యమహా R2 డెలివరీలు మొదలయ్యాయి! ఈ 3 వేరియంట్లలో ఏది బెస్ట్? ధర, EMI వివరాలు ఇవే!
యమహా లవర్స్‌కు గుడ్‌న్యూస్! కొత్త యమహా R2 (200cc) బైక్ డెలివరీలు సెప్టెంబర్ 26, 2026 నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. గత వారమే ఈ బైక్స్ యమహా 'బ్లూ స్క్వేర్' షోరూమ్‌లకు చేరుకోవడంతో డెలివరీల హడావుడి మొదలైంది. ప్రస్తుతం ఈ బైక్ బేస్, క్విక్‌షిఫ్టర్, R2 M అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరి ఈ బైక్‌లో ఉన్న కొత్త ఫీచర్లు ఏంటి? ధర ఎంత? హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో ఈఎమ్‌ఐ (EMI) ఆప్షన్లు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు చూద్దాం.
యమహా ఈ బైక్‌ను మొత్తం మూడు వేరియంట్లలో, ఐదు ఆకర్షణీయమైన కలర్స్‌లో తీసుకొచ్చింది. అందుబాటు ధరలో బేస్ వేరియంట్ రాగా, మిడ్ వేరియంట్‌లో బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో పాటు ప్రత్యేకమైన కలర్స్ ఉంటాయి. ఇక టాప్ ఎండ్ R2 M మోడల్‌లో స్మార్ట్ కీ, అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. వీటి ఎక్స్‌షోరూమ్ ధరలు వరుసగా రూ. 2.30 లక్షలు, రూ. 2.39 లక్షలు, రూ. 2.53 లక్షలుగా ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి కలర్ ఆప్షన్లు మారుతుండటంతో, మీరు ఎంచుకునే కలర్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ ఆధారపడి ఉంటుంది.

యమహా R2 డెలివరీలు.. షోరూమ్ టైమ్‌లైన్స్ ఇవే!
సెప్టెంబర్ 2026 మూడో వారంలోనే షోరూమ్‌లకు బైక్‌లు చేరుకుంటాయని యమహా ముందే ప్రకటించింది. చెప్పినట్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లలో సందడి కనిపిస్తోంది. అయితే, తొలి బ్యాచ్‌లో పరిమిత సంఖ్యలోనే బైక్‌లను విడుదల చేశారు. అందుకే మీరు ఎంచుకునే కలర్, వేరియంట్‌పైనే డెలివరీ సమయం ఆధారపడి ఉంటుంది. బేస్ వేరియంట్ స్టాక్ ఎక్కువగా అందుబాటులో ఉన్నందున త్వరగా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. కానీ, ‘మెటాలిక్ గ్రే R2 M’ మోడల్‌కి ఎక్కువ డిమాండ్ ఉండటంతో వెయిటింగ్ పీరియడ్ కాస్త ఎక్కువగానే ఉంది.
హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో యమహా R2 ఆన్‌రోడ్ ధరలు.. EMI వివరాలు
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో యమహా R2 ఆన్‌రోడ్ ధరలు, ఈఎమ్‌ఐ వివరాలు ఇక్కడ చూద్దాం. (బైక్‌వే లెక్కల ప్రకారం.. సుమారు 10 శాతం వడ్డీ రేటుతో, తక్కువ డౌన్‌పేమెంట్‌తో 36 నెలల కాలవ్యవధికి ఈ అంచనాలు రూపొందించబడ్డాయి). షోరూమ్‌లో సరైన ఫైనాన్స్, ఇన్సూరెన్స్ డీల్ ఎంచుకోవడానికి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.
| నగరం | ఆన్‌రోడ్ ధర (స్టాండర్డ్) | ఈఎమ్‌ఐ (36 నెలలకు) |
|---|---|---|
| హైదరాబాద్ | ₹2,86,153 | ₹9,817/నెలకు |
| విశాఖపట్నం | ₹2,76,150 | ₹9,473/నెలకు |
| విజయవాడ | ₹2,76,150 | ₹9,473/నెలకు |
మోడల్ అప్‌గ్రేడ్ లెక్కలు చాలా సింపుల్! క్విక్‌షిఫ్టర్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర బేస్ మోడల్ కంటే రూ. 9,500 మాత్రమే ఎక్కువ. దీనివల్ల నెలవారీ ఈఎమ్‌ఐలో కేవలం కొన్ని వందల రూపాయల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. ఇక R2 M మోడల్ ధర కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, రైడింగ్ ప్రియులకు మెరుగైన హార్డ్‌వేర్ ఫీచర్లను అందిస్తుంది. కాబట్టి బుకింగ్ చేసుకునే ముందు స్థానిక పన్నులు, ఇన్సూరెన్స్ ఛార్జీలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది.
పోటీదారులతో పోలిస్తే యమహా R2 ఎలా ఉందంటే.. (KTM RC 200, జిక్సర్ SF 250, పల్సర్ RS200)
కొత్త యమహా R2లోని 204cc ఇంజిన్.. ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ మోడ్స్ వంటి ఆధునిక ఫీచర్లతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది 26.5 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తూ కేటీఎమ్ RC 200 (24.6 bhp) కంటే మెరుగ్గా నిలుస్తుంది. సుజుకి జిక్సర్ SF 250 కూడా ఇదే స్థాయి పవర్, ఎక్కువ టార్క్‌ను తక్కువ ధరకే అందిస్తుండగా.. తక్కువ బడ్జెట్‌లో బైక్ కావాలనుకునే వారికి పల్సర్ RS200 ఇప్పటికీ బెస్ట్ ఆప్షన్‌గా ఉంది.
బుకింగ్స్, ఫైనాన్స్, యాక్సెసరీస్, వారంటీ వివరాలు
యమహా R2 పూర్తీగా రీఫండబుల్ అయ్యే రూ. 10,000 టోకెన్ అమౌంట్‌తో ప్రి-బుకింగ్స్ ప్రారంభించింది. అయితే కంపెనీ ఎలాంటి ఆరంభ డిస్కౌంట్లను ప్రకటించలేదు. బేస్ వేరియంట్ కొనేవారు క్విక్‌షిఫ్టర్‌ను విడిగా యాక్సెసరీగా కూడా ఫిట్ చేయించుకోవచ్చు. దీనివల్ల నచ్చిన కలర్ మిస్ కాకుండా క్విక్‌షిఫ్టర్ సదుపాయం పొందే వెసులుబాటు ఉంటుంది. ఇక మొదటి సంవత్సరంలో జీరో-డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే దీర్ఘకాలిక భద్రత కోసం యమహా అందిస్తున్న '10-ఏళ్ల టోటల్ వారంటీ' ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
మీరు నగరంలో ప్రతిరోజూ ప్రయాణించే వారైతే బేస్ వేరియంట్ సరిపోతుంది, దీనివల్ల ఈఎమ్‌ఐ భారం కూడా ఉండదు. వీకెండ్స్‌లో సరదాగా లాంగ్ రైడ్స్ వెళ్లేవారు స్మూత్ గేర్ షిఫ్టింగ్ కోసం క్విక్‌షిఫ్టర్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. ఇక ట్రాక్ రైడింగ్‌ను ఇష్టపడే వారికి R2 M మోడల్ పర్ఫెక్ట్ చాయిస్. మీకు నచ్చిన కలర్ బైక్ త్వరగా పొందడానికి ముందే బుక్ చేసుకోండి. షోరూమ్‌లలో అనవసరమైన హిడెన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ యాడ్-ఆన్స్ పడకుండా ఈఎమ్‌ఐ కోట్‌ను స్పష్టంగా చూసుకోవడం మర్చిపోకండి.


Click it and Unblock the Notifications
