హీరో నుంచి మరో సర్‌ప్రైజ్ బైక్.. పాత రోజులు గుర్తొచ్చేలా స్ప్లెండర్ ప్రో క్లాసిక్ రీఎంట్రీ!
భారతదేశంలో అత్యధిక ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న హీరో మోటోకార్ప్ (Hero Motocorp), మరోసారి తన అభిమానులను ఉత్సాహపరిచే వార్తతో ముందుకొచ్చింది. ఒకప్పుడు యువతతో పాటు సాధారణ కమ్యూటర్ రైడర్లను కూడా విశేషంగా ఆకట్టుకున్న రెట్రో-స్టైల్ మోటార్‌సైకిల్ హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ (Hero Splendor Pro-Classic) మళ్లీ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు బలమైన సంకేతంగా కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించిన కొత్త డిజైన్ పేటెంట్‌ను అధికారికంగా దాఖలు చేసింది. దీంతో ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ఐకానిక్ బైక్ కొత్త రూపంలో పునరాగమనం చేయబోతుందనే చర్చ ఆటోమొబైల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్‌ను కంపెనీ తొలిసారిగా 2014లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సాధారణ కమ్యూటర్ బైక్‌లకు భిన్నంగా, రెట్రో లుక్, రౌండ్ హెడ్‌ల్యాంప్, క్రోమ్ ఫినిషింగ్, క్లాసిక్ స్టైలింగ్ వంటి ప్రత్యేకతలతో ఈ బైక్ అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించింది. తక్కువ నిర్వహణ ఖర్చు, విశ్వసనీయ పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఈ మోడల్‌కు ప్రత్యేక అభిమాన వర్గం ఏర్పడింది.

అయితే 2018లో దేశంలో కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు అమల్లోకి రావడంతో, కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి ఈ బైక్ తిరిగి వస్తుందా లేదా అనే సందేహాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన డిజైన్ పేటెంట్ చిత్రాలు ఆ ఆశలకు మళ్లీ ఊపిరి పోశాయి.
ఈ పేటెంట్ ద్వారా హీరో తన పాత రెట్రో కమ్యూటర్‌ను కొత్తగా, తాజా డిజైన్ అంశాలతో తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మోడల్‌లో క్లాసిక్ స్టైలింగ్‌ను కొనసాగిస్తూనే, ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా ప్రమాణాలు, కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్, ఇతర భాగాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. కొత్త పేటెంట్ డిజైన్‌ను పరిశీలిస్తే హీరో ప్రస్తుతం ఆఫ్రికాలో విక్రయిస్తున్న హీరో హంటర్ 150ను పోలి ఉంది.

రౌండ్ హెడ్‌ల్యాంప్, టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ సీట్, క్లాసిక్ గ్రాఫిక్స్ వంటి అనేక డిజైన్ అంశాలు హంటర్ 150 నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్ కోసం కూడా అదే తరహా రెట్రో-స్టైల్ కమ్యూటర్‌ను హీరో సిద్ధం చేస్తోందనే అంచనాలు బలపడుతున్నాయి. అయితే, డిజైన్ పేటెంట్ దాఖలు చేయడం మాత్రమే బైక్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని నిర్ధారించదు.
అయినప్పటికీ, హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్ వంటి ఒకప్పుడు మంచి ఆదరణ పొందిన మోడల్‌ను ఆధునిక రూపంలో తిరిగి తీసుకురావడానికి కంపెనీ ఆసక్తి చూపుతున్నట్లు మాత్రం ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. అధికారిక ప్రకటన వెలువడితే, రెట్రో కమ్యూటర్ బైక్‌లను ఇష్టపడే భారతీయ రైడర్లకు ఇది మరో ఆసక్తికరమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. సైజు, నిర్మాణం పరంగా పాత మోడల్ వారసత్వాన్ని కొనసాగిస్తూనే, ఇప్పటి కాలానికి అనుగుణంగా నిర్మించనున్నారు.

కొత్త హీరో స్ప్లెండర్ ప్రో క్లాసిక్‌లో పాత మోడల్‌తో పోలిస్తే పలు ఆకర్షణీయమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఇందులో గుండ్రని LED హెడ్‌ల్యాంప్, కొత్త అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు అందించే అవకాశముంది. అలాగే డ్యూయల్-పాడ్ డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో మరింత ప్రీమియం లుక్‌ను అందించనుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 97.2 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌నే కొనసాగించే అవకాశం ఉంది.
ఇది 8.2 bhp పవర్, 8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతకానుంది. అదే సమయంలో ఎక్కువ పనితీరు కోరుకునే వారి కోసం 125 సీసీ వేరియంట్, అలాగే భవిష్యత్తులో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ ఎంపికను కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారత మార్కెట్లో ఈ మోడల్, స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ Xtec* మధ్య స్థానంలో ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications