600 రూపాయల కోసం యమహా ఇంత ప్లాన్ వేసిందా? మరి ఫాసినోను మాత్రం ఎందుకు వదిలేశారు?
భారత టూవీలర్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమహా కంపెనీ, ఏప్రిల్ 2026 నుంచి తన స్కూటర్ల ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. యువతను విపరీతంగా ఆకర్షించే రే జెడ్ఆర్ 125 (RayZR 125), పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఏరోక్స్ 155 (Aerox 155) మోడళ్ల ధరలను కంపెనీ పెంచింది. సాధారణంగా ఏటా చేసే ధరల సవరణలో భాగంగానే ఈ పెంపు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ధరల పెంపు కస్టమర్లపై పెద్దగా భారం పడకుండా స్వల్పంగానే ఉండటం గమనార్హం.
యమహా రే జెడ్ఆర్ 125
యమహా రే జెడ్ఆర్ 125 సిరీస్‌లోని అన్ని వేరియంట్లపై దాదాపు 660 రూపాయల ధర పెరిగింది. ఇందులో డ్రమ్, డిస్క్, డిస్క్ డీలక్స్, స్ట్రీట్ ర్యాలీ మోడల్స్ ఉన్నాయి. ఈ పెంపుతో రేజెడ్ఆర్ 125 హైబ్రిడ్ మోడల్ ధర ఇప్పుడు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 74,960 నుంచి రూ. 82,460 వరకు పలుకుతోంది. ఇక స్ట్రీట్ ర్యాలీ మోడల్ కావాలనుకుంటే రూ. 87,560 చెల్లించాల్సి ఉంటుంది. ధర పెరిగినప్పటికీ స్కూటర్ డిజైన్ లేదా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. అదే 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్, హైబ్రిడ్ సిస్టమ్ పవర్ అసిస్ట్‌తో ఇది కస్టమర్లను పలకరించనుంది.

ఏరోక్స్ 155 ధర
ప్రీమియం పెర్ఫార్మెన్స్ స్కూటర్ విభాగంలో రారాజుగా వెలుగుతున్న ఏరోక్స్ 155 ధర కూడా పెరిగింది. స్టాండర్డ్, వెర్షన్ ఎస్ (Version S) మోడళ్లపై సుమారు 620 రూపాయలు పెంచారు. తాజా పెంపుతో ఏరోక్స్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.1,40,320 కాగా, వెర్షన్ ఎస్ ధర రూ.1,43,320 (ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది. స్పోర్ట్స్ బైక్ లాంటి ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో ఉండే ఈ స్కూటర్ ధర పెరిగినా సేల్స్‌పై పెద్దగా ప్రభావం ఉండదని కంపెనీ ధీమాగా ఉంది.
ఫాసినోను ఎందుకు వదిలేశారు?
అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. యమహా తన పాపులర్ మోడల్ ఫాసినో 125 (Fascino 125) ధరను మాత్రం పెంచలేదు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫాసినోలో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురావడానికి యమహా సిద్ధమైంది. ఇప్పటికే కొత్త ఫాసినో మోడళ్లు డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించాయి. త్వరలోనే ఈ కొత్త వెర్షన్ లాంచ్ కాబోతున్నందున, పాత మోడల్ ధరను పెంచి కస్టమర్లను దూరం చేసుకోవడం ఇష్టం లేక కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త ఫాసినోలో ఏముండబోతోంది?
రాబోయే కొత్త ఫాసినోలో ప్రధానంగా కాస్మెటిక్ మార్పులు ఉండబోతున్నాయి. కొత్త లైటింగ్ సెటప్, బాడీ పానెల్స్‌పై ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, కొత్త రంగులు ఈ స్కూటర్ కి మరింత క్లాసీ లుక్ ఇవ్వనున్నాయి. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాసినో ధర రూ. 74,910 నుంచి రూ. 95,200 వరకు ఉంది. కొత్త మోడల్ వచ్చాక దీని ధర కొంచెం పెరిగే అవకాశం ఉంది. రెట్రో స్టైల్ ప్లస్ మోడ్రన్ టెక్నాలజీతో ఫాసినో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications








