లీటరుకు 71.33 కి.మీ మైలేజ్ ఇచ్చే స్కూటర్.. కేవలం రూ.77 వేలకే దొరుకుతోంది!
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ (Yamaha Motor Company) భారతదేశంలోని స్కూటర్ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే మార్కెట్‌ను బలంగా పట్టుకున్న కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ, యమహా తన వ్యూహాలను క్రమంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన స్కూటర్లను ప్రవేశపెట్టి, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సౌకర్యం, సింపుల్ డిజైన్ కోరుకునే వారికి Yamaha Fascino 125 ను అందించగా, యువతకు స్పోర్టీ లుక్, స్టైలిష్ డిజైన్ కావాలనుకునే వారికి Yamaha Ray ZR 125 ను రూపొందించింది.
ఈ రెండు మోడళ్లు కూడా తమ సెగ్మెంట్‌లో మంచి స్పందనను పొందుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చలో నిలుస్తోంది మాత్రం యమహా రే జెడ్‌ఆర్(Yamaha Ray ZR) 125. ఈ స్కూటర్ తన నిశ్శబ్దమైన ఇంజిన్, మంచి మైలేజ్, యూత్‌ను ఆకట్టుకునే ఆకర్షణీయమైన డిజైన్‌తో మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సిటీ రైడింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ మోడల్, రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడంలో మంచి పనితీరు చూపిస్తోంది.

అందుకే యువతలో దీని మీద ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. దీని ప్రభావం అమ్మకాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 2026 మార్చి నెలలో యమహా రే జెడ్‌ఆర్ 125 యమహా అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఆ నెలలో మొత్తం 25,798 యూనిట్లు అమ్ముడవడం విశేషం. గత సంవత్సరం ఇదే కాలంలో, అంటే 2025 మార్చిలో, ఈ స్కూటర్‌కు చెందిన 14,510 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి.
ఈ సంఖ్యల మధ్య తేడా చూస్తే, ఒక్క ఏడాదిలోనే 77.79 శాతం భారీ వృద్ధి నమోదు కావడం గమనార్హం. అంటే అదనంగా 11,288 యూనిట్లను విక్రయించడం ద్వారా యమహా గణనీయమైన పురోగతిని సాధించింది. ఇటీవల కంపెనీ తన ప్రసిద్ధ స్కూటర్ జెడ్‌ఆర్ 125 ధరను స్వల్పంగా పెంచినప్పటికీ, అది అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపేలా కనిపించడం లేదు. సాధారణంగా ధర పెంపు అంటే వినియోగదారుల్లో కొంత వెనుకంజ కనిపిస్తుంటుంది.

కానీ ఈ సందర్భంలో మాత్రం యమహా చాలా సమతుల్యంగా నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల జేబుకు ఎక్కువ భారం కాకుండా, సుమారు రూ.660 వరకు మాత్రమే పెంపు చేయడం వల్ల, ఈ మార్పు పెద్దగా గమనించబడే స్థాయిలో లేదు. ఈ ధర సవరణ అన్ని వేరియంట్లపైనా వర్తించింది. స్టాండర్డ్ మోడల్‌లోని డ్రమ్, డిస్క్, డిస్క్ డీలక్స్ వేరియంట్లతో పాటు స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్‌కూ ఇదే పెంపు అమలులోకి వచ్చింది.
దీంతో ప్రస్తుతం జెడ్‌ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ మోడల్ ధర రూ.77,360 నుంచి రూ.83,860 వరకు ఉండగా, స్ట్రీట్ ర్యాలీ వెర్షన్ కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.87,560గా నిర్ణయించబడింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ధర పెరిగినప్పటికీ స్కూటర్‌లో ఎలాంటి డిజైన్ మార్పులు లేదా ఫీచర్ అప్‌డేట్స్ చేయలేదు. మెకానికల్ అంశాల్లో కూడా మార్పులు లేవు. అంటే వినియోగదారులు ఇప్పటి వరకు ఇష్టపడిన అదే ప్యాకేజ్‌ను, స్వల్ప ధర పెంపుతోనే పొందుతున్నారు.
ఇంజిన్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ 125cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉండటం ప్రత్యేకత. CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేసిన ఈ ఇంజన్ గరిష్టంగా 8 bhp పవర్, 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పనితీరు పరంగా సిటీ రైడింగ్‌కు సరిపడే శక్తిని అందిస్తుంది. ఇది ARAI క్లెయిమ్ చేసిన 71.33 kmpl మైలేజ్ పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కంపెనీ తన హైబ్రిడ్ స్కూటర్ Yamaha Ray ZR 125పై వినియోగదారులకు పెద్ద భరోసా ఇస్తోంది. ఈ మోడల్‌పై మొత్తం 10 సంవత్సరాల వారంటీ అందించడం ద్వారా, దీర్ఘకాలిక నమ్మకాన్ని కంపెనీ స్పష్టంగా చూపిస్తోంది. ఈ వారంటీలో మొదటిగా 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ ఇవ్వబడుతుంది. దీనికి తోడు, అదనంగా 8 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీను కూడా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








