జనాల గుండెల్లో ప్లేస్ సంపాదిస్తున్న స్కూటర్.. స్టైల్ ఉన్నోడు వస్తే మార్కెట్ షేక్ అవ్వాల్సిందే!
దేశీయ టూవీలర్ మార్కెట్‌లో కీలక స్థానాన్ని సంపాదించుకున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) నుంచి వచ్చిన టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS NTorq) యువతలో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. స్పోర్టీ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు, మంచి పనితీరు కలిపి ఈ స్కూటర్‌ను కాలేజీ విద్యార్థుల నుంచి ఆఫీస్‌కు వెళ్లే యువత వరకు అందరికీ ఇష్టమైన మోడల్‌గా మార్చాయి. నగరాల్లో వేగంగా మారుతున్న లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా, స్టైల్‌తో పాటు పనితీరును కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ స్కూటర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. మార్చి 2026లో TVS NTorq మొత్తం 32,598 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
ఇది కేవలం ఒక నెలకు సంబంధించిన గణాంకం మాత్రమే అయినప్పటికీ, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెరుగుదల గణనీయంగా ఉంది. 2025 మార్చిలో ఈ స్కూటర్ 21,948 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఈ మార్పును శాతంగా చూస్తే దాదాపు 49 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. అంటే, ఒక్క ఏడాది వ్యవధిలోనే ఈ స్కూటర్‌కు డిమాండ్ ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది.

వినియోగదారులు ఎక్కువగా స్పోర్టీ లుక్, స్మార్ట్ ఫీచర్లు, అలాగే రోజువారీ వినియోగానికి సరిపోయే పనితీరును కోరుకుంటుండటంతో TVS NTorq వంటి మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దీని ఎన్‌టార్క్ 125, ఎన్‌టార్క్ 150 మోడళ్ల గురించి చూసినట్లయితే, వీటి ధరలు దాదాపుగా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసే విధంగా అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి. ధరకు తగ్గట్టు మంచి పనితీరు, మైలేజ్ అందిస్తున్నాయి.
TVS NTorq 125 ధర పరంగా చూసుకుంటే, ఇది భారత మార్కెట్లో మంచి బ్యాలెన్స్ ఉన్న స్కూటర్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.81,250 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటుంది. అంటే బడ్జెట్‌ను దాటి పోకుండా, స్టైల్, పనితీరు రెండింటినీ ఒకేసారి కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా మారుతుంది. ఇందులో ఉన్న 124.8 సిసి పెట్రోల్ ఇంజిన్ రోజువారీ వినియోగానికి సరిపోయే పవర్‌ను అందిస్తుంది.

నగరాల్లో ట్రాఫిక్ మధ్య సులభంగా నడపడానికి అనువుగా ఉండటంతో పాటు, అవసరమైనప్పుడు చురుకైన స్పందనను కూడా ఇస్తుంది. మైలేజ్ పరంగా కూడా ఇది నిరాశపరచదు. సాధారణంగా లీటరుకు సుమారు 47 కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యం అందించడం వల్ల, రోజూ ప్రయాణించే వారికి ఖర్చు పరంగా కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ఫీచర్ల విషయానికి వస్తే, TVS NTorq 125 తన సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది.
దీనిలో అందించిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా స్పీడ్, ట్రిప్ డేటా వంటి వివరాలను స్పష్టంగా చూడవచ్చు. అదనంగా USB ఛార్జింగ్ పోర్ట్ ఉండటం వల్ల మొబైల్ ఫోన్ వంటి పరికరాలను ప్రయాణంలోనే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి చిన్న ఫీచర్లే అయినా, రోజువారీ వినియోగంలో చాలా ఉపయోగపడతాయి. ఎన్‌టార్క్ 150 బేస్ వేరియంట్ ధర రూ. 1,19,000 (ఎక్స్‌షోరూమ్), అధునాతన TFT వేరియంట్ ధర రూ. 1,29,000(ఎక్స్‌షోరూమ్)గా ఉంది.

ఎన్‌టార్క్ 150లో 149.7సీసీ సామర్థ్యం కలిగిన ఎయిర్-కూల్డ్ O3CTech ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 7,000 ఆర్‌పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్‌ను, 5,500 ఆర్‌పీఎం వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో హై-రిజల్యూషన్ TFT క్లస్టర్‌తో పాటు TVS SmartXonnect టెక్నాలజీని అందించారు. ఇవే కాకుండా డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications