ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ రేంజ్.. ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన టాప్ 5 సూపర్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీ (EV)ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ బైక్ అనగానే కేవలం స్లోగా వెళ్లే స్కూటర్లే కాదు, ఇప్పుడు రోడ్లపై చిరుతపులిలా దూసుకెళ్లే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఓలా (Ola) నుంచి అల్ట్రావాయిలెట్ (Ultraviolette) వరకు మార్కెట్లో టాప్ స్పీడ్, అదిరిపోయే రేంజ్‌తో దూసుకుపోతున్న 5 బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.
1. రివోల్ట్ RV400 (Revolt RV400)
భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల ట్రెండ్‌ను మొదలుపెట్టిన ఘనత రివోల్ట్ RV400కే దక్కుతుంది. ఇది చూడటానికి అచ్చం పెట్రోల్ స్ట్రీట్ ఫైటర్ బైక్‌లా ఉంటుంది. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని నడుపుతున్నప్పుడు మీకు పెట్రోల్ బైక్ లాంటి సౌండ్ కావాలంటే కృత్రిమంగా స్పీకర్ల ద్వారా వచ్చే ఎగ్జాస్ట్ సౌండ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందులో మూడు రకాల రైడింగ్ మోడ్స్ (Eco, Normal, Sport) ఉంటాయి.

మీరు స్పోర్ట్ మోడ్ ఆన్ చేస్తే, ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 3.24 kWh బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఈ బైక్, ఎకో మోడ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.50 లక్షలుగా ఉంది. మధ్యతరగతి వారికి, కాలేజీ కుర్రాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్.
2. ఓబెన్ రార్ (Oben Rorr)
దేశీ స్టార్టప్ కంపెనీ నుంచి వచ్చిన ఓబెన్ రార్ బైక్ ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటోంది. ఇందులో 4.4 kWh కెపాసిటీ ఉన్న ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీని వాడారు. ఇది మిగిలిన బ్యాటరీల కంటే ఎక్కువ కాలం మన్నుతుంది.

ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐడీసీ (IDC) నిబంధనల ప్రకారం 187 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కేవలం 3 సెకన్లలోనే సున్నా నుంచి 40 కిమీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేలపై కూడా ఈ బైక్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. దీని ధర కూడా రూ. 1.50 లక్షల వద్దే ఉంది.
3. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ (Ola Roadster X Plus)
ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో రారాజుగా ఉన్న ఓలా, ఇప్పుడు బైక్ సెగ్మెంట్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని టాప్ వేరియంట్‌లో ఏకంగా 9.1 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అందించారు.

దీనివల్ల ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల (IDC క్లెయిమ్) రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు దాదాపుగా వెళ్లవచ్చు. వేగం విషయంలో కూడా ఇది తక్కువ తినలేదు, గంటకు 125 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా ఉండటం విశేషం. టెక్నాలజీ ప్రియులకు ఈ బైక్ ఒక వరం లాంటిది.
4. అల్ట్రావయిలెట్ X47 రీకాన్ (Ultraviolette X47 Recon)
మీరు ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తుంటే, అల్ట్రావయిలెట్ X47 రీకాన్ మీకోసమే. ఇది కేవలం బైక్ మాత్రమే కాదు, రోడ్డుపై నడిచే ఒక కంప్యూటర్ అని చెప్పవచ్చు. ఇందులో ఏడీఏఎస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లు, కారులాగే ముందు, వెనుక డ్యాష్ క్యామ్‌లు వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ బైక్ ఇంజిన్ 40.2 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల ఇది గంటకు 145 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. సేఫ్టీకి పెద్దపీట వేసే వారు, లగ్జరీ రైడింగ్ అనుభూతిని కోరుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు. దీని ధర రూ.3.49 లక్షలుగా ఉంది. ఇది ఒక క్రాసోవర్ మోడల్ కాబట్టి అటు స్టైల్, ఇటు పవర్ రెండూ సమానంగా ఉంటాయి.
5. అల్ట్రావయిలెట్ F77 మాక్ 2 రీకాన్ (Ultraviolette F77 Mach 2 Recon)
భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ ఏదైనా ఉందంటే అది అల్ట్రావయిలెట్ F77 మాక్ 2 రీకాన్ మాత్రమే. దీని లుక్ చూస్తేనే ఒక రేసింగ్ బైక్ అని అర్థమవుతుంది. ఇది గంటకు గరిష్టంగా 155 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

40.2 hp పవర్, 100 Nm టార్క్‌తో ఈ బైక్ రోడ్డుపై గాలిలో తేలినట్లు దూసుకుపోతుంది. స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టపడే వారికి పెట్రోల్ ఖర్చు లేకుండా అదే లెవల్ కిక్కుని ఇది అందిస్తుంది. దీని ధర రూ.3.99 లక్షలుగా ఉంది. ఇందులో 10.3 kWh బ్యాటరీని అమర్చారు, ఇది 323 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారికి ఇది ఏకైక ఆప్షన్.


Click it and Unblock the Notifications








