యమహా RX100 మళ్లీ భారత మార్కెట్లోకి వస్తుందా? ఒకప్పుడు రోడ్లను ఏలిన లెజెండ్
భారతదేశ ఆటో మొబైల్ మార్కెట్లో కొన్ని మోడళ్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రజల ఆదరణను సొంతం చేసుకుంటుంటాయి. టూవీలర్ విభాగంలో చూసినట్లయితే చరిత్రలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోడళ్లలో యమహా RX100 పేరు ఎప్పటికీ ముందుంటుంది. ఒకప్పుడు యువతకు స్టైల్‌కు ప్రతీకగా నిలిచిన ఈ బైక్, తన తేలికైన బరువు, వేగవంతమైన పనితీరు, ప్రత్యేకమైన టూ-స్ట్రోక్ ఇంజన్ సౌండ్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. మార్కెట్ నుంచి వైదొలిగి దశాబ్దాలు గడిచినా, RX100పై ఉన్న మోజు మాత్రం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అందుకే మంచి కండిషన్‌లో ఉన్న పాత RX100 బైక్‌ల కోసం నేటికీ ఎంతోమంది లక్షల రూపాయలు వెచ్చించడానికి కూడా వెనుకాడడం లేదు.
సెకండ్ RX100 లకు కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. చాలా కాలంగా ఈ బైకును తిరిగి తీసుకురావాలని RX100 ప్రేమికులు కోరుతూనే ఉన్నారు. సోషల్ మీడియాల్లో కూడా ఇది త్వరలోనే లాంచ్ అవుతుందని వార్తలు వచ్చినప్పటికి కూడా కంపెనీ దీని రీ లాంచ్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ లెజెండరీ బైకును తిరిగి తీసుకురావడానికి యమహా సైతం ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలస్తుంది.

ఒక ఇంటర్వ్యూలో యమహా ఛైర్మన్ కూడా భారతదేశంలో RX100కు ఉన్న అభిమానాన్ని చూసి తాము ఆశ్చర్యపోయామని వెల్లడించారు. అవకాశం ఉంటే ఈ ఐకానిక్ బైక్‌ను మరోసారి మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీకి కూడా ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ కోరికను నెరవేర్చడం అంత సులభం కాదని కూడా స్పష్టం చేశారు. దానికి ప్రధాన కారణం ప్రస్తుతం అమల్లో ఉన్న కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు.
ఒకప్పుడు RX100కు ప్రాణం పోసిన టూ-స్ట్రోక్ ఇంజన్, నేటి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండదు. ఇది 2-స్ట్రోక్ ఇంజన్‌తో పనిచేస్తుంది. క్రమంగా ఉద్గార నిబంధనలు కఠినతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా 2-స్ట్రోక్ ఇంజన్ల ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది. భారతదేశంలో కూడా దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఈ ఇంజన్లకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. యమహా ఛైర్మన్ కూడా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

RX100కు సమానమైన పనితీరు నేటి 4-స్ట్రోక్ ఇంజన్‌తో అందించాలంటే కనీసం 200 సీసీ సామర్థ్యం అవసరం. అంటే, ఒకప్పుడు 98 సీసీ ఇంజన్‌తో అందించిన అనుభూతిని అదే స్థాయిలో నేటి టెక్నాలజీతో తిరిగి తీసుకురావడం కష్టం. పాత RX100లో 98 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 2-స్ట్రోక్ ఇంజన్ ఉండేది. ఇది 7,500 rpm వద్ద 11 hp శక్తిని, 6,500 rpm వద్ద 10.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేది.
ఆ కాలంలో భారత మార్కెట్లో లభించిన 100 సీసీ బైక్‌లలో అత్యంత శక్తివంతమైన ఇంజన్లలో ఇదొకటిగా నిలిచింది. ప్రస్తుతం ఉన్న 4-స్ట్రోక్ 100 సీసీ ఇంజన్లతో అదే స్థాయి పవర్, వేగం, స్పందనను అందించడం చాలా క్లిష్టమైన విషయం. అయితే RX100 ప్రత్యేకత కేవలం ఇంజన్‌తో మాత్రమే పరిమితం కాలేదు. ఆ బైక్‌కు ఉన్న ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ శబ్దం కూడా దాని గుర్తింపులో కీలక పాత్ర పోషించింది.

బైక్ ప్రత్యేక సౌండ్ ఇప్పటికీ ఎంతోమంది మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఈ కారణాలన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే, యమహా భవిష్యత్తులో RX100 స్ఫూర్తితో కొత్త బైక్‌ను రూపొందించే అవకాశం ఉన్నా, అది ఒకప్పుడు మనం చూసిన అసలైన RX100 మాత్రం కాదు. పాత RX100 అనుభూతిని యథాతథంగా తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. అందువల్ల పాత RX100 మళ్లీ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications