20 ఏళ్లలో చరిత్ర సృష్టించిన అపాచీ.. 90కి పైగా దేశాల్లో 70 లక్షల మంది రైడర్లు!
టీవీఎస్ మోటార్ (Tvs motor) కంపెనీకి చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ బ్రాండ్ అపాచీ (Apache) తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అపాచీ సిరీస్ బైక్‌లను ఉపయోగిస్తున్న రైడర్ల సంఖ్య 70 లక్షలు (7 మిలియన్లు) దాటినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ 90కి పైగా దేశాల్లో అమ్ముడవుతూ, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా తన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుచుకుంటోంది. 2005లో తొలిసారి మార్కెట్లోకి అడుగుపెట్టిన అపాచీ, రెండు దశాబ్దాల కాలంలో సాధారణ బైక్‌గా ప్రారంభమై, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిల్ బ్రాండ్‌లలో ఒకటిగా ఎదిగింది.
ఈ 20 ఏళ్ల సక్సెస్‌ను పురస్కరించుకుని కంపెనీ తూ రేస్ లగా పేరుతో కొత్త బ్రాండ్ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ద్వారా అపాచీ బ్రాండ్ విలువను మరింత బలంగా చాటిచెప్పాలని చూస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అవసరాల మేరకు అపాచీ సిరీస్ కూడా విస్తరించింది. మొదట స్ట్రీట్ మోటార్‌సైకిళ్లతో ప్రారంభం కాగా, ప్రస్తుతం సూపర్‌స్పోర్ట్, అడ్వెంచర్ టూరింగ్ వంటి విభాగాల్లో కూడా తన స్థానాన్ని ఏర్పరుచుకుంది.

ప్రస్తుతం అపాచీ పోర్ట్‌ఫోలియోలో 160 సీసీ నుంచి 310 సీసీ వరకు వివిధ ఇంజన్లతో కూడిన మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల తమకు నచ్చిన మోడళ్లను సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు. అందరికి అందుబాటు ధర, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైకులను అందించడం ద్వారా టీవీఎస్ ఈ విజయాన్ని సాధించగలిగింది. దీంతో అపాచీ బ్రాండ్ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకుందని చెప్పవచ్చు.
70 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా టీవీఎస్ మరికొన్ని ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ అపాచీ ఓనర్స్ గ్రూప్ (AOG)లో ప్రస్తుతం 5 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారని, అలాగే టీవీఎస్‌కు ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్లకు పైగా వినియోగదారుల బలమైన కమ్యూనిటీ ఉందని కంపెనీ తెలిపింది. ఈ మైలురాయికి గుర్తుగా 70 లక్షలవ అపాచీ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఒక కస్టమర్‌కు ప్రత్యేకంగా డెలివరీ చేసింది.

ఈ మైలురాయి బైక్ బ్లాక్ కలర్ TVS Apache RR 310ది కాగా, దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.2.78 లక్షలు. దీని పనితీరు విషయానికి వస్తే, అపాచీ RR 310లో 312.2 సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38 హెచ్‌పీ పవర్, 29 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను జత చేయడం జరిగింది.
దీని కారణంగా గేర్ మార్పులు మరింత వేగంగా, ఈజీగా ఉంటాయి. ఫీచర్ల పరంగా కూడా ఈ స్పోర్ట్స్ బైక్ ఆకట్టుకుంటుంది. ఇందులో పలు రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటి ఆకట్టుకునే ప్రీమియం ఫీచర్లు చాలా ఉన్నాయి. ఈ కొత్త ఆప్షన్లు ట్రాక్‌పై మాత్రమే కాకుండా రోజువారీ రైడింగ్ సమయంలో కూడా మెరుగైన అనుభూతిని అందించేలా రూపొందించబడ్డాయి.

గత రెండు దశాబ్దాలుగా అపాచీ సిరీస్ భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటుతూ 90కి పైగా దేశాల్లో తన మార్కెట్‌ను విస్తరించుకుంది. ఈ బైక్‌లలో పెటల్ డిస్క్ బ్రేకులు, TVS SmartXonnect స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, సిటీ ట్రాఫిక్‌లో సులభమైన రైడింగ్ కోసం గ్లైడ్ త్రూ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. బిల్ట్-టు-ఆర్డర్ ప్రోగ్రామ్‌తో కస్టమర్లు బుకింగ్ సమయంలోనే నచ్చిన ఫీచర్లు, యాక్సెసరీలతో బైకులను కస్టమైజ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications