2015లో హీరో లీప్ హైబ్రిడ్ స్కూటర్ విడుదల
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ 2012లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించిన తమ లీప్ (Leap) హైబ్రిడ్ స్కూటర్‌ను ఫిబ్రవరి 2015 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది హీరో మోటోకార్ప్ నుంచి రానున్న మొట్టమొదటి హైబ్రిడ్ టూవీలర్ కావటం విశేషం.
హీరో లీప్ హైబ్రిడ్ స్కూటర్‌ను గుర్గావ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ప్రారంభంలో భాగంగా, పరిమిత సంఖ్యలో (సాలీనా 6000 యూనిట్లు మాత్రమే) దీనిని ఉత్పత్తి చేస్తారని సమాచారం. ఇటు పెట్రోల్‌తోనూ, అటు బ్యాటరీ పవర్‌తోను నడిచే లీప్ హైబ్రిడ్ స్కూటర్‌ను మొదటగా పాశ్చాత్య దేశాల్లో మార్కెట్ చేస్తామని, ఆ తర్వాత భారత్‌లోకి తెస్తామని గతంలో పవన్ ముంజాల్ తెలిపారు.

హీరో లీప్ హైబ్రిడ్ స్కూటర్‌కు సాంకేతిక వివరాలను ఇంత వరకు కంపెనీ వెల్లడించలేదు. కానీ, ఈ స్కూటర్‌ను ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే, డ్యూయెల్ పవర్‌తో దీనిపై 340 కి.మీ. దూరం వరకు ప్రయాణించవచ్చని గతంలో కంపెనీ పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకే, హీరో మోటోకార్ప్ తమ లీప్ హైబ్రిడ్ స్కూటర్‌ను ముందుగా అక్కడి మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనప్పటికీ, రానున్న రోజుల్లో హీరో మోటోకార్ప్ నుంచి అనేక సరికొత్త మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. గడచిన జనవరిలో కంపెనీ ప్రదర్శించిన ఆర్‌ఎన్‌టీ (RnT) 150 సీసీ డీజిల్ బైక్ కాన్సెప్ట్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. కాగా.. తమ డీజిల్ బైక్‌తో పాటుగా ఇతర మోడళ్లను (హైబ్రిడ్ స్కూటర్ లీప్, హెచ్‌ఎక్స్‌ఆర్250ఆర్‌లు) వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో విడుదల చేస్తామని హీరో మోటోకార్ప్ గతంలో స్పష్టం చేసింది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








