ఛాయ్ తాగొచ్చే లోపే ఛార్జింగ్ అయిపోద్ది.. నిమిషాల్లో ఫుల్ అయ్యే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే ప్రతి ఒక్కరూ చూసే ప్రధాన ఫీచర్ ఫాస్ట్ ఛార్జింగ్. పెట్రోల్ బంకుల్లో నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ చేసినంత వేగంగా కాకపోయినా, వీలైనంత త్వరగా ఛార్జింగ్ అయ్యే ఈవీలకే వినియోగదారులు జై కొడుతున్నారు. ఆఫీసుకో లేదా బయటకో వెళ్లేటప్పుడు తక్కువ టైమ్‌లో ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2026 నాటికి భారత మార్కెట్లో అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.
ఏథర్ 450 సిరీస్ (Ather 450 Series)
బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో దూసుకుపోతోంది. వీరి ఏథర్ 450X, 450S మోడళ్లు ఏథర్ గ్రిడ్ (Ather Grid) అనే ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ద్వారా కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 30 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుంటే 2.9 kWh బ్యాటరీ సుమారు 3 గంటల్లో 80 శాతం వరకు నిండుతుంది. 3.7 kWh బ్యాటరీకి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. వీటి ధర రూ. 1.19 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఓలా ఎస్1 ప్రో ప్లస్ (Ola S1 Pro Plus)
ఓలా ఎలక్ట్రిక్ తన 3వ జనరేషన్ స్కూటర్లతో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఓలా ఎస్1 ప్రో ప్లస్ (S1 Pro Plus) హైపర్ ఛార్జర్ నెట్‌వర్క్ ద్వారా కేవలం 12-15 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా పవర్‌ను పొందుతుంది. ఇందులో 5.2 kWh భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం వల్ల కస్టమర్లకు టైమ్ ఆదా అవుతోంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధర సుమారు రూ.1.25 లక్షల నుంచి రూ.1.55 లక్షల మధ్యలో ఉంది.
బజాజ్ చేతక్ C2501 (Bajaj Chetak C2501)
బజాజ్ ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ చేతక్ C2501 స్కూటర్ ఛార్జింగ్ టైమ్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో 2.5 kWh బ్యాటరీ ఉండటం వల్ల, 750W ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో కేవలం 2 గంటల 25 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇది 113 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ.87,100 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. తక్కువ ధరలో వేగంగా ఛార్జ్ అయ్యే స్కూటర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ (TVS iQube ST)
టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీల్లో ఒకటి. ఇందులో ముఖ్యంగా ఐక్యూబ్ ఎస్టీ (iQube ST) వేరియంట్ 1500W క్విక్ ఛార్జర్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కేవలం 2.5 గంటల్లో బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 212 కి.మీల భారీ రేంజ్‌ను అందిస్తుంది. ఫ్యామిలీతో పాటు లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి ఈ స్కూటర్ సరిగ్గా సరిపోతుంది. దీని ధర సుమారు రూ.95,000 నుంచి ప్రారంభమవుతుంది.
సింపుల్ వన్ (Simple One)
సింపుల్ ఎనర్జీ నుంచి వచ్చిన సింపుల్ వన్ పర్ఫార్మెన్స్, ఛార్జింగ్ రెండింటిలోనూ మేటిగా ఉంది. ఇది ఇంటి వద్దే 2 గంటల 15 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకుంటుంది. 5 kWh భారీ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ 265 కి.మీల రేంజ్ ఇస్తుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ ఉండటం విశేషం. ప్రీమియం లుక్, స్పీడ్ కోరుకునే యువత దీని వైపు మొగ్గు చూపుతున్నారు. దీని ధర సుమారు రూ.1.70 లక్షల వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications








