ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రతి నాలుగింటిలో ఒకటి ఈ బ్రాండ్‌దే!
భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఒకప్పుడు ఓలా పేరు మారుమోగేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడితే చాలామందికి ముందుగా గుర్తుకు వస్తున్న పేరు టీవీఎస్ మోటార్ (Tvs Motor). కంపెనీ తీసుకొచ్చిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో భారీ ఆదరణ పొందడంతో, టీవీఎస్ ఈవీ విభాగంలో అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2026 మే నెలలో టీవీఎస్ మోటార్ దేశవ్యాప్తంగా 42,415 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ అమ్మకాలతో భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అత్యధిక విక్రయాలు నమోదు చేసిన కంపెనీగా నిలిచింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.
2025 మే నెలలో టీవీఎస్ 25,804 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగా, ఈ ఏడాది మేలో ఆ సంఖ్య 42,415 యూనిట్లకు చేరుకుంది. అంటే ఏడాది వ్యవధిలోనే సుమారు 64 శాతం వృద్ధిని సాధించింది. ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం ఐక్యూబ్ (iqube) ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్. ఇది ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఆకర్షణీయమైన డిజైన్, మంచి రేంజ్‌తో ఆకట్టుకుంటుంది.

ఫలితంగా టీవీఎస్ మోటార్ గతంలో ఈ విభాగాన్ని శాసించిన పలు కంపెనీలను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు భారత మార్కెట్ వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో, టీవీఎస్ సాధించిన ఈ విజయం కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న జోరు చూస్తుంటే, రాబోయే నెలల్లో కూడా టీవీఎస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
టీవీఎస్ కేవలం అమ్మకాలలోనే కాదు, మార్కెట్ వాటాలో కూడా తన ఆధిపత్యాన్ని చాటుతోంది. 2026 మే నెలలో 42,415 ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలతో కంపెనీ భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో సుమారు 25 శాతం వాటాను కైవసం చేసుకుంది. అంటే దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో ఒకటి టీవీఎస్ బ్రాండ్‌కు చెందినదే. ముఖ్యంగా ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరుగుతున్న ఆదరణ కంపెనీ వృద్ధికి ప్రధాన కారణం.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, 2026 మార్చి నెల తర్వాత టీవీఎస్‌కు ఇది రెండవ అత్యుత్తమ నెలగా నిలిచింది. ఈ ఏడాది మార్చిలో కంపెనీ ఏకంగా 51,593 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మే నెలలో 42,415 యూనిట్ల విక్రయాలతో మరోసారి మార్కెట్లో తన బలమైన ఉనికిని చాటుకుంది. పోటీ పెరుగుతున్నప్పటికీ, టీవీఎస్ స్థిరంగా వృద్ధిని నమోదు చేస్తూ ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది.
టీవీఎస్ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు ప్రధాన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో ఐక్యూబ్ (iQube) కంపెనీకి అత్యధిక అమ్మకాలు తెచ్చిపెడుతున్న మోడల్‌గా నిలవగా, తర్వాతి స్థానంలో ఆర్బిటర్ (Orbiter) ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఈ రెండు మోడళ్లలో ఆర్బిటర్ ధర పరంగా మరింత అందుబాటులో ఉండగా, ఐక్యూబ్ మాత్రం వినియోగదారుల తొలి ఎంపికగా కొనసాగుతోంది. వాస్తవానికి ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి.

మరోవైపు, ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ BaaS(Battery as a Service) ప్లాన్‌ను అందిస్తోంది. ఈ పథకం కింద రూ.50,000 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో సొంతం చేసుకునే అవకాశం పొందుతున్నారు. అయితే ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువ మంది కొనుగోలుదారులు ఇప్పటికీ ఐక్యూబ్ వైపే మొగ్గు చూపుతున్నారు. మెరుగైన బ్రాండ్ గుర్తింపు, ఇప్పటికే నిరూపితమైన పనితీరు, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్, వినియోగదారుల విశ్వాసం ఐక్యూబ్ అమ్మకాలను మరింత బలోపేతం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications