లక్ష మంది ప్రేమను పొందింది.. ట్రయంఫ్ బైకులపై యువతలో పెరుగుతున్న క్రేజ్!
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రీమియం బైక్ బ్రాండ్ అయిన ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారత మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇందుకు ముఖ్య కారణం భారతదేశంలోని ప్రముఖ టూవీలర్, త్రీవీలర్ వాహన తయారీ సంస్థ అయిన Bajaj Autoతో ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యం ద్వారా భారత మార్కెట్లో ట్రయంఫ్ బైకుల తయారీ, మార్కెటింగ్, పంపిణీ కార్యక్రమాలను బజాజ్ సమర్థంగా నిర్వహిస్తోంది. దీనివల్ల ట్రయంఫ్ మోటార్ సైకిళ్లు దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ భాగస్వామ్యం ఫలితంగా ట్రయంఫ్ బ్రాండ్ భారతదేశంలో మంచి విజయాన్ని నమోదు చేస్తోంది.
తాజాగా ఈ సంస్థ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. భారత మార్కెట్లో ట్రయంఫ్ మొత్తం అమ్మకాలు 1 లక్ష యూనిట్లను దాటినట్లు కంపెనీలు ప్రకటించాయి. ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ స్థాయి విక్రయాలు సాధించడం సంస్థకు పెద్ద విజయం.ఈ మైలురాయి ట్రయంఫ్ బ్రాండ్‌పై భారతీయ వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ట్రయంఫ్ బైకులు యువ అభిమానులను బాగా ఆకర్షిస్తున్నాయి.

ముఖ్యంగా మధ్యస్థ ధరలో ప్రీమియం అనుభవాన్ని అందించే కొత్త మోడళ్ల విడుదలతో ఈ బ్రాండ్‌కు మరింత ఆదరణ లభిస్తోంది. మొత్తంగా, భారతదేశంలో 2.5 ఏళ్లలో 1 లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోవడం ట్రయంఫ్ మోటార్ సైకిల్స్‌కు కీలక విజయంగా నిలిచింది. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్లలో ఒకటిగా ట్రయంఫ్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రయంఫ్ డీలర్‌షిప్‌లు ఇప్పటికే 200 కంటే ఎక్కువ పట్టణాల్లో స్థాపించబడ్డాయి. మొత్తం మీద 230కి పైగా ఆధునిక స్టోర్‌ల నెట్‌వర్క్ ఈ బ్రాండ్‌కు మద్దతు ఇస్తోంది. దీనివల్ల ట్రయంఫ్ మోటార్ సైకిళ్లు దేశంలోని అనేక ప్రాంతాల్లో వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ బ్రాండ్ బైకులు తక్కువ ధరల్లో లభించడం వల్ల యువతలో కూడా ఈ బ్రాండ్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది.

అదే కారణంగా భారత మార్కెట్లో ట్రయంఫ్ మోటార్ సైకిళ్ల అమ్మకాలు 1 లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకోవడంలో సహాయపడింది. భారతదేశంలో తయారవుతున్న ట్రయంఫ్ 400cc బైకులు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా జపాన్, ఆస్ట్రేలియా, మెక్సికో, తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పాటు మొత్తం 18 దేశాలకు ఈ బైకులు పంపిణీ అవుతున్నాయి.
ఇక ట్రయంఫ్ బ్రాండ్ కింద అందుబాటులో ఉన్న 400cc సెగ్మెంట్ బైకులు భారత మార్కెట్లో ఎక్కువ డిమాండ్‌ను పొందుతున్నాయి. తక్కువ ధరలో ప్రీమియం అనుభవాన్ని అందించడం ఈ బైకుల ప్రత్యేకత. ప్రస్తుతం కంపెనీ 400cc లోపు ఐదు మోడళ్లను అందిస్తోంది. ఇవన్నీ కూడా రూ.3 లక్షల కంటే తక్కువ ధరకే (ఎక్స్-షోరూమ్) లభిస్తున్నాయి. వాటిలో అత్యంత సరసమైన మోడల్ అయిన Triumph Speed T4 ధర సుమారు రూ.1,95,000 (ఎక్స్-షోరూమ్).

అదేవిధంగా Triumph Thruxton 400 ధర రూ.2,76,383 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. Triumph Scrambler 400 XC ధర రూ.2,96,917(ఎక్స్-షోరూమ్) కాగా, Triumph Scrambler 400 X ధర రూ.2,69,977 (ఎక్స్-షోరూమ్). Triumph Speed 400 ధర సుమారు రూ.2,39,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇలా తక్కువ ధరలో ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, అంతర్జాతీయ బ్రాండ్ విలువను అందించడం వల్ల ట్రయంఫ్ 400cc బైకులు భారత మార్కెట్లో బాగా సేల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications








