్ వచ్చే కాలం వచ్చేసింది. లెజెండరీ బైక్ తయారీ సంస్థ జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ (Jawa Yezdi Motorcycles) తన విక్రయాల్లో సరికొత్త విప్లవాన్ని తెచ్చింది.
తాజాగా విడుదలైన 2025 యెజ్డీ అడ్వెంచర్, రోడ్‌స్టర్ మోడళ్లను ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఆన్‌లైన్ షాపింగ్ చేసినంత సులభంగా ఇప్పుడు మీ ఫేవరెట్ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

ముంబై కేంద్రంగా నేడు (జనవరి 5, 2026) విడుదలైన ప్రకటన ప్రకారం.. జావా యెజ్డీ సంస్థ తన డిజిటల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసింది. గత ఏడాది పండుగ సీజన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసిన తర్వాత, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
గతంలో కేవలం షోరూమ్‌లకే పరిమితమైన 2025 యెజ్డీ అడ్వెంచర్, రోడ్‌స్టర్ మోడళ్లను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రీమియం క్లాసిక్ బైకులను ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ చేసిన మొదటి కంపెనీగా జావా యెజ్డీ ఇప్పటికే రికార్డు సృష్టించింది.

ఆన్‌లైన్‌లో బైక్ బుక్ చేసుకోవడం చాలా సులభం. మొదటగా అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో మీకు నచ్చిన మోడల్‌ను ఎంచుకుని ఎక్స్-షోరూమ్ బుకింగ్ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత మీ సమీపంలోని అధీకృత డీలర్ మీ ఆర్డర్‌ను ధృవీకరిస్తారు. మిగిలిన ఆన్-రోడ్ పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ప్రక్రియను డీలర్ పూర్తి చేస్తారు.
చివరగా షోరూమ్ నుంచి బైక్‌ను డెలివరీ తీసుకోవచ్చు. హెల్మెట్లు, ఇతర యాక్సెసరీలను మాత్రం నేరుగా డీలర్ వద్ద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆఫర్లను కంపెనీ ప్రకటించింది.

అమెజాన్: క్రెడిట్ కార్డుపై రూ.6,500 వరకు క్యాష్‌బ్యాక్, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు ఉన్న ప్రైమ్ కస్టమర్లకు 5% అదనపు క్యాష్‌బ్యాక్, 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) సదుపాయం కలదు.
ఫ్లిప్‌కార్ట్: బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.10,000 వరకు, క్రెడిట్ కార్డులపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ సేవలు దేశవ్యాప్తంగా 44 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, జైపూర్ (ఒడిశా బోర్డర్ ప్రాంతం). దక్షిణాదిలో బెంగళూరు, మదురై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ సేవలు లైవ్‌లో ఉన్నాయి.
జావా యెజ్డీ సంస్థ తన కస్టమర్ల కోసం పరిశ్రమలోనే మొదటిసారిగా ప్రత్యేక భరోసా పథకాన్ని తెచ్చింది. అన్ని బైకులకు 4 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. దీనిని 6 ఏళ్ల వరకు పొడిగించుకునే వీలుంది. అదనంగా ఒక సంవత్సరం ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA), 5 ఏళ్ల ఏఎంసీ(AMC) ప్యాకేజీని కూడా అందిస్తున్నారు. దీనివల్ల రిపేర్ ఖర్చుల టెన్షన్ లేకుండా బైక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








