ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్లాటినా బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో, ఇప్పుడు కమ్యూటర్ బైక్ సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. ఈ సెగ్మెంట్లో కంపెనీ విక్రయిస్తున్న చీప్ అండ్ బెస్ట్ మోటార్‌సైకిల్ బజాజ్ ప్లాటినాలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది.
బజాజ్ ఆటో నుంచి లభిస్తున్న అత్యంత చవకైన మరియు అత్యధిక మైలేజీనిచ్చే బైక్ ప్లాటినా. భారత ద్విచక్ర వాహన మార్కట్లో దాదాపు 20 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న బజాజ్ ఆటో, బడ్జెట్ బైక్ సెగ్మెంట్లో తిరిగి తమ హవాను కొనసాగించాలని భావిస్తోంది.
బజాజ్ ఆటో 2006లో తొలిసారిగా తమ ప్లాటినా 100సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ బైక్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ జరగలేదు. ఇది ఈ సెగ్మెంట్లో హీరో ప్యాషన్, హీరో స్ప్లెండర్, హోండా డ్రీమ్ నియో, హోండా సిడి110 వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పల్సర్, ప్లాటినా సెగ్మెంట్లో కంపెనీ రెండు ముఖ్యమైన ఉత్పత్తులను విడుదల చేయనుందని చెప్పారు.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బజాజ్ ప్లాటినా బైక్‌లో 99.3సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.2 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా రానున్న బజాజ్ ప్లాటినా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కంపెనీ మెరుగైన మైలేజీనిచ్చే రిఫ్రెష్డ్ ఇంజన్‌ను ప్రవేశపెట్టవచ్చని అంచనా.
కొత్త ప్లాటినాకు మోడ్రన్ లుక్ కల్పించేందుకు కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది విడుదల కావచ్చని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ప్లాటినా మోటార్‌సైకిల్ ధర రూ.38.780 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








