ఒక్క ఛార్జ్‌తో 322 కిలోమీటర్లు, ధర రూ.90 వేలు.. భారత్‌లోనే అత్యధిక రేంజ్ వెళ్లే స్కూటర్ ఇదేనా?
నెలకు పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పర్యావరణంపై అవగాహన, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసివచ్చి భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్‌ను రోజురోజుకీ పెంచుతున్నాయి. ఒకప్పుడు ఎలక్ట్రిక్ అంటే రేంజ్ తక్కువ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తూ కొత్త తరం ఈవీ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం TVS iQube, Bajaj Chetak, Ola S1 వంటి మోడళ్లకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ, రేంజ్ విషయంలో వినియోగదారులను నిజంగా ఆశ్చర్యపరుస్తున్న స్కూటర్ మాత్రం కోమాకి తీసుకొచ్చిన XR7 అని చెప్పాలి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకునే ప్రతి వినియోగదారుడి మనసులో మొదట వచ్చే ప్రశ్న ఒక్కటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది? దీనినే రేంజ్ ఆందోళన అంటారు.
నగరాల్లో రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వాళ్లకైనా, గ్రామాల నుంచి పట్టణాలకు దూర ప్రయాణాలు చేసే వాళ్లకైనా ఇదే పెద్ద టెన్షన్. కానీ ఈ రేంజ్ భయానికి కోమాకి XR7 గట్టి సమాధానం ఇస్తోంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 322 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యధిక రేంజ్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

ఈ రేంజ్‌ను చూసినప్పుడు Ola S1 Pro వంటి హై-పర్ఫార్మెన్స్ మోడళ్లు కూడా కొంచెం వెనుకబడినట్టే అనిపిస్తాయి. ముఖ్యంగా రోజూ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సిన వారికి XR7 ఒక నమ్మకమైన ఎంపికగా మారుతోంది. నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా రేంజ్ గురించి ఆలోచించకుండా ప్రయాణించడానికి ఈ స్కూటర్ భరోసా ఇస్తుంది.
నెలకు పెట్రోల్ మీద ఖర్చయ్యే వేల రూపాయలను ఆదా చేయడంతో పాటు, మైంటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో జేబుకి బాగా సూట్ అవుతుంది. కోమాకి XR7 EV ఆధునికమైన, సురక్షితమైన LIPO4 బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ బ్యాటరీ ప్రత్యేకత ఏమిటంటే, భద్రతతో పాటు దీర్ఘకాలిక పనితీరును అందించడమే కాకుండా, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 322 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని స్కూటర్‌కు ఇస్తుంది.

పనితీరు పరంగా XR7 ఏమాత్రం రాజీ పడదు. దీని గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లకు మించి ఉండటం వల్ల నగర ప్రయాణాలతో పాటు కొంచెం లాంగ్ రైడ్స్‌కు అనుకూలంగా మారుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ శక్తివంతమైన 3000 వాట్ల BLDC హబ్ మోటారుతో పనిచేస్తుంది. ఈ మోటారును వైర్‌లెస్ కంట్రోలర్ ద్వారా నియంత్రించడం వల్ల పవర్ డెలివరీ స్మూత్‌గా ఉండటమే కాకుండా, రైడింగ్ అనుభవం మరింత నమ్మకంగా మారుతుంది.
ముందు, వెనుక భాగాల్లో ఉన్న 12 అంగుళాల చక్రాలు రోడ్డుపై అద్భుతమైన పట్టు, స్థిరత్వాన్ని అందిస్తాయి. దీని వల్ల చెడు రోడ్లు, మలుపులు ఉన్న ప్రాంతాల్లో కూడా స్కూటర్ నియంత్రణలోనే ఉంటుంది. ప్రాక్టికాలిటీకి కూడా కోమాకి మంచి ప్రాధాన్యం ఇచ్చింది. 35 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ ఉండటంతో హెల్మెట్‌తో పాటు రోజువారీ అవసరాలన్నీ సులభంగా నిల్వ చేసుకోవచ్చు. వినియోగదారులకు మరింత భరోసా కల్పించే అంశం వారంటీ.
కోమాకి XR7 EVకు కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వర్తించే సమగ్ర వారంటీని అందిస్తోంది. ఇందులో బ్యాటరీ, మోటారు, కంట్రోలర్ యూనిట్ కవర్ అవుతాయి. అంతేకాదు, స్కూటర్ ఛార్జర్‌పై కూడా ఒక సంవత్సరం ప్రత్యేక వారంటీ ఇవ్వడం గమనార్హం. ధర పరంగా కూడా ఈ స్కూటర్ తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరకే లాంచ్ అయింది.


Click it and Unblock the Notifications