Royal Enfield కొత్త బుల్లెట్ బైక్.. ఇది అద్భుతంగా ఉంది! రోడ్డుపై వెళ్తే అందరి చూపు మీ వైపే!
భారత మోటార్‌సైకిల్ ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పేర్లలో ఒకటైన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు తన పురాతన మరియు ఐకానిక్ బుల్లెట్ శ్రేణిలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ 650 (Bullet 650) మోటార్‌సైకిల్‌ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. క్లాసిక్ బుల్లెట్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆధునిక 650cc ప్లాట్‌ఫామ్‌తో వచ్చిన ఈ కొత్త బైక్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ధరను కంపెనీ రూ. 3.65 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. బుల్లెట్ శ్రేణిలో ఇది అత్యంత శక్తివంతమైన, ప్రీమియం మోడల్‌గా నిలుస్తోంది. సంప్రదాయ బుల్లెట్ డిజైన్‌ను కొనసాగిస్తూ, ఆధునిక ఇంజిన్ టెక్నాలజీ, మెరుగైన రైడింగ్ అనుభవాన్ని కలిపి ఈ బైక్‌ను రూపొందించారు.
ఈ మోటార్‌సైకిల్ మొదటిసారిగా ప్రపంచానికి EICMA 2025 ఆటో షోలో పరిచయమైంది. తర్వాత భారతదేశంలో మోటోవర్స్ 2025 ఈవెంట్ సందర్భంగా ప్రదర్శించారు. అప్పటి నుంచే ఈ బైక్‌పై భారీ ఆసక్తి నెలకొంది. మొదట ఈ బైక్‌ను 2026 జనవరిలోనే మార్కెట్లోకి తీసుకురావాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడుదల కొంత ఆలస్యమైంది. అయితే ఇప్పుడు చివరకు ఈ బైక్ అధికారికంగా అమ్మకానికి అందుబాటులోకి ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డిజైన్ విషయానికి వస్తే, కొత్త బుల్లెట్ 650లో బుల్లెట్ 350 నుంచి స్పష్టమైన డిజైన్ ప్రభావం కనిపిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన క్లాసిక్ బుల్లెట్ DNAను కొనసాగిస్తూ, ఈ కొత్త 650cc మోడల్‌ను రూపొందించింది. ముందుభాగంలో టైగర్ ఐ DRLలతో కూడిన గుండ్రని హెడ్‌లైట్ బైక్‌కు సంప్రదాయ బుల్లెట్ స్టైల్‌ను ఇస్తుంది. రాత్రి సమయంలో ఇది మరింత ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేశారు.
ఇక బుల్లెట్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే టియర్‌డ్రాప్ ఆకారంలోని ఫ్యూయల్ ట్యాంక్ ఈ మోడల్‌లో కూడా కొనసాగింది. దీనిపై చేతితో గీసిన పిన్‌స్ట్రైప్, మెటల్ బ్యాడ్జింగ్‌ను అందించడం ద్వారా బైక్‌కు మరింత రేట్రో ఫీల్‌ను ఇచ్చారు. క్లాసిక్ 650 ట్విన్‌తో పోలిస్తే, ఇందులో కొంచెం ఎక్కువ చతురస్రాకారంలో ఉండే వెనుక ఫెండర్‌ను ఉపయోగించడం గమనించవచ్చు. ఇది బైక్ వెనుక భాగానికి మరింత బలమైన, మస్క్యులర్ లుక్‌ను ఇస్తుంది.

క్రోమ్ ఫినిష్ విషయానికి వస్తే, హెడ్‌లైట్ హుడ్, టెయిల్‌లైట్, పాలిష్ చేసిన అల్యూమినియం స్విచ్‌గేర్ వంటి అంశాలను రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ నుంచి పంచుకుంది. ఇవి బైక్‌కు ప్రీమియం, పాతకాలపు రాయల్ ఎన్‌ఫీల్డ్ స్టైల్‌ను మరింత బలపరుస్తాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కూడా సంప్రదాయ శైలిని కొనసాగించారు. డిజి-అనలాగ్ సెటప్‌తో వచ్చే ఈ కన్సోల్‌లో స్పీడోమీటర్‌తో పాటు ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్ కోసం చిన్న డిజిటల్ డిస్‌ప్లేను అందించారు.
బుల్లెట్ 650లో కంపెనీ తన ప్రసిద్ధ 650cc ట్విన్-సిలిండర్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించింది. ఇదే ఇంజిన్ ఇప్పటికే ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, ఇతర 650cc మోడళ్లలో ఉపయోగిస్తున్నారు. దీనికి శక్తిని అందించేది 648cc సామర్థ్యం గల ప్యారలల్-ట్విన్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్. పనితీరు పరంగా, ఈ ఇంజిన్ 47hp శక్తిని, 52Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

బుల్లెట్ 650ను డ్యూయల్-క్రాడిల్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇది బైక్‌కు మంచి స్థిరత్వం, బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తుంది. సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ముందువైపు 120mm ట్రావెల్ కలిగిన షోవా టెలిస్కోపిక్ ఫోర్క్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో 90mm ట్రావెల్ ఉన్న ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు అందించారు. ఇది కానన్ బ్లాక్, బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.


Click it and Unblock the Notifications