ఒక్క ప్రకటనతో దేశాన్నే ఆశ్చర్యపరిచిన రివోల్ట్.. హార్దిక్ పాండ్యా ఎంట్రీతో షేక్ అవుతున్న ఈవీ మార్కెట్
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రేసులో ఎలక్ట్రికల్ బైక్ తయారీలో అగ్రగామిగా ఉన్న రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బ్రాండ్‌ను మరింత జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ వార్త ఇప్పుడు అటు క్రికెట్ సర్కిల్స్‌లోనూ, ఇటు ఆటోమొబైల్ రంగంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
రివోల్ట్ మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేసిన ఘనతను కలిగి ఉంది. అయితే ఈ కంపెనీ గురించి పట్టణ ప్రాంతాల్లో కొంతమందికి తెలిసినా, గ్రామీణ, యువతలో ఇంకా పూర్తిస్థాయి గుర్తింపు రావాల్సి ఉంది.

ఈ గ్యాప్‌ను భర్తీ చేసేందుకు హార్దిక్ పాండ్యా సరైన ఎంపిక అని కంపెనీ భావిస్తోంది. హార్దిక్ పాండ్యా మైదానంలో చూపించే దూకుడు, అతని స్టైలిష్ లుక్, ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే అతని వ్యక్తిత్వం తమ కంపెనీ సిద్ధాంతాలతో సరిగ్గా సరిపోతాయని రివోల్ట్ మోటార్స్ పేర్కొంది.
ఈ భాగస్వామ్యం గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.."నేను ఎప్పుడూ కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాను. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, భవిష్యత్తు అవసరాలైన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రివోల్ట్ మోటార్స్ కేవలం బైక్‌లను మాత్రమే తయారు చేయడం లేదు, మన ప్రయాణ పద్ధతినే మార్చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో భాగమైనందుకు నాకు గర్వంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.

రివోల్ట్ మోటార్స్ (Revolt Intellicorp) 2017లో స్థాపించబడింది. ఇది రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (RattanIndia Enterprises Ltd)లో ఒక భాగం. రతన్ ఇండియా సుమారు రూ.5,080 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఒక పెద్ద సంస్థ. వీరు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా డ్రోన్లు, ఫ్యాషన్ బ్రాండ్లు, ఈ-కామర్స్ రంగాల్లో కూడా రాణిస్తున్నారు. రివోల్ట్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ RV400 ద్వారా భారత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
కేవలం బ్యాటరీతో నడవడం మాత్రమే కాకుండా ఈ బైక్‌లలో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఉదాహరణకు..మీరు బైక్ నుంచి వచ్చే సౌండ్‌ను మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ఒక బటన్ నొక్కితే స్పోర్ట్స్ బైక్ సౌండ్, మరో బటన్ నొక్కితే క్రూయిజర్ సౌండ్ వచ్చేలా టెక్నాలజీని వాడారు. ఇలాంటి వినూత్న ఫీచర్లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించనున్నారు.
రాబోయే రోజుల్లో రివోల్ట్ మోటార్స్ నిర్వహించే అన్ని డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాల్లో హర్దిక్ పాండ్యా కనిపిస్తారు. ముఖ్యంగా టీవీ అడ్వర్టైజ్‌మెంట్లు, రోడ్డు షోలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యాక్టివిటీలలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. దీనివల్ల కాలేజీ విద్యార్థులు, యువ ఉద్యోగులు ఎలక్ట్రిక్ బైక్ కొనేటప్పుడు రివోల్ట్‌ను ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకుంటారని కంపెనీ ఆశిస్తోంది.

ప్రస్తుతం భారత్‌లో టీవీఎస్, బజాజ్, యమహా వంటి దిగ్గజ సంస్థలు తమ ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి వదులుతున్న తరుణంలో, రివోల్ట్ ఇలాంటి ఒక స్టార్ క్రికెటర్‌ను అంబాసిడర్‌గా పెట్టుకోవడం ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది.
రతన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ అంజలి రతన్ మాట్లాడుతూ.. "హార్దిక్ పాండ్యా ఆధునిక భారతీయుడికి ఒక నిదర్శనం. భయం లేని పోరాట పటిమ, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన అతని సొంతం. రివోల్ట్ కూడా రేపటి తరానికి కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించాలని నిరంతరం శ్రమిస్తోంది. హార్దిక్ ప్రభావం దేశవ్యాప్తంగా మా బ్రాండ్‌ను ప్రతి మూలకు చేరుస్తుందని నమ్ముతున్నాము" అని అన్నారు.
రివోల్ట్ మోటార్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా తన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల్లో కూడా షోరూమ్‌లను ఏర్పాటు చేస్తోంది. బ్యాటరీ రేంజ్, స్మార్ట్ కనెక్టివిటీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి అంశాలే రివోల్ట్ బైక్‌లను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.


Click it and Unblock the Notifications








