ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ.. రెండూ యువత మెచ్చే స్కూటర్లే.. మరి ఏది కొనాలంటే ?
భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ప్రస్తుతం ఒక కీలక దశలో ఉంది. ప్రధాన దిగ్గజాలైన టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో తమ ఉనికి మరింత పటిష్టం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ రెండు కంపెనీలు తమ అత్యంత సరసమైన మోడళ్లను రంగంలోకి దించాయి. టీవీఎస్ నుంచి ఆర్బిటర్ (TVS Orbiter), బజాజ్ నుంచి చేతక్ సీ2501 (Bajaj Chetak C2501) మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ రెండు ఈవీ స్కూటర్లలో ఏది కొనడం లాభదాయకం? ఏది మీ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
మొదటగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే.. టీవీఎస్ ఆర్బిటర్, బజాజ్ చేతక్ సీ2501 రెండు వేర్వేరు ధోరణులను కలిగి ఉన్నాయి. టీవీఎస్ ఆర్బిటర్ చాలా సింపుల్‌గా, నిరాడంబరంగా, రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది ట్రెడిషనల్ లుక్‌తో పాటు ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ మరియు విశాలమైన సీటును కలిగి ఉంటుంది. రద్దీగా ఉండే నగర వీధుల్లో సులభంగా ప్రయాణించేలా దీని నిర్మాణం ఉంది.

మరోవైపు, బజాజ్ చేతక్ సీ2501 తన పాత వైభవాన్ని గుర్తు చేస్తూ నియో-రెట్రో డిజైన్‌తో వస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ విభాగంలో మెటల్ బాడీతో వచ్చే ఏకైక స్కూటర్ ఇది. ప్రీమియం లుక్, దృఢత్వం కావాలనుకునే వారు చేతక్ వైపు మొగ్గు చూపుతారు. టీవీఎస్ ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యత ఇస్తే, బజాజ్ స్టైల్, మన్నికకు పెద్దపీట వేసింది.
టెక్నికల్ స్పెసిఫికేషన్స్, పనితీరు విషయానికి వస్తే.. టీవీఎస్ ఆర్బిటర్ కాస్త పైచేయి సాధించిందని చెప్పవచ్చు. టీవీఎస్ ఆర్బిటర్‌లో 3.1 kWh సామర్థ్యం గల బ్యాటరీ ఉండగా, ఇది ఏకంగా 158 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను ఇస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలా దూరం నిశ్చింతగా వెళ్ళవచ్చు. దీనికి విరుద్ధంగా బజాజ్ చేతక్ సీ2501లో 2.5 kWh బ్యాటరీ మాత్రమే ఉంటుంది, ఇది కేవలం 113 కిలోమీటర్ల రేంజ్‌ను మాత్రమే ఇస్తుంది.

రేంజ్ పరంగా టీవీఎస్ కంటే బజాజ్ వెనుకబడి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే టాప్ స్పీడ్ విషయంలో కూడా టీవీఎస్ ఆర్బిటర్ గంటకు 68 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు, అదే బజాజ్ చేతక్ కేవలం 60 కిలోమీటర్ల వేగానికి పరిమితం అయ్యింది. అయితే బ్యాటరీ ప్యాక్ చిన్నది కావడం వల్ల బజాజ్ చేతక్ చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. కేవలం 2 గంటల 25 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది, అదే స్థాయికి టీవీఎస్ ఆర్బిటర్‌కు 4 గంటల పైన సమయం పడుతుంది.
డైమెన్షన్స్, సౌకర్యాల పరంగా చూస్తే.. టీవీఎస్ ఆర్బిటర్ ఒక అడుగు ముందుంది. ఇందులో 34 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. కూరగాయలు లేదా హెల్మెట్ పెట్టుకోవడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బజాజ్ చేతక్‌లో ఇది కేవలం 25 లీటర్లు మాత్రమే. కానీ గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో బజాజ్ చేతక్ 170 మిమీతో టీవీఎస్ (165 మిమీ) కంటే కొంచెం మెరుగ్గా ఉంది. ఎగుడుదిగుడు రోడ్లపై బజాజ్ చేతక్ ప్రయాణం కాస్త సాఫీగా ఉండే అవకాశం ఉంది.
సీటు ఎత్తు రెండు స్కూటర్లలోనూ 763 మిమీగా ఉంది, కాబట్టి తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా రెండింటినీ సులభంగా నడపవచ్చు. బరువు పరంగా బజాజ్ చేతక్ (107 కేజీలు) టీవీఎస్ ఆర్బిటర్ కంటే ఐదు కిలోలు తక్కువగా ఉంటుంది, దీనివల్ల వాహనాన్ని హ్యాండిల్ చేయడం సులభం అవుతుంది.

సేఫ్టీ, ఫీచర్ల విషయంలో రెండు కంపెనీలు ఏమాత్రం తగ్గలేదు. టీవీఎస్ ఆర్బిటర్‌లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. 5-అంగుళాల కలర్ ఎల్‌సీడీ డిస్ప్లే రైడర్‌కు కావాల్సిన సమాచారాన్ని స్పష్టంగా అందిస్తుంది.
బజాజ్ చేతక్ సీ2501 కూడా ఎల్‌ఈడీ సెటప్, రివర్స్ మోడ్, మ్యూజిక్ కంట్రోల్స్, గైడ్ మీ హోమ్ లైట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ కోసం రెండింటిలోనూ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ఐపీ67 రేటెడ్ బ్యాటరీలు ఉన్నాయి. దీనివల్ల వానాకాలంలో నీటిలో వెళ్లినా లేదా ధూళి వల్ల గానీ బ్యాటరీకి ఎటువంటి నష్టం వాటిల్లదు. రెండు సంస్థలు కూడా 3 ఏళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల వారంటీని అందిస్తున్నాయి.
చివరగా ధర విషయానికి వస్తే, బజాజ్ చేతక్ సీ2501 ధర రూ.87,100 (ఎక్స్-షోరూమ్) కాగా, టీవీఎస్ ఆర్బిటర్ ధర రూ.99,900గా ఉంది. అంటే బజాజ్ స్కూటర్ దాదాపు 12 వేల రూపాయల వరకు తక్కువ ధరకే లభిస్తోంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం మెటల్ బాడీ ఉన్న స్కూటర్ కావాలనుకుంటే బజాజ్ చేతక్ సరైన ఎంపిక.
కానీ, మీరు అదనపు డబ్బు వెచ్చించి ఎక్కువ రేంజ్ (158 కిమీ), ఎక్కువ స్టోరేజ్ స్పేస్, మెరుగైన వేగాన్ని కోరుకుంటే టీవీఎస్ ఆర్బిటర్ మీకు బెస్ట్ డీల్ అవుతుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వారికి టీవీఎస్ ఆర్బిటర్ లాభదాయకం. కేవలం సిటీ లోపల తక్కువ దూరాలు తిరిగే వారికి, స్టైల్, దృఢత్వం ముఖ్యమని భావించే వారికి బజాజ్ చేతక్ మేలైనది.


Click it and Unblock the Notifications








