రూ.1.99 లక్షలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ఒక్క ఛార్జ్‌తో 154 కి.మీలు, మార్కెట్లో సంచలనం!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పుడూ తన ప్రత్యేక శైలితో ముందుండే రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా తన అడుగును బలంగా ముద్రించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను కంపెనీ అధికారికంగా భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌ను కంపెనీ తన కొత్త సబ్-బ్రాండ్ అయిన Flying Flea కింద తీసుకొచ్చింది. ఈ బ్రాండ్‌లో వచ్చిన తొలి మోడల్‌గా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) నిలవడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ విషయంలో చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న క్లాసిక్ DNA ను కొనసాగిస్తూ, ఆధునిక ఎలక్ట్రిక్ టచ్‌ను అందించారు. సిటీ రైడింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బైక్, లైట్‌వెయిట్ బాడీతో పాటు ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది.
పాత ఫ్లయింగ్ ఫ్లీ మోటార్‌సైకిళ్లకు ప్రేరణగా రూపొందిన ఈ మోడల్, రెట్రో స్టైల్‌ను ఇష్టపడే వారికి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ధర విషయానికి వస్తే, ఈ ఫ్లయింగ్ ఫ్లీ సీ6ను కంపెనీ రూ. 2.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే, వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BaaS) పథకాన్ని కూడా అందిస్తోంది. ఈ స్కీమ్‌ను ఎంచుకుంటే, బైక్ ప్రారంభ ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

అదే బైక్‌ను సుమారు రూ.1.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించడం పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. బ్యాటరీని సొంతంగా కొనకుండా, సబ్‌స్క్రిప్షన్ విధానంలో ఉపయోగించుకునే ఈ విధానం వల్ల ప్రారంభ ఖర్చు తగ్గడమే కాకుండా, బ్యాటరీ మెయింటెనెన్స్ బాధ్యత కూడా కంపెనీదే అవుతుంది. ఈ లాంచ్‌తో, Royal Enfield భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రవేశపెట్టిన ప్రముఖ సంప్రదాయ మోటార్‌సైకిల్ తయారీదారుల జాబితాలో చేరింది.
ఈ బైక్‌లో 3.91 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించగా, దానికి అనుగుణంగా పనిచేసే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా అమర్చారు. ఈ మోటార్ గరిష్టంగా 15.4 kW (20.6 hp) పవర్‌ను, 60 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 154 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో పవర్‌ను వెనుక చక్రాలకు పంపించడం వల్ల రైడ్ సమయంలో నాయిస్ తక్కువగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ బైక్ నిరాశపరచదు. కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 115 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం, నగర రోడ్లతో పాటు హైవే ప్రయాణాలకు కూడా ఇది సరిపోతుందని సూచిస్తుంది. చార్జింగ్ విషయంలో కూడా ఈ బైక్ వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది. బ్యాటరీని పూర్తిగా 0 నుంచి 100 శాతం వరకు కేవలం 2.16 గంటల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు.
అలాగే, రోజువారీ వినియోగానికి ఉపయోగపడే 20 నుంచి 80 శాతం ఛార్జింగ్‌ను కేవలం 1.05 గంటల్లో పూర్తి చేసుకోవచ్చు. ఇక బరువు విషయానికి వస్తే, చాలా తేలికగా ఉంటుంది. సుమారు 124 కిలోల బరువు మాత్రమే ఉండటం వల్ల హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే 823 మిల్లీమీటర్ల సీటు ఎత్తు ఉన్నప్పటికీ, బైక్ డిజైన్ సన్నగా ఉండటంతో పొట్టిగా ఉండే రైడర్లు కూడా సులభంగా నేలను తాకగలరు.

ఇది 3.5 అంగుళాల వృత్తాకార కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇది కొత్త ప్రత్యేక స్విచ్‌గేర్‌తో జత చేయబడింది. ఈ డిస్ప్లేతో రైడర్‌కు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని స్పష్టంగా, మోడర్న్ లుక్‌లో చూపిస్తుంది. ఈ బైక్‌కు సంబంధించిన టెస్ట్ రైడ్‌లు ఏప్రిల్ 10వ తేదీ నుంచి బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. దీంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైడర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్ పనితీరును ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందనున్నారు.


Click it and Unblock the Notifications








