ఇక బండి కొనక్కర్లేదు.. కావాల్సినన్ని రోజులు అద్దెకు తెచ్చుకోవచ్చు.. సుజుకీ సంచలన ఆఫర్
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్‌గా పేరున్న సుజుకి (Suzuki), తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి ఈ-యాక్సెస్ (Suzuki eAccess) తో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ స్కూటర్ ధర దాదాపు రూ.1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండటంతో, అందరూ దీనిని కొనడం కష్టమని భావించిన సుజుకి.. కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీరు సొంతం చేసుకోనవసరం లేదు, కేవలం రెంటల్ (అద్దె) లేదా సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో వాడుకోవచ్చు. ఇందుకోసం సుజుకి సంస్థ ప్రముఖ బైక్ రెంటల్ కంపెనీ రాయల్ బ్రదర్స్ (Royal Brothers) తో జతకట్టింది.
సొంతం చేసుకోక్కర్లేదు.. అద్దెకు తీసుకుంటే చాలు
సాధారణంగా కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనాలంటే భారీ మొత్తంలో డబ్బు వెచ్చించాలి. కానీ సుజుకి ప్రవేశపెట్టిన ఈ కొత్త పద్ధతిలో, మీరు కేవలం 24 గంటల నుంచి ఏడాది వరకు మీ అవసరానికి తగ్గట్టుగా స్కూటర్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, విశాఖపట్నం, భువనేశ్వర్, జైపూర్, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఇంకా సందేహాలు ఉన్నవారు లేదా భారీ ధర పెట్టి కొనలేని వారికి ఈ రెంటల్ ప్లాన్ ఒక గొప్ప వరమని చెప్పవచ్చు.

సుజుకి ఈ-యాక్సెస్ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
సుజుకి నుంచి వస్తున్న ఈ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్నాలజీ పరంగా చాలా బాగుంది. ఇందులో 3.07 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్, గంటకు 71 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇంజన్ విషయానికి వస్తే, ఇది 4.1 kW పవర్, 15 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. కేవలం 1 గంట 12 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఆఫీసు అవసరాలకు లేదా సిటీలో తిరగడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
టెక్నాలజీలో రాజీ పడలేదు
ఈ-యాక్సెస్ స్కూటర్‌లో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సుజుకి అనేక ఆధునిక ఫీచర్లను జోడించింది. కలర్ టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లే, కీ-లెస్ ఆపరేషన్ (తాళం లేకుండానే స్టార్ట్ చేయడం), యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. ప్రయాణంలో భద్రత కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు, ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, టెలిస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్ అందించారు. అదనంగా, ఇందులో ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్, సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ వంటి ఫీచర్లు రైడింగ్ అనుభవాన్ని మరింత సరళతరం చేస్తాయి.

పోటీని తట్టుకోగలదా?
భారత మార్కెట్లో ఇప్పటికే టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్, ఓలా వంటి గట్టి పోటీదారులు ఉన్నారు. వారి ధరలు, రేంజ్‌తో పోలిస్తే సుజుకి ఈ-యాక్సెస్ ధర కొంచెం ఎక్కువగా ఉండి, రేంజ్ కొంచెం తక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. అయితే, సుజుకికున్న బ్రాండ్ ఇమేజ్, ఇప్పుడు తీసుకొచ్చిన రెంటల్ ప్లాన్స్ కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయి. ఒకవేళ ఈ ఈవీ రెంటల్ ప్లాన్ సక్సెస్ అయితే, భవిష్యత్తులో గిక్సర్, బర్గ్‌మ్యాన్, అవెనిస్ వంటి పెట్రోల్ మోడళ్లను కూడా ఇదే పద్ధతిలో అద్దెకు ఇచ్చే యోచనలో సుజుకి ఉంది.


Click it and Unblock the Notifications








