పాతాళం నుంచి ఆకాశానికి... కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి భయ్యా.. ఈవీ మార్కెట్లో ఓలా సరికొత్త రికార్డ్
ఓలా ఎలక్ట్రిక్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చేసింది. ఒకానొక దశలో సర్వీస్ ఇబ్బందులు, కస్టమర్ల ఫిర్యాదులతో సతమతమైన ఈ కంపెనీ, 2026 మార్చి నెలలో ఊహించని రేంజ్‌లో పుంజుకుంది. కేవలం ఒక్క నెలలోనే రిజిస్ట్రేషన్ల పరంగా 150 శాతం వృద్ధిని సాధించి ఆటోమొబైల్ రంగాన్ని విస్మయానికి గురిచేసింది. ఫిబ్రవరిలో డీలా పడిన అమ్మకాలు, మార్చి వచ్చేసరికి రాకెట్‌లా దూసుకెళ్లాయి.
మార్చిలో ఓలా సృష్టించిన ప్రభంజనం
ఓలా ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ మార్చి 2026లో అద్భుతమైన పునరాగమనాన్ని చాటుకుంది. వాహన్ (VAHAN) పోర్టల్ డేటా ప్రకారం.. ఫిబ్రవరిలో కేవలం 3,973 యూనిట్లుగా ఉన్న వాహన రిజిస్ట్రేషన్లు, మార్చి నాటికి ఏకంగా 10,117 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది నెలవారీగా చూస్తే 150 శాతం కంటే ఎక్కువ వృద్ధి. ముఖ్యంగా మార్చి చివరి వారంలో ప్రతిరోజూ 1,000 కంటే ఎక్కువ కొత్త ఆర్డర్లు రావడం కంపెనీ ఫామ్‌లోకి వచ్చిందని నిరూపిస్తోంది. మార్కెట్ షేర్‌లో దీన్ని V-Shape రికవరీగా కంపెనీ అభివర్ణిస్తోంది.

సర్వీస్ వేగంలో విప్లవం
గతంలో ఓలా స్కూటర్ల అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం సర్వీస్ విషయంలో కస్టమర్లకు ఎదురైన ఇబ్బందులే. అయితే, కంపెనీ ఈ సమస్యను సీరియస్‌గా తీసుకుని ఆపరేషనల్ మార్పులు చేపట్టింది. విడిభాగాల సరఫరాను మెరుగుపరచడం, నెట్‌వర్క్ పర్యవేక్షణను కఠినతరం చేయడం ద్వారా ఇప్పుడు 80 శాతం కంటే ఎక్కువ వాహనాలకు సేమ్-డే సర్వీస్ (అదే రోజున రిపేర్) అందిస్తోంది. ఈ వేగవంతమైన సర్వీస్ పద్ధతులే కస్టమర్లలో మళ్ళీ నమ్మకాన్ని నింపాయి.
ఎనిమిదేళ్ల వారంటీ.. బైబ్యాక్ అస్యూరెన్స్
కస్టమర్ల భరోసాను మరింత పెంచేందుకు ఓలా EndICEAge పేరుతో ఒక భారీ క్యాంపెయిన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఎనిమిదేళ్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ, బైబ్యాక్ అస్యూరెన్స్ (తిరిగి కొనుగోలు చేసే గ్యారంటీ) వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఒకవేళ సర్వీస్ సెంటర్‌లో రిపేర్ ఆలస్యమైతే కస్టమర్లకు ఉచితంగా ఓలా క్యాబ్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి నమ్మకమైన హామీలే సేల్స్ పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి.

10 లక్షల మైలురాయిని దాటిన తొలి బ్రాండ్
భారతదేశ ఎలక్ట్రిక్ వాహన చరిత్రలో ఓలా ఎలక్ట్రిక్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వాహన్ రికార్డుల ప్రకారం.. మొత్తం మీద (Cumulative) 10 లక్షల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు సాధించిన మొదటి ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్‌గా ఓలా అవతరించింది. దేశవ్యాప్తంగా సొంత నెట్‌వర్క్ తో అనుభవ కేంద్రాలను (Experience Centers) నడుపుతున్న ఏకైక కంపెనీగా ఓలా తన ఆధిపత్యాన్ని చాటుతోంది. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా ఓలా స్కూటర్ల హవా నడుస్తోంది.
గ్లోబల్ రీసెర్చ్.. లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్
ఓలా ఎలక్ట్రిక్ తన వర్టికల్ ఇంటిగ్రేషన్ సామర్థ్యంతో సరికొత్త టెక్నాలజీని వాడుతోంది. తమిళనాడులోని ఫ్యూచర్ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో స్కూటర్లను ఉత్పత్తి చేస్తుండగా, వీటికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) పనులు భారత్, బ్రిటన్, అమెరికాలో విస్తరించి ఉన్నాయి. కేవలం స్కూటర్లే కాకుండా, బ్యాటరీ సెల్ తయారీలో కూడా ఓలా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో రోడ్‌స్టర్, క్రూయిజర్ వంటి కొత్త మోడళ్లను కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications








