తక్కువ సిసి.. కానీ పవర్ మాత్రం రాకాసి..కేటీఎం నుంచి వస్తోంది బేబి ఆర్సీ..ఆరెంజ్ పులి వస్తోంది
యూత్ ఐకాన్ కేటీఎం(KTM) అంటేనే స్పీడ్, అగ్రెసివ్ లుక్స్. ఒకప్పుడు ఇండియాలో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్రాండ్, మధ్యలో కొంచెం జోరు తగ్గించినా.. ఇప్పుడు మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే డ్యూక్ 160 (Duke 160) మోడల్‌తో మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కేటీఎం, ఇప్పుడు ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో తన బేబి ఆర్సీ అంటే RC 160ని రంగంలోకి దించుతోంది. ఈ బైక్ రాకతో యమహ R15 లాంటి పాపులర్ బైక్‌లకు గడ్డుకాలం మొదలైనట్టేనని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రేసింగ్ డిజైన్ - ఆర్సీ 200 స్టైల్
కొత్త కేటీఎం ఆర్సీ 160 చూడటానికి తన పెద్దన్న ఆర్సీ 200ను పోలి ఉంటుంది. అగ్రెసివ్ ఫుల్ ఫెయిరింగ్ డిజైన్, షార్ప్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, స్టైలిష్ డీఆర్ఎల్స్‌తో ఈ బైక్ రోడ్డుపై వెళ్తుంటే అందరి కళ్ళు దీనిపైనే పడతాయి. మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, స్పోర్టీ ఎగ్జాస్ట్ ఈ బైక్‌కు పక్కా రేసింగ్ బైక్ లుక్ ఇస్తాయి. యూత్ కి నచ్చేలా ఆరెంజ్, బ్లాక్, బ్లూ కాంబినేషన్లలో కొత్త గ్రాఫిక్స్‌తో ఈ బైక్ మెరిసిపోనుంది.

పవర్ ఫుల్ ఇంజిన్ - పెర్ఫార్మెన్స్ అదిరిపోద్ది
బేబి డ్యూక్‌లో వాడిన అదే 164.2 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఆర్సీ 160లోనూ కేటీఎం వాడుతోంది. ఇది 9,500 RPM వద్ద 19 bhp పవర్‌ను, 7,500 RPM వద్ద 15.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్, సూపర్ డ్యూక్ 1290 R నుండి ప్రేరణ పొంది రూపొందించబడింది. ఇది వేగంగా దూసుకుపోవడమే కాకుండా, కంట్రోల్డ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. సిటీలోనూ, హైవేలపై కూడా ఈ బైక్ తిరుగులేని పెర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ ధీమాగా ఉంది.
ప్రపంచ స్థాయి ఫీచర్లు
కేటీఎం బైక్ అంటేనే బెస్ట్ హ్యాండ్లింగ్. ఆర్సీ 160ని కూడా వరల్డ్ క్లాస్ స్ప్లిట్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మిస్తున్నారు. దీనివల్ల బైక్ బరువు తక్కువగా ఉండి, మూలమలుపుల్లో (Corners) చాలా ఈజీగా తిరుగుతుంది. సస్పెన్షన్ విషయానికొస్తే.. ముందు వైపు WP Apex USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ ఉంటాయి. ఇంకా ఇందులో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫుల్ ఎల్ఈడి లైటింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, సూపర్ మోటో ఏబీఎస్ (SuperMoto ABS) వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.

ధర, పోటీ
ప్రస్తుతం డ్యూక్ 160 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.70 లక్షలు ఉండగా, కొత్త ఆర్సీ 160 ధర రూ.1.80 లక్షల నుంచి రూ.1.95 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ప్రైస్ పాయింట్ వద్ద ఇది యమహ R15 V4, బజాజ్ పల్సర్ RS 200, సుజుకి జిక్సర్ SF 150, హీరో కరిజ్మా XMR 210 వంటి బైక్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది. యమహ R15 కొనాలని ప్లాన్ చేస్తున్న వారు, కేటీఎం ఇచ్చే ఈ స్పోర్టీ ప్యాకేజీ చూశాక ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
ఎందుకు కొనుగోలు చేయాలి?
మీకు తక్కువ ధరలో ప్రీమియం లుక్ ఉన్న స్పోర్ట్స్ బైక్ కావాలంటే ఆర్సీ 160 బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం స్పీడ్ మాత్రమే కాదు, మంచి మైలేజీని కూడా ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా కాలేజ్ కు వెళ్లే కుర్రాళ్లకు, వీకెండ్ రైడ్స్ ఇష్టపడే వారికి ఈ బేబి ఆర్సీ ఒక వరమనే చెప్పాలి. 2026 కొత్త ఏడాది కానుకగా జనవరి చివరి నాటికి ఈ బైక్ షోరూమ్‌లలో సందడి చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








