స్కూటర్లలో కీలక సమస్య.. వెంటనే సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలని కంపెనీ విజ్ఞప్తి
ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన యమహా(yamaha)కు భారతదేశంలో కూడా భారీ అభిమాన గణం ఉంది. నాణ్యత, పనితీరు, ముఖ్యంగా కస్టమర్ భద్రత విషయంలో యమహా ఎప్పుడూ రాజీ పడదు. ఈ నిబద్ధతలో భాగంగానే, తాజాగా కంపెనీ ఒక కీలకమైన, బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (IYM) అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మే 2, 2024 నుంచి సెప్టెంబర్ 3, 2025 మధ్య తయారు చేసిన 125-సిసి స్కూటర్ మోడళ్లలో మొత్తం 3,06,635 యూనిట్లకు స్వచ్ఛంద రీకాల్ ప్రచారం ప్రారంభించింది. ఈ రీకాల్ తక్షణమే అమలులోకి వస్తుందని యమహా స్పష్టం చేసింది. కంపెనీకి కస్టమర్ల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని మరోసారి ఈ నిర్ణయం ద్వారా నిరూపించింది.
యమహా వివరాల ప్రకారం, Ray ZR 125 FI Hybrid, Fascino 125 FI Hybrid స్కూటర్ మోడళ్లలోని కొన్ని ఎంపిక చేసిన యూనిట్లలో, ప్రత్యేకమైన ఆపరేటింగ్ పరిస్థితుల్లో ఫ్రంట్ బ్రేక్ కాలిపర్ సరిగా పనిచేయకపోవడం అనే సమస్య తలెత్తే అవకాశం ఉందని గుర్తించింది. ఈ లోపంతో భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, ముందస్తు జాగ్రత్త చర్యగా సంబంధిత సంవత్సరాల్లో తయారైన స్కూటర్లను తిరిగి పరిశీలించేందుకు రీకాల్ చేపట్టింది.

ఈ స్వచ్ఛంద రీకాల్ ప్రచార పరిధిలోకి వచ్చే Yamaha Ray ZR 125 FI Hybrid, Fascino 125 FI Hybrid స్కూటర్లన్నింటికీ సంబంధించిన సమస్యాత్మక భాగాన్ని పూర్తిగా ఉచితంగా భర్తీ చేయనున్నట్లు యమహా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో కస్టమర్ల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయబోమని, లోపభూయిష్టంగా గుర్తించిన ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌కు సంబంధించిన భాగాలను ఎలాంటి ఖర్చు లేకుండా మార్చి ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
రీకాల్‌కు మీ స్కూటర్ అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకునే కస్టమర్లు, ఇండియా యమహా మోటార్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వెబ్‌సైట్‌లోని Service Sectionకు వెళ్లి, అక్కడ Voluntary Recall Campaign అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం Scooter 125 విభాగాన్ని ఎంచుకుని, మీ వాహనం చాసిస్ నంబర్‌ను నమోదు చేస్తే, మీ స్కూటర్ ఈ రీకాల్ ప్రచార పరిధిలోకి వస్తుందో లేదో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.

అదనంగా, ఈ రీకాల్ ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం లేదా సహాయం అవసరమైన కస్టమర్లు తమకు సమీపంలోని అధీకృత యమహా షోరూమ్‌ను ప్రత్యక్షంగా సందర్శించవచ్చు. అలాగే, ఏవైనా సందేహాలు ఉన్నా వెంటనే పరిష్కారం కోసం ఇండియా యమహా మోటార్ టోల్-ఫ్రీ కస్టమర్ కేర్ నంబర్ 1800-420-1600 ను సంప్రదించే అవకాశం కూడా కల్పించింది. ఇంకా కస్టమర్లు [email protected] అనే అధికారిక ఇమెయిల్ ఐడీకి మెయిల్ పంపి తమ సమస్యలను తెలియజేయవచ్చు.
ఈ విధంగా, కస్టమర్ భద్రత, సంతృప్తిని ప్రధాన లక్ష్యంగా యమహా సహకారం అందిస్తోంది. ఇది యమహా కస్టమర్ భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతకు మరో నిదర్శనం. యమహా ఫాసినో 125, రే ZR 125 స్కూటర్లు లుక్ విషయంలో పూర్తిగా వేర్వేరు స్టైల్స్‌ను కలిగి ఉన్నప్పటికీ, టెక్నికల్‌గా మాత్రం ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారయ్యాయి. భద్రత కోసం రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS)ను స్టాండర్డ్‌గా ఇచ్చారు.



Click it and Unblock the Notifications








