కొత్త బుల్లెట్‌కు చుక్క పెట్రోల్ అవసరం లేదు, పైగా ఎలక్ట్రిక్ కూడా కాదు! ఇదో సర్‌ప్రైజ్!
బుల్లెట్ అంటేనే గుర్తుకొచ్చే పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). దశాబ్దాలుగా రైడర్ల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) ఇప్పుడు మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. పెట్రోల్‌పై పూర్తిగా ఆధారపడే రోజుల నుంచి బయటకు వచ్చి, పర్యావరణానికి మేలు చేసే మార్గంలో అడుగులు వేస్తోంది. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన క్లాసిక్ 350 మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే చెన్నై నగరంలో ఈ ఐకానిక్ బైక్ కొత్త అవతారంలో టెస్ట్ రన్స్ చేస్తుండటం పెద్ద చర్చకు దారి తీసింది. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో రూపొందించిన ఈ కొత్త క్లాసిక్ 350, భవిష్యత్ ఇంధన విధానాలకు అనుగుణంగా రూపొందించబడుతోంది.
సాధారణ పెట్రోల్‌కు బదులుగా E85, E100 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలను ఉపయోగించేలా ఈ బైక్‌ను తయారు చేయడం, ఇండియన్ టూ-వీలర్ మార్కెట్‌లో ఒక పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ఈ ప్రయాణం ఒక్కరోజులో మొదలైనది కాదు. 2025లో జరిగిన Bharat Mobility Expo 2025లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ను మొదటిసారి ప్రపంచానికి చూపించిన రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇప్పుడు ఆ కాన్సెప్ట్‌ను రోడ్లపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం చెన్నై పబ్లిక్ రోడ్లపై జరుగుతున్న టెస్టింగ్ చూస్తే, ఈ బైక్ ప్రొడక్షన్ దశకు దగ్గరపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం కూడా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. E85, E100 వంటి ఇంధనాల వినియోగాన్ని సులభతరం చేసేలా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడం, ఇలాంటి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఈ నేపథ్యంతో Royal Enfield తీసుకున్న ఈ అడుగు ప్రాముఖ్యతను సంతరించుకుంది.
చెన్నై రోడ్లపై ఇప్పుడు Classic 350 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ టెస్ట్ డ్రైవ్‌లో ఉంది. ఇది ఫ్యూయల్ ట్యాంక్‌పై స్పష్టంగా కనిపించే 'E85' స్టిక్కర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బైక్‌కు సంబంధించిన చిత్రాలను రష్‌లైన్ విడుదల చేయడంతో ఈ విషయం మరింత వైరల్ అయింది. ఈ కొత్త టెక్నాలజీ అసలు ప్రత్యేకత పెట్రోల్‌కు బదులుగా 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమంతో కూడా ఈ బైక్ సజావుగా నడవగలగడం.

అంతేకాదు, ఇది పూర్తిగా E100 ఫ్యూయల్‌కు అనుగుణంగా తయారైతే, ఒక్క చుక్క పెట్రోల్ కూడా అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్‌తోనే నడిచే అవకాశం ఉంటుంది. ఇది భారతదేశంలో ఇంధన వినియోగ విధానంలో పెద్ద మార్పుకు దారితీయగల అంశంగా భావిస్తున్నారు.డిజైన్ పరంగా చూస్తే, ఈ బైక్ ప్రస్తుత క్లాసిక్ 350తో చాలా వరకు ఒకేలా కనిపిస్తోంది. అయితే టెస్ట్ యూనిట్‌లో కొన్ని చిన్న మార్పులు కనిపిస్తున్నాయి.
కొత్త కలర్ స్కీమ్‌తో పాటు, సాధారణంగా కనిపించే వైర్-స్పోక్ వీల్స్‌కు బదులుగా అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. ఇవి ట్యూబ్‌లెస్ టైర్లకు అనుకూలంగా, బైక్‌కు మరింత మోడర్న్ లుక్‌ను తీసుకువచ్చాయి. ఇంకా, ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను సాధారణ పెట్రోల్ మోడల్ నుంచి వేరు చేసే ప్రధాన గుర్తు ఫ్యూయల్ ట్యాంక్‌పై 'E85' మార్కింగ్ ఉంది. డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకుండా, Royal Enfield పూర్తిగా ఫ్యూయల్ సిస్టమ్‌పైనే ఫోకస్ పెట్టింది.
మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఈ Classic 350 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ పెద్ద సంచలనం సృష్టించడం ఆశ్చర్యం కాదు. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, రాబోయే నెలల్లోనే ఈ బైక్ అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఇప్పుడు జరుగుతున్న మార్పులు చూస్తే, ఇథనాల్ ఇంధన విప్లవం నెమ్మదిగా వేగం పుంజుకుంటోందని స్పష్టంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications