చెన్నై తర్వాత ఆ సిటీలోనే.. రూ.2.39 లక్షలకు అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. 150Km వెళ్లొచ్చు
చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాప్టీ.హెచ్‌వీ (Raptee.HV) తన మార్కెట్‌ను పెంచుకోవడంలో భాగంగా మరో కీలక అడుగు వేసింది. తొలిసారి తన సొంత ఊరును దాటి బెంగళూరులోకి అధికారికంగా ప్రవేశించింది. దేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా సంస్థ దేశవ్యాప్తంగా తన మార్కెట్ విస్తరణకు అడుగులు వేసింది. దీంతో రాప్టీ.హెచ్‌వీ అత్యాధునిక టెక్నాలజీతో పాటు కస్టమర్లకు మెరుగైన ఓనర్‌షిప్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమైంది. గత 6 ఏళ్లుగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల రంగంలో కొత్త ప్రమాణాలు సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న రాప్టీ.HV, హెచ్‌వీ-టీవీసీ (HV-TEC) అనే ప్రత్యేక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది.
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్ కార్లలో ఉండే అత్యాధునిక సాంకేతికతను మోటార్‌సైకిళ్లలోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ అభివృద్ధి కోసం కంపెనీ ఇప్పటికే 200కు పైగా పేటెంట్లు దాఖలు చేసింది. బ్యాటరీ సిస్టమ్‌లు, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్, వెహికల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక విభాగాలను సంస్థ స్వయంగా అభివృద్ధి చేసింది. ఛార్జింగ్, పనితీరు, విశ్వసనీయత, దీర్ఘకాలిక ఓనర్‌షిప్ అనుభవం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ విస్తరణలో భాగంగా బెంగళూరులో అధునాతన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక్కడ వినియోగదారులు రాప్టీ.హెచ్‌వీ T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు టెస్ట్ రైడ్ చేయవచ్చు. అలాగే సర్వీస్, మెయింటెనెన్స్, కొనుగోలు తరువాత సపోర్ట్ వంటి సేవలను ఒకేచోట అందిస్తూ వినియోగదారులకు మెరుగైన ఓనర్‌షిప్ అనుభవాన్ని అందించనుంది. ఈ కేంద్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే రాప్టీ.HV T30 మోటార్‌సైకిల్ సంస్థ రూపొందించిన HV-TEC ప్లాట్‌ఫామ్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది.
ఈ బైక్ CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ స్టాండర్డ్‌కు అనుకూలంగా ఉండటం దీని ప్రత్యేకత. దీంతో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 30,000కు పైగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటం మరో మంచి ఆప్షన్. రాప్టీ.HV T30 ఎక్స్-షోరూమ్ ధర రూ.2.39 లక్షలుగా ఉంది. పనితీరు పరంగా ఇది చాలా అద్బుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంటుంది.

పనితీరు చూస్తే, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే వాస్తవ పరిస్థితుల్లో 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. అలాగే 0 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌ను కేవలం 3.5 సెకన్లలోపే అందుకోగలదు. ఈ బైక్‌కు కంపెనీ 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల వెహికల్ వారంటీ, ప్రత్యేక కస్టమర్ సపోర్ట్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలను కూడా అందిస్తున్నట్లు తెలపడం మరో మంచి విషయం.
ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో విజయవంతంగా కస్టమర్ డెలివరీలు ప్రారంభించిన రాప్టీ.HV, ఇప్పుడు బెంగళూరును తన రెండో కార్యకలాపాల కేంద్రంగా మార్చుకుంది. ఇకపై దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా విడతల వారీగా విస్తరించి, మరింత మంది భారతీయ కస్టమర్లకు తన మోటార్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా రాప్టీ.HV సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దినేష్ అర్జున్ మాట్లాడుతూ, టెక్నాలజీ ఆవిష్కరణలను ఎప్పుడూ ప్రోత్సహించే నగరం బెంగళూరు. అందుకే మా తొలి విస్తరణకు ఈ నగరాన్ని ఎంచుకున్నాం. మా దృష్టిలో టెక్నాలజీ అంటే కేవలం ఫీచర్లు మాత్రమే కాదు, కస్టమర్‌కి అందించే అనుభవం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రతి అంశాన్ని వినియోగదారుడిలో పూర్తి నమ్మకం కలిగించేలా రూపొందించామని తెలిపారు.


Click it and Unblock the Notifications