రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 కోసం వేచి చూడాలా? లేక 450 కొనేయాలా? మీ కన్ఫ్యూజన్ క్లియర్!
భారత్‌లో నవంబర్ 27 నుంచి 29 వరకు గోవా వేదికగా మోటోవర్స్ జరగనుంది. ఈ వేడుకల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 అరంగేట్రం చేయనుండటంతో బైకర్లలో తీవ్ర ఉత్సుకత నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటికే మార్కెట్లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న హిమాలయన్ 450 కొనాలా? లేక కొత్త 750 కోసం వేచి చూడాలా? అని చాలామంది ఆలోచనలో పడ్డారు. బైకర్ల గందరగోళానికి స్వస్తి పలుకుతూ.. ఈ రెండు బైక్‌ల అధికారిక స్పెసిఫికేషన్లు, అంచనా ధరలు, తెలుగు నగరాల్లో డెలివరీ వివరాలతో కూడిన పూర్తి సమాచారం మీకోసం.
ఇటీవల జరిగిన EICMA షోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ హిమాలయన్ 750 బైక్‌కు సంబంధించిన 743cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ (63 Nm టార్క్) వివరాలను వెల్లడించింది. మరోవైపు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న హిమాలయన్ 450 మోడల్ 452cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 40 PS పవర్, 40 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మీ రైడింగ్ అవసరాలు, హైవే పర్ఫార్మెన్స్, ఇంజిన్ హీట్, మైలేజ్, బరువు, సీటు ఎత్తు, పిలియన్ కంఫర్ట్, లగేజ్ సామర్థ్యం మరియు ధర ఆధారంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది నిర్ణయించుకోవచ్చు.

హిమాలయన్ 750 వర్సెస్ హిమాలయన్ 450: ఇంజిన్, రైడింగ్, మైలేజ్ వ్యత్యాసాలు
హిమాలయన్ 750లోని 63 Nm ట్విన్ సిలిండర్ ఇంజిన్ కారణంగా గంటకు 100 నుంచి 120 కిమీ వేగంతో వెళ్తున్నప్పుడు బైక్ చాలా స్మూత్‌గా, స్థిరంగా వెళ్తుంది. అదే హిమాలయన్ 450 విషయానికొస్తే.. 40 PS పవర్, 40 Nm టార్క్‌తో లీటరుకు 28 నుంచి 32 కిమీ మైలేజ్ ఇస్తుందని బైకర్లు చెబుతున్నారు. ఇక ఆటోకార్ జరిపిన 650-ట్విన్ టెస్టుల ఆధారంగా చూస్తే, నగరాల్లో లీటరుకు 22–25 కిమీ, హైవేలపై 30 కిమీకి పైగా మైలేజ్ వచ్చింది. కాబట్టి, 450తో పోలిస్తే 750 మోడల్ కొద్దిగా ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది, అలాగే సిటీ ట్రాఫిక్‌లో ఇంజిన్ కాస్త ఎక్కువ వేడెక్కే అవకాశం ఉంది.
హిమాలయన్ 750 వర్సెస్ హిమాలయన్ 450: బరువు, సీట్ ఎత్తు, ప్రయాణ సౌకర్యం
హిమాలయన్ 450 బరువు 196 కిలోలు కాగా, దీని సీటు ఎత్తును 825 mm నుంచి 845 mm వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. తక్కువ ఎత్తు ఉన్న రైడర్ల కోసం కంపెనీ అందించే ప్రత్యేక లో-సీట్‌తో దీన్ని 805–825 mm వరకు తగ్గించుకునే వెసులుబాటు ఉంది. ఇక హిమాలయన్ 750 కాస్త ఎక్కువ బరువుతో రానున్నందున, హైవేలపై ప్రయాణించేటప్పుడు బైక్ మరింత స్థిరంగా ఉంటుంది. ఇద్దరు ప్రయాణించినా లేదా ఎక్కువ లగేజ్ తీసుకెళ్లినా రైడింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. లీకైన సమాచారం ప్రకారం.. ఇందులో 19-అంగుళాల ఫ్రంట్, 17-అంగుళాల రియర్ వీల్స్‌తో పాటు రోడ్-ఫోకస్డ్ టైర్లను ఇస్తున్నారు. అంటే ఇది లాంగ్ హైవే ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. అదే 450 మోడల్ అయితే అన్ని రకాల రోడ్లకు, ఆఫ్‌రోడింగ్‌కు సరిగ్గా సరిపోతుంది.
హిమాలయన్ 750 వర్సెస్ హిమాలయన్ 450: ధర, వేరియంట్లు, మార్కెట్ స్థానం
ప్రస్తుతం మార్కెట్లో హిమాలయన్ 450 ఎక్స్-షోరూమ్ ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 3.08 లక్షల నుంచి రూ. 3.40 లక్షల వరకు ఉన్నాయి. కాగా, హిమాలయన్ 750 భారతీయ ధరలు లేదా వేరియంట్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఇంటర్‌సెప్టర్ 650 ధర రూ. 3.38 లక్షలు, సూపర్‌మీటియోర్ 650 ధర రూ. 4.06 లక్షల వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే, హిమాలయన్ 750 ప్రారంభ ధర రూ. 4 లక్షల శ్రేణిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇస్తున్న క్రూయిజ్ కంట్రోల్, టీపీఎమ్‌ఎస్ (TPMS) వంటి అధునాతన ఫీచర్లను బట్టి చూస్తే ఈ ప్రీమియం ధర సమంజసమేననిపిస్తుంది.
హిమాలయన్ 750 వర్సెస్ హిమాలయన్ 450: డెలివరీ సమయం, తెలుగు నగరాల్లో టెస్ట్ రైడ్స్
నవంబర్ 17 నాటి సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లో హిమాలయన్ 450 మోడల్స్‌కు (ముఖ్యంగా ట్యూబ్‌లెస్ వీల్ కలర్ ఆప్షన్లకు) 45 నుంచి 60 రోజుల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో డెలివరీ మరింత ఆలస్యమవుతున్నందున, షోరూమ్ వారి నుంచి కచ్చితమైన తేదీని లిఖితపూర్వకంగా తీసుకోవడంతో పాటు యాప్ ద్వారా ట్రాక్ చేయడం మంచిది. ఇక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలోని డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ బైక్ టెస్ట్ రైడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు 750 మోడల్ కోరుకుంటే.. మోటోవర్స్ ప్రకటనల వరకు వేచి చూసి, ఆ తర్వాత త్వరగా బుక్ చేసుకోవడం మేలు.
మీరు మరొక రెండు వారాలు వేచి చూడగలరు అనుకుంటే, మోటోవర్స్ ఈవెంట్‌లో హిమాలయన్ 750 పూర్తి వివరాలు చూశాకే ఒక నిర్ణయానికి రండి. లాంగ్ డ్రైవ్‌లు ఎక్కువగా చేసేవారికి, వెనుక కూర్చునేవారికి 750 ట్విన్ ఇంజిన్ పవర్, కొత్త ఫీచర్లు బాగా నచ్చుతాయి. అలా కాకుండా, రోజువారీ వినియోగానికి బెస్ట్ వాల్యూ, తక్కువ సీట్ హైట్ ఆప్షన్లు కావాలనుకుంటే హిమాలయన్ 450 పర్ఫెక్ట్ ఛాయిస్. పైగా వేగంగా డెలివరీ కావాలనుకునే వారు ఇప్పుడే హిమాలయన్ 450 బుక్ చేసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications
