ఈఐసిఎమ్ఏలో హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 500, స్ట్రీట్ 750 ఆవిష్కరణ
అమెరికన్ ఆటో దిగ్గజం హ్యార్లీ డేవిడ్‌సన్ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం 1000సీసీ కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్‌లను అభివృద్ధి చేస్తోందని గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ పలు కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా హ్యార్లీ డేవిడ్‌సన్ రూపొందించిన ఓ 500సీసీ మరియు మరో 750సీసీ బైక్‌లను ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న ఈఐసిఎమ్ఏ షోలో ఆవిష్కరించింది.
హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 500, హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 పేర్లతో కంపెనీ బైక్‌లను ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన ఈ పాపులర్ మోటార్‌సైకిల్ బ్రాండ్, అమెరికాకు వెలుపల ఇతర దేశాల్లో కూడా మంచి మార్కెట్ వాటాను, బ్రాండ్ ఇమేజ్‌ను సంపాధించుకునే దిశలో భాగంగా కంపెనీ ఈ చిన్న మోటార్‌సైకిళ్లను తయారు చేసింది.
మరి ఈ బుజ్జి హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 500, హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 రెండు బైక్‌లు కూడా క్రూయిజర్ స్టైల్ బైక్‌లే. టియర్ డ్రాప్ షేపులో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్స్, ఎలాంగేటెడ్ బాడీ, రౌండెడ్ బికినీ ఫెయిరింగ్, వి-ట్విన్ ఇంజన్స్ వంటివి ఈ బైక్‌ల ప్రత్యేకతలు.

హ్యార్లీ డేవిడ్‌సన్ తెలిపిన దాని ప్రకారం, ఈ కొత్త స్ట్రీట్ సిరీస్ మోటార్‌సైకిళ్లను ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది యువకుల నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసారు.

స్ట్రీట్ 750, స్ట్రీట్ 500 మోటార్‌సైకిళ్లను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేస్తున్నారు. ఇవి హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి గడచిన 13 ఏళ్ల తర్వాత లభిస్తున్న సరికొత్త బైక్‌లు కావటం విశేషం.

హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750, హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 500 బైక్‌లు సరికొత్త బ్లాక్ స్టయిలింగ్‌తో లభ్యం కానున్నాయి. హ్యార్లీ దీనిని 'డార్క్ కస్టమ్' అని పిలుస్తోంది. బ్లాక్ కలర్ ఇంజన్, బ్లాక్ కవర్స్, బ్లాక్ పుల్‌బ్యాక్ హ్యాండిల్ బార్స్, బ్లాక్ ఫోర్క్ గైటర్స్ మరియు లోవర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

అంతేకాకుండా, ఈ బైక్‌లలోని సైలెన్సర్ కూడా పూర్తిగా నలుపు రంగులోనే ఉంటుంది. హ్యార్లీ 70వ దశకంలో ఒరిజినల్ కెఫే రేస్ మోటార్‌సైకిళ్లలో ఈ తరహా సైలెన్సర్లను ఉపయోగించింది. ఆ తర్వాత ఇదే మొదటిసారి.

హ్యార్లీ 'రెవల్యూషన్ ఎక్స్' అని పిలిచే లిక్విడ్ కూల్డ్ వి-ట్విన్ ఇంజన్లను ఈ బైక్‌లలో ఉపయోగించారు.

ఈ ఇంజన్లు 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. రెగ్యులర్ హెచ్‌డి బైక్‌ల మాదిరిగానే ఇవి కూడా బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌తోనే లభ్యం కానున్నాయి.

అయితే, ఈ ఇంజన్ల సాంకేతిక వివరాలను మాత్రం హ్యార్లీ డేవిడ్‌సన్ ఇంకా వెల్లడించలేదు.

దూర ప్రయాణాలకు (లీజర్ బైకింగ్, టూరింగ్ బైకింగ్ మొదలైన వాటికి) అనువుగా ఉండేలా ఈ బైక్‌లను తయారు చేశారు.

ఇదంతా ఒక ఎత్తయితే, కస్టమర్లు ఈ బైక్‌లను తమకు నచ్చిన విధంగా అఫీషియల్ యాక్ససరీస్‌తో కస్టమైజ్ చేసుకోవటం మరొక ప్రత్యేకత.

ప్రారంభంలో భాగంగా హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ రెండు బైక్‌లలో ఒకదానిని మాత్రమే భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. బహుశా స్ట్రీట్ 750 కావచ్చని అంచనా.

భారత్‌లో ఈ బైక్‌ల ధరలను తక్కువగా ఉంచేందుకు గాను, వీటిని హర్యానాలోని బవాల్‌లో అసెంబ్లింగ్ కేంద్రంలో అసెంబుల్ చేయనున్నారు. ఇక్కడ అసెంబిల్ చేసిన వాటిని పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ బైక్‌ల ధరలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇవి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








