రికార్డుల ఊచకోత..అమ్మకాల్లో అరాచకం..టీవీఎస్ తుఫాన్‌కు తట్టుకోలేకపోయిన హీరో హోండా
భారతదేశ టూ వీలర్ మార్కెట్‌లో ఎవరూ ఊహించని ఒక భారీ మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా నంబర్ 1 పీఠం కోసం పోటీ పడుతున్న హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ సంస్థలకు షాక్ ఇస్తూ.. మన తమిళనాడుకు చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
డిసెంబర్ 2025 నెల ముగిసే సమయానికి దేశంలోనే అత్యధిక ద్విచక్ర వాహనాలను విక్రయించిన కంపెనీగా టీవీఎస్ చరిత్ర సృష్టించింది. సాధారణంగా హీరో లేదా హోండా సంస్థలు మొదటి స్థానంలో ఉండటం మనం చూస్తుంటాం, కానీ ఈసారి టీవీఎస్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో అందరినీ వెనక్కి నెట్టేసింది.

డిసెంబర్ 2025 గణాంకాల ప్రకారం.. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ అమ్మకాలు, ఎగుమతులు రెండింటినీ కలిపి మొత్తం 4,61,071 యూనిట్లను విక్రయించి మొదటి స్థానంలో నిలిచింది. టీవీఎస్ నుంచి వచ్చిన జుపిటర్ స్కూటర్లు, అపాచీ బైకులు, ఎన్‌టార్క్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది.
ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి చేయడంలో టీవీఎస్ చూపిన వేగం ఇతర కంపెనీలకు అందనంత ఎత్తులో నిలబెట్టింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే టీవీఎస్ అమ్మకాలు ఏకంగా 59 శాతం వృద్ధి చెందడం విశేషం. ఇప్పటివరకు తిరుగులేని ఛాంపియన్‌గా ఉన్న హీరో మోటోకార్ప్ ఈసారి రెండో స్థానానికి పరిమితమైంది.

హీరో మొత్తం 4,56,479 యూనిట్లను విక్రయించి టీవీఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఇక జపాన్ దిగ్గజం హోండా 4,46,048 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. కేవలం దేశీయంగా భారత్‌లో మాత్రమే అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికీ హీరో మోటోకార్ప్ నంబర్ 1 స్థానంలోనే ఉంది. కానీ ఎగుమతులను కూడా కలిపితే మాత్రం టీవీఎస్ బాస్ అనిపించుకుంది.
బజాజ్ ఆటో 3,10,353 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉండగా, సుజుకి 1,22,366 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఎగుమతుల విషయానికి వస్తే బజాజ్ ఆటో ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. మొత్తం 1,78,125 యూనిట్లను బజాజ్ విదేశాలకు పంపింది.

అయితే దేశీయంగా అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మొత్తం విక్రయాల్లో నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు జపాన్ కంపెనీ సుజుకి మాత్రం ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్‌లో మిగతా కంపెనీలన్నీ స్వల్పంగా తగ్గుదల నమోదు చేస్తే, సుజుకి మాత్రం అమ్మకాలను పెంచుకుని ముందుకు దూసుకెళ్లింది.
డిసెంబర్ నెల అనేది సాధారణంగా ఇయర్ ఎండ్ కావడంతో అమ్మకాలు స్వల్పంగా తగ్గుతాయి. నవంబర్ నెలలో ఉన్న పండగ సీజన్ జోరు డిసెంబర్‌లో ఉండదు. అయినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఈసారి టూ వీలర్ మార్కెట్ 36 శాతం వృద్ధిని కనబరిచింది.
టీవీఎస్ నంబర్ 1 స్థానానికి చేరుకోవడంతో, ఇకపై హీరో,హోండా కంపెనీలు తమ మార్కెట్‌ను తిరిగి దక్కించుకోవడానికి కొత్త ప్లాన్లు వేస్తున్నాయి. రాబోయే నెలల్లో కొత్త మోడళ్లు, భారీ డిస్కౌంట్లు, ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 2026 ప్రారంభంలో భారతీయ రోడ్లపై ఏ కంపెనీ హవా సాగుతుందో చూడటం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications








