ఆఫీస్ నుంచి షాపింగ్ వరకూ.. మహిళలకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే స్కూటర్లు.. రోజువారీ అవసరాలకు బెస్ట్!
ఒకప్పుడు గేర్‌లెస్ స్కూటర్లు అంటే మహిళల కోసమే అనే భావన భారతదేశంలో బలంగా ఉండేది. బైక్‌లు పురుషులకే, స్కూటర్లు మహిళలకే అన్నట్లు ఒక గీత వేసుకున్న పరిస్థితి అది. కానీ కాలం మారింది. టెక్నాలజీ అభివృద్ధి, డిజైన్‌లో వచ్చిన మార్పులు, మెరుగైన పనితీరు కారణంగా ఆ ఆలోచనను భారతీయులు పూర్తిగా తోసిపుచ్చారు. ఇప్పుడు పురుషులు కూడా గేర్‌లెస్ స్కూటర్లను విరివిగా వాడుతున్నారు. నగరాల్లో అయితే బైక్‌లకు బదులు స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యం పెరుగుతోంది. అయితే, ఈ మార్పులన్నింటిలో గేర్‌లెస్ స్కూటర్లు మహిళలకు మాత్రం నిజంగా ఒక పెద్ద వరంగా మారాయి. తేలికపాటి బరువు, సులభమైన హ్యాండ్లింగ్, క్లచ్-గేర్ టెన్షన్ లేకపోవడం వంటివి మహిళలకు ఎంతో అనుకూలంగా మారాయి.
పనికి వెళ్లాలన్నా, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లాలన్నా, మార్కెట్ లేదా షాపింగ్‌కి వెళ్లాలన్నా ఇంట్లోని పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా ప్రయాణించే అవకాశం ఇప్పుడు చాలా మంది మహిళలకు లభిస్తోంది. ఈ నేపథ్యంలో, తమ అవసరాలకు సరిపోయే సౌకర్యవంతమైన, నమ్మకమైన, మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ ఏది? అనే ప్రశ్న చాలా మంది మహిళలను గందరగోళంలో పడేస్తోంది. అందుకోసమే మహిళలకు బాగా సరిపోయే స్కూటర్లను ఈ కథనంలో ఇస్తున్నాము.

Honda Activa: మహిళలకు సరిపోయే బెస్ట్ స్కూటర్ల జాబితా చెప్పాలంటే, హోండా యాక్టివా పేరు లేకుండా అది మొదలవదు, ముగియదు అన్నట్టే పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా భారత మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాక్టివా, నమ్మకం, సౌకర్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అందులోనూ యాక్టివా 125cc మోడల్ మహిళలకు ప్రత్యేకంగా సరిపడే స్కూటర్‌గా గుర్తింపు పొందింది. సస్పెన్షన్ విషయంలో కూడా యాక్టివా 125 మంచి బ్యాలెన్స్‌ను అందిస్తుంది
ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ రైడింగ్ భంగిమ. దీని వల్ల రైడర్ చేతులు, భుజాలు, వెన్నెముకపై ఎక్కువ ఒత్తిడి పడదు. రోజూ ఆఫీస్‌కు, మార్కెట్‌కు లేదా పిల్లల పనుల కోసం తిరగాల్సిన మహిళలకు ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది. దూర ప్రయాణాల్లో కూడా అలసట తక్కువగా అనిపించేలా యాక్టివాను హోండా డిజైన్ చేసింది. హోండా యాక్టివా 125 ప్రస్తుతం రూ. 89,652 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది.

Suzuki Access: సుజుకి యాక్సెస్ 125 గేర్‌లెస్ స్కూటర్ సెగ్మెంట్‌లో అందరికీ సరిపోయే మోడల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా విశాలమైన సీటు, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, రిలాక్స్‌డ్ హ్యాండిల్‌బార్ పొజిషనింగ్ వల్ల మహిళలకు ఇది మరింత సౌకర్యవంతమైన స్కూటర్‌గా నిలుస్తోంది. రోజువారీ ప్రయాణాల్లో సౌకర్యం ఎంత ముఖ్యమో దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ డిజైన్, పొడవైన రైడ్స్‌లో కూడా అలసటను తగ్గిస్తుంది.
రైడ్ క్వాలిటీ విషయానికి వస్తే, యాక్సెస్ 125లోని సస్పెన్షన్ సెటప్ భారతీయ రోడ్లకు బాగా సరిపోతుంది. గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఎదురైనా స్కూటర్ స్టేబుల్‌గా ఉండటం వల్ల కొత్తగా స్కూటర్ నడపే మహిళలకు కూడా భయం లేకుండా ప్రయాణించవచ్చు. ధర విషయానికి వస్తే, సుజుకి యాక్సెస్ 125 రూ. 77,684 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. మహిళలకు మాత్రమే కాదు కుటుంబమంతా ఉపయోగించుకునే ఉత్తమ గేర్‌లెస్ స్కూటర్‌గా యాక్సెస్ 125 నిలుస్తోంది.

TVS Jupiter 125: టీవీఎస్ జూపిటర్ 125 విడుదలైనప్పటి నుంచే మహిళల్లో ఆదరణ పొందుతోంది. కారణం స్పష్టమే డిజైన్ నుంచి రైడింగ్ అనుభవం వరకు ప్రతిదీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం. ఈ స్కూటర్‌లోని నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ వల్ల వెన్ను, భుజాలపై ఒత్తిడి తగ్గుతుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లడం, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం లేదా మార్కెట్ పనుల కోసం తిరగడం వంటి సందర్భాల్లో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగపడే మరో ముఖ్యమైన అంశం తక్కువ స్టెప్-త్రూ డిజైన్. దీని వల్ల స్కూటర్‌పై ఎక్కడం, దిగడం చాలా సులభంగా మారుతుంది. సాంప్రదాయ దుస్తులు ధరించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూటర్‌ను వాడుకునేలా జూపిటర్ 125 డిజైన్ చేయబడింది. ఈ అన్ని ఫీచర్లతో పాటు, ధర పరంగా కూడా టీవీఎస్ జూపిటర్ 125 ఆకర్షణీయంగా ఉంది. ఈ స్కూటర్ ధరలు రూ. 75,600 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.
Yamaha Fascino 125: యమహా ఫాసినో 125 ఆధునిక డిజైన్‌తో పాటు మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన స్కూటర్‌గా మంచి పేరు సంపాదించింది. ధర విషయానికి వస్తే, యమహా ఫాసినో 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 74,910 నుండి ప్రారంభమవుతుంది. అద్భుతమైన సస్పెన్షన్ సెటప్, విశాలమైన సీటు, అలాగే సమతుల్య బరువు పంపిణీ వల్ల స్కూటర్‌ను హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








