కుర్రాళ్లు బడ్జెట్ రెడీ చేసుకోండి .. అదిరిపోయే రెండు కొత్త బైక్స్ లాంచ్.. ఇప్పుడు ఇవే హాట్ టాపిక్!
ప్రీమియం స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్ల విభాగం భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో ఉన్న యెజ్డీ (Yezdi), బీఎస్ఏ (BSA) ఒకేసారి రెండు కొత్త మోడళ్లతో మార్కెట్‌లో బలమైన అడుగు పెట్టాయి. గురువారం జరిగిన ఈ లాంచ్ ద్వారా ఈ రెండు బ్రాండ్‌లు తమ దృష్టిని స్పష్టంగా తెలియజేశాయి. పట్టణ రోడ్ల నుంచి హైవేలు, అక్కడి నుంచి తేలికపాటి ఆఫ్-రోడింగ్ వరకు అన్ని పరిస్థితుల్లోనూ సరిపడే బైక్‌లను భారతీయ రైడర్లకు అందించడం. ఈ సందర్భంగా పరిచయం చేసిన యెజ్డీ స్క్రాంబ్లర్ 350 (Yezdi Scrambler 350) ప్రారంభ ధర రూ.1,99,950గా ఉండగా, మరింత శక్తివంతమైన బీఎస్ఏ స్క్రాంబ్లర్ (BSA Scrambler 650) రూ.3,24,950 నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఈ రెండు మార్కెట్‌లోని రెండు విభిన్న స్థాయిలను లక్ష్యంగా చేసుకున్నాయి, ఒకటి మధ్యతరగతి రైడర్ల కోసం, మరొకటి ప్రీమియం సెగ్మెంట్‌ను ఆకర్షించేందుకు. ఈ లాంచ్‌లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, యెజ్డీ, బీఎస్ఏ బ్రాండ్‌లు కలిసి ఒకే వేదికపై స్క్రాంబ్లర్ మోడళ్లను పరిచయం చేయడం ఇదే మొదటిసారి. ఇది కేవలం కొత్త బైక్‌ల లాంచ్ మాత్రమే కాదు, భారతీయ మార్కెట్‌లో స్క్రాంబ్లర్ సెగ్మెంట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించే ఒక పెద్ద సంకేతం.

ఇటీవల కాలంలో యువ రైడర్లు కేవలం నగర ప్రయాణాలకే కాకుండా వీకెండ్ అడ్వెంచర్ రైడ్స్, లైట్ ఆఫ్-రోడింగ్ వంటి అనుభవాలను కూడా కోరుకుంటున్నారు. అలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ రెండు స్క్రాంబ్లర్ బైక్‌లు స్టైల్, పనితీరు, వినియోగాన్ని సమతుల్యం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా, వీటి డిజైన్‌లో క్లాసిక్ రిట్రో టచ్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కలగలిపి ఉండటం రైడర్లను ఆకట్టుకునే అంశంగా మారుతోంది.
2026లో వచ్చిన యెజ్డీ స్క్రాంబ్లర్ 350లో కంపెనీ ఇంజన్‌పై కొన్ని కీలక మార్పులు చేసింది. పనితీరును మెరుగుపరచడానికి 334 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అప్‌డేట్ చేశారు. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఇప్పుడు ఈ ఇంజన్ 29.58 bhp పవర్, 30 Nm టార్క్ ఇస్తుంది, అంటే పాత మోడల్‌తో పోలిస్తే కొంచెం ఎక్కువ శక్తి అందిస్తుంది. అలాగే, ఇది సుమారు 30 kmpl మైలేజీ ఇస్తుంది.

బైక్ బరువును తగ్గించారు. ముందుగా 182 కేజీలు ఉన్న ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు మరింత తేలికగా మారింది. దీనివల్ల రైడింగ్ కంట్రోల్ మెరుగవుతుంది, ముఖ్యంగా ఆఫ్-రోడ్‌లో ఇది ఉపయోగపడుతుంది. తేలికపాటి పదార్థాలను ఉపయోగించడం వల్ల ఈ మార్పు సాధ్యమైంది. ఫీచర్ల పరంగా కూడా కొన్ని అప్‌డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. అలాగే, రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని క్లియర్‌గా చూపించే LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది.
బీఎస్ఏ స్క్రాంబ్లర్ 650 ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Royal Enfield Bear 650కు పోటీ ఇస్తోంది. ఈ స్క్రాంబ్లర్ 650, ఇప్పటికే ఉన్న BSA Gold Star 650 ఆధారంగా రూపొందించబడింది. రెట్రో స్టైల్‌తో వచ్చే ఈ బైక్‌లో 652 cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 46 bhp పవర్, 55 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

రంగుల విషయానికి వస్తే, మూడు ఆప్షన్‌లలో రావెన్ బ్లాక్ (రూ.3,24,950), విక్టర్ ఎల్లో (రూ.3,32,950), థండర్ గ్రే (రూ.3,40,950)లలో లభిస్తుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ మోడల్ లాంచ్‌తో భారత్‌లో BSA లైన్‌అప్ మరింత విస్తరించింది. ఇప్పటివరకు దేశంలో గోల్డ్ స్టార్ 650 మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు స్క్రాంబ్లర్ 650 కూడా చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ఉన్న ఈ బైక్, ఇప్పుడు భారత రైడర్లకు అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications