ప్రపంచంలో కేవలం 800 మాత్రమే.. లక్షలు ఉంటే సరిపోదు ఈ బైక్ కావాలంటే అదృష్టం కూడా కావాలి
బైక్ లవర్స్ కలల రాకుమారుడు, బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ దిగ్గజం ట్రయంఫ్(Triumph Motorcycles) భారతీయ మార్కెట్లో మరో హై-ఎండ్ సంచలనానికి తెరలేపింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2026 అన్‌లీష్డ్ క్యాంపెయిన్‌లో భాగంగా అంతర్జాతీయంగా ప్రదర్శించిన మోస్ట్ అవేటెడ్ బైక్ ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200 కేఫ్ రేసర్ ఎడిషన్ (Triumph Speed Twin 1200 Cafe Racer Edition)ను ఇప్పుడు అధికారికంగా దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ సరికొత్త సూపర్ బైక్‌ను కంపెనీ తన అఫీషియల్ ఇండియా వెబ్‌సైట్‌లో కూడా లిస్ట్ చేసింది. అయితే, ఇది అందరికీ దొరికే సాధారణ బైక్ కాదు, ప్రపంచవ్యాప్తంగా కేవలం 800 మంది అదృష్టవంతులకు మాత్రమే దక్కే అల్ట్రా లిమిటెడ్ వేరియంట్ కావడం విశేషం.

ధర విషయానికి వస్తే.. ఈ క్లాసిక్ బైక్ అందరికీ అందుబాటులో ఉండే రకం కాదు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.17.99 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200 ఆర్‌ఎస్ (RS) మోడల్ ధర రూ.16.78 లక్షలుగా ఉండగా, ఈ కొత్త కేఫ్ రేసర్ ఎడిషన్ దానికంటే దాదాపు రూ. 1.21 లక్షలు అదనం.
ఈ అదనపు ధరకు తగ్గట్టుగానే బైక్ కొనే ప్రతి కస్టమర్‌కు ఇది ఒరిజినల్ లిమిటెడ్ ఎడిషన్ అని ధృవీకరించే ఒక స్పెషల్ సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ (Certificate of Authenticity)ని కంపెనీ అందిస్తుంది. కాకపోతే ఈ 800 బైకులలో మన ఇండియాకు ఎన్ని కేటాయించారనేది కంపెనీ ఇంకా సీక్రెట్‌గానే ఉంచింది.

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కుర్రకారును ఊపేసిన వింటేజ్ రేసింగ్ బైకుల రూపాన్ని ఈ బైక్ గుర్తుచేస్తుంది. ముఖ్యంగా ట్రయంఫ్ కంపెనీ తన ఐకానిక్ థ్రక్స్టన్ 1200 (Thruxton 1200) మోడల్‌ను నిలిపివేసిన తర్వాత, ఆ లోటును భర్తీ చేస్తూ భారీ ఇంజన్ సామర్థ్యంతో ఈ కేఫ్ రేసర్ ఫార్మాట్‌ను మళ్లీ బ్రతికించింది.
ఈ బైక్‌కు పాత తరం రేసింగ్ శైలిని ప్రతిబింబించేలా క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, హెడ్‌లైట్ చుట్టూ అందమైన కౌల్, సాంప్రదాయ కేఫ్ రేసర్ లుక్ ఇచ్చే గ్రీన్ అండ్ సిల్వర్ (Green-and-Silver) డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌ను ఉపయోగించారు. రోడ్డుపై వెళ్తుంటే ఈ బైక్ ఇచ్చే వింటేజ్ లుక్ మామూలుగా ఉండదు.

ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను చూసిన వెంటనే వాహన ప్రియులను ఆకట్టుకునే మరో ప్రధానమైన అంశం దీని సీటు. కారు లాంటి విలాసవంతమైన ఫీలింగ్ ఇచ్చేలా క్విల్టెడ్ టాన్ లెదర్‌తో ఈ సింగిల్ లాంగ్ సీటును తయారు చేశారు. స్పీడ్ ట్విన్ 1200 సిరీస్‌లోని మరే ఇతర వేరియంట్‌కు కూడా ఇటువంటి స్పెషల్, లగ్జరీ ట్రీట్‌మెంట్ ఇవ్వలేదు. ఈ ప్రీమియం లెదర్ సీటు, ట్యాంక్‌పై ఉండే క్లాసిక్ గ్రాఫిక్స్ ఈ బైక్‌ను మిగతా స్పోర్ట్స్ బైకుల కంటే చాలా ప్రత్యేకం చేస్తాయి.
ఈ రేసు గుర్రం గుండెకాయ లాంటి ఇంజన్ పవర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇందులో మిగతా స్పీడ్ ట్విన్ మోడళ్లలో ఉపయోగించే పవర్‌ఫుల్ 1,200cc సామర్థ్యం గల లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. ఈ భారీ ట్విన్-సిలిండర్ పవర్‌ప్లాంట్ ఏకంగా 105 హార్స్‌పవర్ (hp), 112 Nm ప్రచండమైన పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఈ అన్ లిమిటెడ్ పవర్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది. రైడర్ యాక్సిలరేటర్ పెంచిన వెంటనే, గాలి వేగంతో పోటీ పడుతూ ఈ బైక్ దూసుకుపోతుంది. టెక్నాలజీ పరంగా ట్రయంఫ్ తన మోడ్రన్ క్లాసిక్ ఫ్యామిలీలోనే అత్యంత అరుదైన ఫీచర్‌ను ఈ బైక్‌లో స్టాండర్డ్‌గా జోడించింది. అదే బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ (Bi-directional Quickshifter). దీనివల్ల రైడర్లు క్లచ్ నొక్కకుండానే చాలా వేగంగా గేర్లను మార్చుకోవచ్చు.
సాధారణంగా రేసింగ్ ట్రాక్ బైక్‌లలో కనిపించే ఈ ఫీచర్‌ను ఈ వింటేజ్ మోడల్‌కు ఇవ్వడం గమనార్హం. దీనితో పాటు కారు కంటే సేఫ్టీగా ఉండేలా స్పీడ్ ట్విన్ 1200 ఆర్‌ఎస్ మోడల్ నుంచి సేకరించిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ సూట్, అడ్వాన్స్‌డ్ రైడర్ అసిస్ట్ ఫీచర్లను కూడా ఇందులో పొందుపరిచారు.
బైక్ ఎంత వేగంగా వెళ్లినా రైడర్ భద్రతకు ఢోకా లేకుండా ఉండేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమ రేసింగ్ విడిభాగాలను ఇందులో వాడారు. బైక్ ముందు మరియు వెనుక భాగంలో పూర్తిగా అడ్జస్ట్ చేసుకునే వీలున్న హై-ఎండ్ ఓహ్లిన్స్ (Ohlins) సస్పెన్షన్ సిస్టమ్‌ను అమర్చారు, ఇది రోడ్డుపై ఎలాంటి కుదుపులనైనా ఇట్టే హరిస్తుంది.
అలాగే బ్రేకింగ్ కోసం అత్యంత పవర్‌ఫుల్ బ్రెంబో మోనోబ్లాక్ (Brembo Monobloc) బ్రేక్ కాలిపర్లను, రోడ్డుపై గ్రిప్ అస్సలు కోల్పోకుండా ఉండేందుకు మెట్జెలర్ రేస్‌టెక్ (Metzeler Racetec RR K3) సూపర్ స్పోర్ట్ టైర్లను స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా అందించారు.


Click it and Unblock the Notifications